కాంగ్రెస్‌లో ఎల్లో, ఆరెంజ్, పింక్‌లు మిక్స్: పీసీసీ అధికార ప్ర‌తినిధి మహేశ్వర్ రెడ్డి

విధాత‌: కాంగ్రెస్‌లో ఇప్పుడు ఎల్లో, ఆరెంజ్, పింక్‌లు మిక్స్ అయ్యాయని పీసీసీ అధికార ప్ర‌తినిధి ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ప్ర‌తిసారి నేను పార్టీ మారుతానని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ ప్రచారం వెనుక ఎవరున్నారని ప్ర‌శ్నించారు. సోమ‌వారం గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ పార్టీ నుంచి అందరినీ పంపించాలని కంకణం కట్టుకున్నారా? అని నిల‌దీశారు. నేను ఏమైనా బీజేపీ నేతలను, అమిత్ షాను కలిశానా అని ప్ర‌శ్నించారు. డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ పార్టీ […]

  • Publish Date - November 21, 2022 / 01:25 PM IST

విధాత‌: కాంగ్రెస్‌లో ఇప్పుడు ఎల్లో, ఆరెంజ్, పింక్‌లు మిక్స్ అయ్యాయని పీసీసీ అధికార ప్ర‌తినిధి ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ప్ర‌తిసారి నేను పార్టీ మారుతానని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ ప్రచారం వెనుక ఎవరున్నారని ప్ర‌శ్నించారు.

సోమ‌వారం గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ పార్టీ నుంచి అందరినీ పంపించాలని కంకణం కట్టుకున్నారా? అని నిల‌దీశారు. నేను ఏమైనా బీజేపీ నేతలను, అమిత్ షాను కలిశానా అని ప్ర‌శ్నించారు. డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ పార్టీ మారితే నాకేం సంబంధం అన్నారు.

రామారావు పటేల్‌కు టికెట్ ఇప్పించింది..జానారెడ్డి అని ఆయ‌న పార్టీ నుంచి వెళితే జానారెడ్డికి సంబంధం ఉంటుందా? అని అడిగారు. హరిప్రియ నాయక్‌కు రేవంత్ టికెట్‌ ఇచ్చి గెలిపించుకున్నారని ఆమె పార్టీ మార్పుకు దానికి రేవంత్ బాధ్యుడా.. అని అడిగారు.

బాబు రావును పార్టీలోకి తెచ్చింది రేవంతని, అయన బీజేపీలోకి వెళ్ళాడంటే రేవంత్‌ను అనుమానించాలా.. అని ప్ర‌శ్నించారు. తాను ఎన్నిసార్లు శీల పరీక్ష చేసుకోవాల‌న్నారు. సీతలా అగ్ని పరీక్ష చేసుకోవాలా..? అని అడిగారు. తాను నియోజకవర్గానికి వెళ్తే అనుమానపు చూపులు వస్తున్నాయన్నారు.

నాలుగు సార్లు గాంధీ భవన్ కు రాకపోతే అనుమాన పడుతారా.. అని ప్ర‌శ్నించారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్లిపోయారని, ఎవరి స్వార్థం కోసం వారు వెళ్లి పోతున్నారన్నారు. నన్ను పార్టీ నుంచి వెళ్ల గొట్టాలనే కుట్ర జరుగుతోందన్నారు. గతంలో పీసీసీలుగా పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఇలాంటి గాసిప్స్ లేవని, ఇప్పుడెందుకు వ‌స్తున్నాయో తెలియ‌డం లేద‌న్నారు. అందరినీ వెళ్లగొట్టి పార్టీని ఏం చేయాలనుకుంటున్నారని ప్ర‌శ్నించారు.