యాదగిరీశుడి కల్యాణం.. చూతుము రారండి

28న లక్ష్మీ నరసింహుల పెళ్లి ఘడియ.. కొండపై వేంచేసి ఉన్న బ్రహ్మాది దేవతలు విధాత: స్తంబోధ్బోవుడు శ్రీ లక్ష్మీనరసింహుడు కొలువైన యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవం సంబరం భక్తజనులకు దివ్యానుభూతినిస్తుంది. లోక కల్యాణం, విశ్వశాంతులను కాంక్షిస్తూ ముక్కోటి దేవతలు ఆహుతులుగా 11 రోజులపాటు అంగరంగ వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలలో అత్యంత శుభప్రదము, లోక కల్యాణ కారకమైన లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవం. బ్రహ్మోత్సవాల 8వ రోజు ఫాల్గుణ శుద్ధ నవమి రోజున ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు వైష్ణవ […]

యాదగిరీశుడి కల్యాణం.. చూతుము రారండి
  • 28న లక్ష్మీ నరసింహుల పెళ్లి ఘడియ..
  • కొండపై వేంచేసి ఉన్న బ్రహ్మాది దేవతలు

విధాత: స్తంబోధ్బోవుడు శ్రీ లక్ష్మీనరసింహుడు కొలువైన యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవం సంబరం భక్తజనులకు దివ్యానుభూతినిస్తుంది. లోక కల్యాణం, విశ్వశాంతులను కాంక్షిస్తూ ముక్కోటి దేవతలు ఆహుతులుగా 11 రోజులపాటు అంగరంగ వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలలో అత్యంత శుభప్రదము, లోక కల్యాణ కారకమైన లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవం.

బ్రహ్మోత్సవాల 8వ రోజు ఫాల్గుణ శుద్ధ నవమి రోజున ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు వైష్ణవ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం కన్నుల పండుగగా నిర్వహించబోతున్నారు. నవ వైకుంఠాన్ని తలపించేలా అద్భుత శిల్పకళా శోభిత పునర్నిర్మిత ఆలయంలో తొలిసారిగా ఉత్తర రాజగోపుర మాడవీధిలో లక్ష్మీ నరసింహ కల్యాణంకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, జగత్ రక్షకుడైన లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవాన్ని ఏటా యాదాద్రి కొండపై ఘనంగా నిర్వహించడం ఆనాదిగా వస్తున్నది. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు గరుడాళ్వార్ ఆహ్వానంతో కొండపైకి వేంచేసి విడిది చేసియున్న బ్రహ్మాది, ఇంద్రాది ముక్కోటి దేవతలు, అష్ట దిక్పాలకులు, సురులు మునులతో పాటు భక్తజనులు తిలకించే లక్ష్మీనరసింహుల కల్యాణ ఘట్టం భూలోకవాసులనే గాక ముల్లోకాలను తరింప చేస్తుంది.

అమ్మవారు లక్ష్మీదేవిని స్వామి దరికి చేరుస్తూ నిర్వహించే కల్యాణ మహోత్సవంతో స్వామి వారు ఆనందించి సకల లోకాలను ఆనందింప చేస్తారని ప్రతీది. ఆలయ ఈవో గీతా పర్యవేక్షణలో కళ్యాణోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. కళ్యాణోత్సవానికి ఒకరోజు ముందుగా వధూవరులైన లక్ష్మీనరసింహుల ఎదుర్కోలు ఘట్టాన్ని అర్చక పండిత బృందం సంబరంగా శాస్త్రయుక్తంగా నిర్వహిస్తారు.

ముక్కోటి దేవతల సాక్షిగా ఎదుర్కోలు ఘట్టంలో అశ్వవాహనంపై వచ్చిన నరసింహుడికి, ముత్యాల పల్లకిలో వేంచేసిన సముద్ర తనయ, క్షీరాబ్ధి కన్య లక్ష్మీదేవికి ఇరు కుటుంబాల పెద్దలు,దేవతలు, మునుల సమక్షంలో పరస్పరం ప్రవర చదువుతారు. వధూవరులైన లక్ష్మి నరసింహుల తరపున రెండు బృందాలుగా విడివడి అర్చకులు స్వామి, అమ్మవార్ల గుణగణాలతో చదివే ప్రవర భక్తులను ఆకట్టుకుంటుంది.

అయ్యవారి తరపు అర్చకులు స్వామివారి రూప లావణ్య, అవతార లీలలను పొగిడితే, అమ్మవారి పక్షం అయ్యవార్లు మా అమ్మ జగన్మాత లక్ష్మమ్మ..రూప లావణ్య, సుగుణాలు ..అంతకుమించి అంటూ పరిహాస మాడుతారు. స్వామి ఉగ్రరూపాన్ని వారు కీర్తిస్తే, అమ్మవారిని చూడడంతోనే స్వామి శాంతమూర్తి అయ్యాడని ఆటపట్టిస్తారు.

