విధాత: ‘ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపించండి.. మీ అభివృద్ధి చూడటానికి నేను సిద్ధం. డేట్, టైం మీరు చెప్పండి. లేదా నన్ను చెప్పమన్నా నేను చెప్తా’ అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పర్యటనలో ఉన్న షర్మిల మాట్లాడుతూ.. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక్కడి అభివృద్ధి షర్మిలకు ఏం తెలుసంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
‘సుబ్బారెడ్డికి నేను జగన్ రెడ్డి.. అంటే నచ్చలేదట. ఇప్పటినుంచి జగన్ ఆన్న గారు అనే అంటా. నాకేం అభ్యంతరం లేదు’ అని షర్మిల అన్నారు. వైసీపీ చేపట్టిన అభివృద్ధిని మీరు చూపిస్తే… మేధావులను పిలుద్దాం, తనతో పాటు మీడియా వస్తుంది..ప్రతిపక్షాలు వస్తాయి.. మా అందరికీ అభివృద్ధని చూపించండి అని కోరారు. మీరు అభివృద్ధి చేసింది ఎక్కడ? మీరు చెప్పిన రాజధాని ఎక్కడా? పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడా? మీ అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం అంతా చూడాలని అనుకుంటుంది.. మీ సవాల్ ను స్వీకరిస్తున్నా అంటూ షర్మిల వైసీపీని తూర్పారబట్టారు.