విధాత: ఆంధ్రప్రదేశ్ లో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని, ఇందుకు కేంద్రంలోని బీజేపీ కేంద్ర బిందువుగా ఉంటోందని ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల ఆరోపించారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీలు బీజేపీతో కుమ్మక్కయ్యాయని, ఈక్రమంలోనే కేంద్రాన్ని నిలదీయడంలో ఈరెండు పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. బుధవారం విశాఖ జిల్లా కార్యకర్తల సమావేశంలో షర్మిల మాట్లాడారు.
తెలుగు దేశం పార్టీ హయాంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన వారిని జైల్లో పెడితే.. అప్పట్లో జగన్ దీక్షలు చేశారని గుర్తు చేశారు. చెరో ఐదేళ్లు అధికారాన్ని పంచుకున్న ఈ రెండు పార్టీలూ ప్రత్యేక హోదాను గాలిలో కలిపారని ఎద్దేవా చేశారు.
మొత్తం ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచుతానని జగన్ అనలేదా? అంటూ షర్మిల ప్రశ్నించారు. మాట మాత్రమైనా జగన్ కేంద్రాన్ని హోదా విషయమై ఆడిగిందీ లేదంటూ దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వేగంగా కేంద్రం పావులుకదుపుతుంటే.. ఇందుకు వ్యతిరేకంగా జగన్ ఏనాడూ పోరాటం చేయలేదని విమర్శించారు. ఫలితంగా స్టీల్ ప్లాంట్ లో 30 వేల మందికి భరోసా పోయిందని అన్నారు.
గంగవరం పోర్టుని అదానీకి అప్పనంగా జగన్ ప్రభుత్వం అప్పజెప్పిందని ఆరోపించారు. దీంతో పాటు రాష్ట్రంలో విలువైన సంస్థలను తాకట్టు పెట్టారని దుమ్మెత్తిపోశారు. కేంద్రం పోలవరానికి నిధులు ఇవ్వలేదని, పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. మతతత్వ పార్టీ బీజేపీని తుంగలోకి తొక్కాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా వస్తుందని, ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కోరారు.