ఉత్తరాఖండ్, మహారాష్ట్రాలలో భారీ వర్షాలు … చార్‌థామ్ యాత్ర వాయిదా

దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు తలాకుతలం చేస్తున్నాయి. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి

ఉత్తరాఖండ్, మహారాష్ట్రాలలో భారీ వర్షాలు … చార్‌థామ్ యాత్ర వాయిదా

విధాత, హైదరాబాద్ : దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు తలాకుతలం చేస్తున్నాయి. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో చార్ థామ్‌ యాత్రను వాయిదా వేసినట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. వర్షాల కారణంగా చమోలీ జిల్లాలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణప్రయాగ, గౌచర్ మధ్యలోని బద్రీనాద్ నేషనల్ హైవేపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని బైక్‌పై తిరిగొస్తుండగా.. మార్గమద్యంలో కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. అదే రోజు రాంనగర్ లోని ఓ వంతెన కూలిపోయింది. రెడ్ అలర్ట్ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని ఆదేశించారు.
మరోవైపు నేపాల్‌లో సైతం భారీ వర్షాలు, వరదలతో పాటు కొండచరియలు విరిగిపడిన ప్రమాదాల్లో ఇప్పటికే 14మంది మృతి చెందగా, మరో ఏడుగురు గల్లంతయ్యారు. నేపాల్ సహా బంగ్లాదేశ్‌తో పాటు భారత్‌లోని హిమాలయా ప్రాంత రాష్ట్రాలు ఉత్తరఖండ్‌, అస్సాం, హిమాచల్ ప్రదేశ్‌లలో సైతం భారీ వర్షాలు, వరదలు, కొండ చరియాల విరిగిపడుతున్నాయి.

మహారాష్ట్రాలో భారీ వర్షాలు
మహారాష్ట్రలోని రాణేలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయాన్నే గాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. ఈ వర్షం దాటికి పలుచోట్ల లోకల్ రైళ్లు తాత్కాలికంగా రద్దు కాగా.. కొన్ని భవనాలు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. రానేలోని షాపూర్ ప్రాంతంలో ఓ రిసార్టును వరదనీరు చుట్టుముట్టగా.. అందులో చిక్కుకున్న 43 మందికి పైగా పర్యటకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు వెల్లడించారు. బోట్లు, లైఫ్ జాకెట్ల సాయంతో వారిని కాపాడినట్లు తెలిపారు. వర్షాకాలం నేపథ్యలో ముందస్తు సన్నద్ధతలో భాగంగా ముంబయి, రాణే, పొల్దార్ జిల్లాల్లో పలుచోట్ల 13 ఎన్టీఆర్ఎఫ్ బృందాలను మోహరించి ఉంచినట్లు పేర్కొన్నారు. భారీ వర్షం నేపథ్యంలో కసర- టిట్వాలా స్టేషన్ల మధ్య పలు లోకల్ రైళ్ల సర్వీసుల్ని రద్దు చేసినట్లు సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు