మోమోస్‌ ఎఫెక్ట్‌… మెమోరీలాస్‌.. లివర్‌ ఫెయిల్యూర్‌.. కనీసం నిలబడలేకపోయిన పదేళ్ల చిన్నారి…

ఢిల్లీ నగరంలో ఒక కుటంబానికి ఎదురైన ఆపద.. మొత్తం తల్లిదండ్రులకు తీవ్ర హెచ్చరిక చేస్తున్నది. పిల్లలు తినే మోమోస్‌ వంటి ఫాస్ట్‌ఫుడ్‌ ఎంత ప్రమాదకారి కాగలదో ఈ ఘటన రుజువు చేస్తున్నది.

Doctors linked her condition to frequent consumption of momos

ఫాస్ట్‌ఫుడ్‌! చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా ఆధునిక జీవన శైలిలో ఒక భాగమైపోయిన ఆహారం! అదే సమయంలో ఇది తీవ్ర ఆరోగ్య సమస్యలకు సైతం దారి తీస్తున్నది. ఢిల్లీలో ఒక పదేళ్ల చిన్నారి మోమోస్‌ తినడానికి బాగా అలవాటు పడిపోయింది. తాత నుంచి డబ్బులు తీసుకోవడం.. బండి దగ్గరకు వెళ్లి మోమోస్‌ తినడం నిత్యకృత్యమైంది. కానీ.. అదే అలవాటు ఆ పాప ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టింది. ఆ పాప మెదడు దాదాపు పనిచేయడం స్తంభించింది. క్రమక్రమంగా జ్ఞాపక శక్తి నశించిపోయింది. చిన్నచిన్న విషయాలు సైతం జ్ఞాపకం చేసుకోలేకపోయేది.. నడవడానికి కూడా సత్నతువ ఉండేది కాదు. ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. ఆ పాప లివర్‌ పాడైనట్టు మెడికల్‌ టెస్టులు పేర్కొంటున్నాయని జాగరణ్‌డాట్‌కామ్‌లో వచ్చిన కథనం పేర్కొంటున్నది. ఆమె శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ కారణంగా.. ఆమె మెదడు వాపునకు గురైంది. దీంతో ఆమెను ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది. మోమోస్‌ వంటి ఫాస్ట్‌ఫుడ్‌ను తరచూ తినడమే పాప అనారోగ్యానికి కారణమని వైద్యులు పేర్కొన్నారు. ప్లాస్లాఫెరిసెస్‌ (ప్లాస్మాను మార్చడం) ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడిన ఆ చిన్నారి.. మోమోస్‌ను తినడం పూర్తిగా మానేసింది.

తాత నుంచి డబ్బు తీసుకుని…

ఈ పాప తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులే. వారు ఉద్యోగానికి వెళ్లిన సమయంలో ఈ చిన్నారి.. తన తాత నుంచి డబ్బులు తీసుకుని, మోమోస్‌, స్నాక్స్‌ తదితర ఫాస్ట్‌ఫుడ్‌ కొని తింటూ ఉండేది. తన భర్త మొబైల్‌ రిపేర్‌షాపులో పనిచేస్తాడని, తాను ముఖర్జీ నగర్‌లోని ఒక ఇంట్లో కేర్‌టేకర్‌గా ఉంటున్నానని పాప తల్లి సావిత్రి మాధుర్‌ చెప్పారు. వారికి ఇద్దరు కుమార్తెలు. టాన్య (10), గౌరి (8).

సాధారణంగా తమ పిల్లలకు ఇంట్లోనే వాళ్లు కావాల్సినవి చేసి పెడుతుంటానని టాన్య తల్లిదండ్రులు చెబుతున్నారు. కానీ.. ఉద్యోగాల రీత్యా ఎక్కువ సమయంలో ఇంటికి దూరంగా ఉంటామని అన్నారు. టాన్య స్కూలు నుంచి ఇంటికి రాగానే మోమోస్‌, చిప్స్‌ వంటివి కొనుక్కొని తినేదని చెప్పారు. మొదట్లో విషయాలు మర్చిపోవడాన్ని గమనించామని, అదే సమయంలో చాలా నీరసంగా కనిపించేదని తెలిపారు. ఒక దశలో కనీసం నిలబడే పరిస్థితి కూడా లేకపోయిందని చెప్పారు.

