Mekapati |
విధాత: వైసిపి నుంచి వెళ్లిపోయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్థానంలో కొత్త ఇంచార్జీ నీ సీఎం జగన్ నియమించారు. ఈవిషయంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి మాటకు విలువ గౌరవం ఇచ్చి ఆయన చెప్పిన మేరకే కొత్త ఇంచార్జీ నియామకం చేస్తూ పెద్దాయన పెద్దరికాన్ని జగన్ నిలబెట్టారు. ఈమేరకు మేకపాటి రాజా రెడ్డిని ఉదయగిరి ఇంచార్జీ గా నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయి.
మొదటి నుంచి జగన్ వెంట నడిచిన మేకపాటి కుటుంబానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి లో గెలిచే ఛాన్స్ లేదని సర్వేల్లో తేలిన నేపథ్యంలో ఆయన్ను ఎమ్మెల్సీ గా పంపిస్తాను కానీ టికెట్ ఇవ్వను అని జగన్ చెప్పారట. కానీ వినని చంద్రశేఖర్ రెడ్డి తన పంతం వీడకుండా మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికి క్రాస్ ఓటింగ్ వేసి జగన్ నమ్మకాన్ని దెబ్బ తీశారని పార్టీ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయగా ఆయన ఇప్పుడు టిడిపి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపి ఆయనకు టికెట్ ఇస్తుందా లేదా అన్నది పక్కనబెడితే ఇప్పుడు ఉదయగిరికి వైసిపి కొత్త ఇంచార్జీ గా రాజా రెడ్డిని నియమించారు. ఆయన కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి రెండో తమ్ముడు అన్నమాట.
ఉదయగిరి విషయంలో రాజమోహన్ రెడ్డి ఎవరి పేరు చెబితే వారికే టికెట్ అని జగన్ ఫిక్స్ అయిన నేపథ్యంలో రాజారెడ్డిని ఇంచార్జీ గా నియమించారు. ఇక శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇంచార్జీ విషయంలో ఇప్పటికే అక్కడి ఇంచర్జిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ను తొలగిస్తూ ఆయన భార్య వాణిని ఇంచార్జిగా నియమించారు.
2019 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎంపిగా పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనును జగన్ ఎమ్మెల్సీ గా అవకాశం ఇస్తూ టెక్కలి ఇంచార్జీ గా కొనసాగిస్తున్నారు. అయితే ఈసారి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం అంటూ దువ్వాడ శ్రీను భార్య వాణి పేచీ పెట్టడంతో ఈ మోగుడూపెళ్లాల తగాదా సీఎం జగన్ వరకూ వెళ్లింది దీంతో ఇప్పుడు ఆమెను ఇంచార్జీ గా నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయి.
ఇదిలా ఉండగా తెక్కలిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నారు. ఇపుడు వాణి ఆయన మీద పోటీకి రెడీ అవ్వలన్నమాట.. గెలుపు ఎవరిదో చూడాలి మరి.