Nalgonda : అత్యాచారం కేసులో 51ఏళ్ల జైలుశిక్ష.. నల్లగొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు!

నల్లగొండలో POCSO కేసులో నిందితుడు 51ఏళ్ల జైలు శిక్ష దొరికాడు, జడ్జి తీర్పు బాలికలపై దాడులను అరికట్టేందుకు హెచ్చరిక.

Nalgonda : అత్యాచారం కేసులో 51ఏళ్ల జైలుశిక్ష.. నల్లగొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు!

విధాత, నల్లగొండ : అత్యాచారం కేసులో నిందితుడికి నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు 51ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. జిల్లాలోని తిప్పర్తికి చెందిన మహమ్మద్ ఖయ్యూంపై నమోదైన పోక్సో కేసు విచారణ పూర్తవ్వగా జడ్జి రోజా రమణి మంగళవారం తీర్పు వెలువరించారు. కేసులో మహమ్మద్ ఖయ్యూంను దోషిగా పేర్కొంటు అతడికి 51 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. అత్యాచార కేసులో 20 ఏళ్లు, పోక్సో కేసులో 20 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ కేసులో10ఏళ్లు, సెక్షన్ 506 (మైనర్ బాలికపై బెదిరింపులు) కేసులో మరో ఏడాది శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించారు. బాలికలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు కఠిన శిక్షలు అవసరం అని.. ఈ తీర్పు సమాజానికి హెచ్చరికగా నిలవాలి అని జడ్జి రోజారమణి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

2021 లో తిప్పర్తి పీఎస్ పరిధిలో నిందితుడు మహమ్మద్ ఖయ్యూం దళిత మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లుగా కేసు నమోదైంది. ఈ కేసు విచారణ క్రమంలో పోలీసులు న్యాయస్థానికి సరైన సైంటిఫిక్ ఎవిడెన్స్ సమర్పించడంతో నిందితుడు ఖయ్యుం శిక్ష నుంచి తప్పించుకోలేకపోయాడు. ఈ కేసు తెలంగాణలో పోక్సో చట్టం కింద అత్యధిక కాలం జైలు శిక్ష విధించిన కేసులలో ఒకటిగా చరిత్రలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలే పోక్సో కోర్టు జడ్జి రోజారమణి ఓ మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన నిందితుడికి ఉరిశిక్షను విధిస్తూ తీర్పునివ్వడం గమనార్హం.