YTP | కాంగ్రెస్‌లో.. వైటీపీ విలీనం ఈ వారమే!
YTP । కొంతమంది బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు కూడా? విధాత: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jurally Krishna Rao) కాంగ్రెస్ పార్టీలో చేరడం.. అధికారపార్టీ BRSలో ఎమ్మెల్యేలపై సొంతపార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తం కావడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవచ్చని సర్వే (Surveys)లు చెబుతున్నాయి. ఎంఐఎం (MIM) బహిరంగం గానే తాము బీఆరెస్‌తోనే వెళ్తామని చెప్పింది. […]

YTP ।
- కొంతమంది బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు కూడా?
విధాత: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jurally Krishna Rao) కాంగ్రెస్ పార్టీలో చేరడం.. అధికారపార్టీ BRSలో ఎమ్మెల్యేలపై సొంతపార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తం కావడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవచ్చని సర్వే (Surveys)లు చెబుతున్నాయి. ఎంఐఎం (MIM) బహిరంగం గానే తాము బీఆరెస్‌తోనే వెళ్తామని చెప్పింది. దీంతో పూర్తి మెజారిటీ రాకపోతే ఎంఐఎం మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాతో బీఆరెస్ నేతలు ఉన్నారు. అలాగే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి.
ఏ పార్టీ ఎటువైపు ఉంటుందో అన్నది ఇప్పటికైతే అధికారికంగా వెల్లడి కాలేదు. కమ్యూనిస్టులు (communists) బీఆరెస్‌తో కలిసి వెళ్తారని అనుకున్నా అది జరిగేలా లేదు. బీఆరెస్, బీజేపీ (BRS and BJP) మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నదనే విపక్ష నేతల ఆరోపణలు దీనికి కారణం అంటున్నారు.
ఎన్నికలు (elections) దగ్గర పడుతున్న కొద్దీ CM KCR ఓటర్లను ఆకట్టుకునే పథకాలను ప్రకటిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వంద సీట్లు సాధిస్తామని పైకి బీరాలు పలుకుతున్నా.. కనీసం మెజారిటీ అయినా దక్కుతుందా అంటే కచ్చితంగా చెప్పలేమని ఆ పార్టీ వర్గాలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ (Congress) పార్టీ దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళిక రూపొందిస్తున్నది. ముందుగా అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా ఇంకా ఏ నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉన్నది.? అక్కడ పరిస్థితులను అంచనా వేస్తూ దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నది.
ఈ నేపథ్యంలోనే వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) అధ్యక్షురాలు షర్మిల (Sharmila) అడుగులు ఎటు అన్న చర్చ రాజకీయవర్గాల్లో కొంతకాలంగా జరుగుతున్నది. అమె సొంతంగానే పోటీ చేస్తారని, లేదా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటారనే వాదనలు వినిపించాయి.
అయితే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని, ఏపీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఆమెకు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. ఏపీలో బీజేపీ రాష్ట్ర పగ్గాలు దగ్గుబాటి పురంధేశ్వరికి (Daggubati Purandeshwari) అప్పగించారు. దీంతో షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని అక్కడ పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నది.
వైఎస్ అభిమానులే కాదు, ఏపీ ప్రజల్లో ఆయనపై అభిమానం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. వైఎస్ పాలనను అందిస్తామని రాజకీయ ప్రకటన చేస్తే దాన్ని ప్రజలు విశ్వసించరని, షర్మిలను పార్టీలో చేర్చుకుంటే ఆ సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని అంచనా వేస్తున్నారు.
అయితే తాను తెలంగాణ లోనే వైఎస్ పాలనను తీసుకొస్తానని ఆమె ప్రజలకు హామీ ఇస్తున్నారు. పాలేరు నియోజకవర్గం (Paleru constituency) నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. అయితే షర్మిలకు ఇక్కడ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ పరిణామాల వల్లనే ఆమె ఏపీ వైపు చూస్తున్నారు అంటున్నారు.
షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు డీకే శివకుమార్ (DK Shivakumar), కేవీపీ రామచంద్రరావు (KVP Ramachandra Rao) కొంతకాలంగా చర్చలు జరుపుతున్నారని సమాచారం. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలను సంప్రదించారనే వార్తలు వచ్చాయి.
అన్నీ కుదిరితే ఈ వారంలోనే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారని (YTP merger with Congress) తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కొంత కష్టపడితే పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని, ఈ నెలలోనే బీఆర్‌ఎస్, బీజేపీలోని మరి కొంతమంది అసంతృప్త నేతలను పార్టీలోకి తీసుకురావాలనుకుంటున్నారు. వారు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.