Love | ఆ ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి. కానీ ప్రియురాలు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఆమె మరణ వార్త తెలుసుకున్న ప్రియుడు కన్నీరుమున్నీరుగా విలపించాడు. చనిపోయిన ప్రియురాలికి తాళి కట్టి ఆమెపై తనకున్న ప్రేమను చాటాడు. జీవితంలో తాను పెళ్లి చేసుకోనని ఆ ప్రియుడు శపథం చేశాడు. ఈ ఘటన అసోంలోని కోసువా గ్రామంలో వెలుగు చూసింది.
ప్రేమంటే ఇదేరా! చనిపోయిన ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ప్రియుడు https://t.co/V7m4AB4ehe pic.twitter.com/FyHDWU0sdO
— vidhaathanews (@vidhaathanews) November 21, 2022
వివరాల్లోకి వెళ్తే.. మోరిగాన్ గ్రామానికి చెందిన బిటుపాన్, ప్రార్థనా బోరా(కోసువా) కొన్నేండ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఫిదా అయిన కుటుంబ సభ్యులు.. ఈ జంటకు పెళ్లి కూడా చేయాలని నిర్ణయించారు. త్వరలోనే పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించాలనుకున్నారు. కానీ ఇటీవలే ప్రార్థనా తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను గువహటిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది.
ఇక బిటుపాన్ కోసువా గ్రామానికి చేరుకుని ప్రియురాలి మృతదేహం నుదుటిపై కుంకుమ పెట్టి, మెడలో పూలదండ వేసి ఆ తర్వాత తాళి కట్టాడు. అనంతరం మృతదేహం చేతులతో మరో పూలదండను టచ్ చేయించి తన మెడలో వేసుకున్నాడు. చివరగా తాను జీవితాంతం పెళ్లి చేసుకోనని శపథం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అతని ప్రేమను చూసి ప్రార్థన కుటుంబ సభ్యులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.