ముందు సమీపంలోని ఒక హాస్పిటల్‌కు తీసుకువెళితే.. టెస్టుల్లో కామెర్లు అని తేలింది. దీంతో భయపడిపోయిన కుటుంబ సభ్యులు ఆమెను మోడల్‌టౌన్‌లోని ఒక హాస్పిటల్‌లో చేర్చారు. వాస్తవానికి తొలుత కాలేయ మార్పిడి చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. అయితే.. ప్లాస్మాఫెరిసెస్‌ చికిత్సతో ఆమె పరిస్థితి మెరుగైందని పీడియాట్రిక్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ శైలేశ్‌ శర్మ చెప్పారు. ఢిల్లీలో దాదాపు 35 శాతం పిల్లల్లో ఫ్యాటీ లివర్‌ సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపారు.

ఫాస్ట్‌ఫుడ్‌, ఎక్కువ సేపు స్క్రీన్‌ చూస్తూ గడపడం, కనీస ఫిజికల్‌ యాక్టివిటీ లేకపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణమని డాక్టర్‌ శైలేశ్‌ శర్మ చెప్పారు. ఈ కేసు తరహాలో చిన్నపిల్లల్లో సైతం తీవ్రస్థాయిలో లివర్‌ ఫెయిల్యూర్‌ కేసులు కనిపిస్తున్నాయని తెలిపారు.

ప్లాస్మాఫెరిసెస్‌ అంటే ఏమిటి?

ఢిల్లీలో చిన్నపిల్లలు, పెద్దవాళ్లు ఎవరైనా.. రోజుకు ఒకటి లేదా ఒకటిన్నర లీటర్ల నీళ్లు మాత్రమే తాగుతున్నారని డాక్టర్‌ శర్మ చెప్పారు. కానీ.. కనీసం రెండున్నర లీటర్ల నీటిని తాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. అప్పుడే జీర్ణక్రియ సక్రమంగా సాగుతుందన్నారు. ఫాస్ట్‌ఫుడ్‌ అధికంగా తింటే.. కాలేయానికి తీవ్ర ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు.

ఈ ఘటన ఒక్క కుటుంబానికి మాత్రమే పరిమితం కాదు. ఇది ప్రతి ఇంటికీ హెచ్చరిక. పిల్లల ఆహారపు అలవాట్లపై తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. తాత్కాలిక రుచుల కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన స్పష్టంగా చెబుతోంది.

ఫాస్ట్‌ఫుడ్‌ అనేది అనారోగ్యకరమైనదని తల్లిదండ్రులందరికీ తెలుసు. కానీ.. వాటి ఎఫెక్ట్స్‌ ఎంత తీవ్రంగా ఉంటాయో ఇలాంటి కథనాలు చదివినప్పుడే తెలుస్తుంది. ఇలాంటి ప్రమాదం ఏ చిన్నారికీ రాకూడదు. అందుకే ఇలాంటి విషయాలను నలుగురికీ పంచుకోండి. మీకు తెలిసిన వారికి ఈ వార్తను షేర్‌ చేయండి. ఫాస్ట్‌ఫుడ్‌ నుంచి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. 

ఇవి కూడా చదవండి..

ఫారెస్టు అధికారులకు సవాల్: అడవులు మార్చినా.. బుద్ది మార్చుకోని పెద్దపులి !
తెలంగాణ సర్కారు కుల సర్వేలో ‘విశ్వకర్మ’ల విచిత్ర పరిస్థితి

Latest News