ఇలా మాటా మంతి, లగ్న పత్రిక ఖరారుల పెళ్లి తంతుతో ఎదుర్కోలు పర్వం సందడిగా సాగుతుంది. పిదప పట్టు వస్త్రాలు స్వర్ణభరణాలతో సిరుల దేవేరి లక్ష్మీదేవిని, శౌర్య, పరాక్రమ నరసింహ రూప స్వామి వారిని ముస్తాబు చేస్తారు. గజవాహనరుడై పెళ్లి కొడుకుగా ముస్తాబైన స్వామి వారు , పూల అలంకృత ముత్యాల పల్లకిలో లక్ష్మీదేవి… మేళ తాళాలు , మంగళ వాయిద్యాల మధ్య పెళ్లి మండపానికి విచ్చేస్తారు.

యాదాద్రి ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మి నరసింహచార్యులు, యజ్ఞికుల నేతృత్వంలో కల్యాణ వేదికపై కొలువైన స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అధ్యంతం నేత్రపర్వంగా నిర్వహిస్తారు . గంగా, కావేరి, కృష్ణ, గోదావరి, యమున పుణ్య నదుల జలాల ఆవాహాన, సంప్రోక్షణ, రక్షబంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీత ధారణ, మధుపర్క నివేదన, నూతన వస్త్రాలంకరణ, కన్యాదాన ఘట్టాలు నిర్వహిస్తారు.

లక్ష్మీదేవి తండ్రి అయిన సముద్రుడు స్వామివారి కి పాద ప్రక్షాళన(కాళ్లు కడిగి) చేసి కన్యాదానం చేస్తారు. బ్రహ్మ కడిగిన పాదాలను తాను కడిగి శ్రీవారి కి కన్యాదానం చేసి సకల పుణ్య రాశులను మూట కట్టుకున్నానంటూ ఇది కదా భాగ్యం అంటూ మురిసిపోతాడు. తదుపరి వధూవరులకు జీలకర్ర, బెల్లం ధారణ గావిస్తారు.

రంగురంగుల పుష్పాలు, దేదీప్య కాంతులతో అలంకృతమైన పెళ్లి మండపంలో తిరుమలేశుడు పంపిన పట్టు వస్త్రాలతో కల్యాణమూర్తిగా అలంకృతులై కొలువు తిరున లక్ష్మీనరసింహుల కళ్యాణోత్సవంలో నిర్వహించే మాంగళ్యధారణఘట్టం వర్ణించడానికి ఆ బ్రహ్మ దేవునికి కూడా తరం కాదు అంటారు. యజ్ఞిక పండితులు కల్యాణమూర్తులైన లక్ష్మీ నరసింహ లకు బ్రహ్మముడులు వేసి భక్తుల గోవింద నామస్మరణల మధ్య మాంగల్యా ధారణ ఘట్టం నిర్వహిస్తారు.

భక్తజనం ముక్కోటి దేవతలు, సుర మునులు కల్యాణ ఘట్టాన్ని వీక్షించి పులకిస్తారు. మాంగళ్యధారణ పిదప తలంబ్రా ధారణ ఘట్టం వధూవరుల మధ్య అర్చక స్వాములు పోటాపోటీగా నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించే ముత్యాల తలంబ్రాలు వధూవరుల తలంబ్రధారణ ఘట్టంలో వినియోగిస్తారు.

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుల కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు అందించే సంప్రదాయంలో భాగంగా సీఎం కేసీఆర్ దంపతులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. కల్యాణమూర్తులైన లక్ష్మీనరసింహులకు మంగళ నీరాజనాలు, ఆశీర్వచనాలు పలికాక, గజవాహనంపై సరికొత్త మాడవీధుల్లో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. కళ్యాణమూర్తులైన స్వామి, అమ్మ వార్ల దర్శన భాగ్యంతో భక్తులకు కలిగే ఆనందం నిరూపమానం.

కల్యాణ శోభతో సంతుష్టులై, ప్రసన్నమూర్తులై,జగధానందకరులై ఉండే స్వామి అమ్మవార్లు ఈ సమయంలో దర్శించే భక్తులకు కోరిన కోరికలను అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. తిరుమాడ వీధుల్లో ఊరేగాక స్వామి అమ్మవార్లు తిరిగి ఆలయానికి చేరుకుంటారు. మరుసటి రోజున గరుడవాహన సేవ, దివ్య విమాన రథోత్సవంతో భక్తులకు జగత్ కల్యాణ కారకుడైన స్వామి, జగన్మాత లక్ష్మి అమ్మ వారితో కలిసి దర్శనమిస్తారు.