అప్పుడప్పుడు ‘నో’ చెప్పొచ్చు బ్రో.. .శుభకార్యాలకు వెళ్లలేకపోతే ఆందోళన అవసరం లేదు!
ఎవరైనా ఏదైనా పెళ్లికి కానీ పార్టీకి గానీ పిలిస్తే.. వెళ్లాలని లేకపోయినా, అదే రోజు ఏదైనా పని ఉన్నా ఆ కార్యక్రమానికి వెళ్లడం కుదరదు

విధాత: ఎవరైనా ఏదైనా పెళ్లికి కానీ పార్టీకి గానీ పిలిస్తే.. వెళ్లాలని లేకపోయినా, అదే రోజు ఏదైనా పని ఉన్నా ఆ కార్యక్రమానికి వెళ్లడం కుదరదు. కొంత మంది ఇలాంటి సమయాల్లో చాలా ఒత్తిడి (Anxiety) కి గురవుతారు. పిలిచిన వాళ్లు ఏమనుకుంటారో.. మళ్లీ ఏదైనా కార్యక్రమానికి తమను పిలుస్తారా లేదా అని సతమతమైపోతారు. అయితే అలా ఒత్తిడికి గురవ్వాల్సినంత అవసరం లేదని.. పార్టీలకు ఆహ్వానించేవారు అసలు ఈ విషయాలను పట్టించుకోరని ఒక అధ్యయనం (Study) వెల్లడించింది.
దీనికి సంబంధించిన వివరాలు పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీలో ప్రచురితమయ్యాయి. బిజీ లైఫ్ స్టైల్ వల్ల చాలా సార్లు స్నేహితులు, బంధువులు పిలిచే వెళ్లలేకపోవడంతో యువతలో ఆందోళన ఎక్కువవుతోందని దానిపై లోతైన విశ్లేషణ చేసేందుకు ఈ అధ్యయనాన్నిచేశామని పరిశోధనలో పాలుపంచుకున్న జులియన్ గివి వెల్లడించారు. ఈ అధ్యయనంలో భాగంగా సుమారు 2000 మంది వలంటీర్లకు వివిధ ప్రశ్నలు వేసి సమాచారాన్ని సేకరించారు.
ఇందులో మూడొంతుల మంది అంటే 77 శాతం మంది.. తమకు ఇష్టం లేకపోయినా ఆహ్వానాలను అంగీకరించాల్సి వస్తోందని ఒప్పుకొన్నారు. ఒకవేళ వాళ్లు పిలిచినప్పుడే రాలేమంటే అవతలి వారు చిన్నబుచ్చుకుంటారేమోనని ఇలా చేస్తున్నామని చెప్పారు. మరో రౌండ్‌లో తాము ఈ రోజు ఇంట్లోనే ఉండాలనుకుంటున్నామని.. మిమ్మల్ని కలవలేమని వారి స్నేహితులకు చెప్పాలంటూ కొంతమంది వాలంటీర్లకు సూచించారు.
ఇది చెప్పడానికి వాలంటీర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. అలాగే కొన్ని జంటలలో భాగస్వామి ఔటింగ్ ప్లాన్‌లకు విరుద్ధంగా స్పందించాలని సూచించారు. ఇక్కడా నో చెప్పడానికి వారు తీవ్రంగా ఒత్తిడికి లోనయ్యారు. ఆశ్చర్యకరంగా అవతలి వైపు వారిని ప్రశ్నించగా.. తమ ఆహ్వానాన్ని మన్నించని వారి పట్ల వారు ఏమీ నెగటివ్‌గా ఆలోచించలేదని తేలింది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిస్సత్తువ ఆవహించడం సహజం.
లాంగ్ వీకెండ్స్, సెలవులు వచ్చినప్పుడు అనేక కార్యక్రమాలకు, పార్టీలకు ఆహ్వానాలు వస్తాయి. వాటిలో కొన్నింటికి నో చెప్పడం మంచిదే. దానికి భయపడాల్సిన పని లేదు. ఇది అవతలివారితో సంబంధాలపై నెగటివ్ ప్రభావాన్ని చూపబోదు అని గివి పేర్కొన్నారు. అయితే ఒకరి ఇన్విటేషన్లనే వరుసగా ఎగ్గొట్టడం మంచిది కాదని.. ఒక్కోసారి ఒకొక్కరివి మానుకోవాలని సూచించారు. పెళ్లిల్లకు వీలైనంత వరకు మానకుండా వెళ్లడమే మంచిదని అభిప్రాయపడ్డారు.