జీవితంలో తొందరగా ఎదగాలనే ఆత్రుతలో ఓ పాతికేళ్ల కుర్రాడు చేసిన పని మొదటికే మోసం తెచ్చింది. బిజినెస్‌మ్యాన్‌గా సక్సెస్ అవ్వాలని దాచుకున్న డబ్బంతా పెట్టుబడి పెడితే.. ఉన్నది పోవడమే కాకుండా.. మీద నుంచి కోటి రూపాయల అప్పు మిగిలింది. ఇప్పుడు ఆ అప్పు ఎలా తీర్చాలో తెలియక సతమతవుతున్న ఆ యువకుడు సోషల్‌‌మీడియా వేదికగా సలహా అడిగాడు. తన అప్పుల నుంచి ఎలా బయటపడాలో సలహా ఇవ్వాలని ప్రాధేయపడుతున్నాడు. దీనికి సంబంధించిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది.

రెడ్డిట్‌లో యువకుడు పంచుకున్న అనుభవాల ప్రకారం.. 2021లో ఓ యువకుడు బీపీవో కంపెనీలో పనికి చేరాడు. అయితే 2023లో అనుకోని కారణాలతో అతని ఉద్యోగం పోయింది. అప్పుడే అతని ఆలోచనలో మార్పు వచ్చింది. ఒకరి కింద జాబ్ చేస్తూ ఇబ్బందులు పడే బదులు సొంత టాలెంట్‌తో బిజినెస్ చేసి సక్సెస్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అన్నుకున్నదే తడవుగా బంధువులు, సన్నిహితుల దగ్గర రూ.2లక్షల వరకు అప్పుగా తీసుకుని క్లౌడ్ కిచెన్ ప్రారంభించాడు. దానికి అతను ఊహించిన దానికంటే ఎక్కువగా రెస్పాన్స్ వచ్చింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌లు చాలా పెరిగిపోయాయి.

తాను అనుకున్న దానికంటే క్లౌడ్ కిచెన్ బిజినెస్ నడవడంతో అతనిలో ఆశ మరింత పెరిగింది. వ్యాపారం బాగా నడుస్తుంది కాబట్టి దాన్ని మరింత విస్తరించాలని భావించాడు. డిమాండ్ పెరుగుతుండటంతో కిచెన్‌ను మరింత పెద్దగా చేయాలని అనుకున్నాడు. దీనికోసం అదనపు స్థలం లీజుకు తీసుకోవాలని.. వేరే ప్రదేశానికి కూడా మారాలని నిర్ణయించుకున్నాడు. దాని ప్రకారం విస్తరించడంతో పాటు.. క్లౌడ్ కిచెన్ సామగ్రి కోసం అధిక వడ్డీలకు దాదాపు కోటి రూపాయల వరకు తీసుకొచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ అక్కడే అతనికి ఒక సమస్య మొదలైంది.

క్లౌడ్ కిచెన్ విస్తరించిన తర్వాత అతనికి ఆర్డర్లు కూడా బాగానే పెరిగాయి. కానీ వచ్చే ఆదాయానికి, చెల్లించాల్సిన వడ్డీలకు పొంతన లేకుండా పోయింది. ఆదాయం చారణా వస్తే.. వడ్డీలు బారాణా కట్టాల్సి వచ్చింది. దీంతో వచ్చిన డబ్బు వచ్చినట్లుగా వడ్డీలకు కడుతుండటంతో బిజినెస్ రొటేట్ చేయడానికి కూడా డబ్బుల్లేకుండా పోయింది. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో వాటిని ఎలా కట్టాలో తెలియక ఆందోళన చెందాడు. మానసికంగా ఆందోళనకు గురయ్యాడు. అతనికి ఉన్న అప్పుల్లో రూ.45 లక్షల వరకు హౌస్ లోన్ ఉంది. అది కాకుండా 45 లక్షల వరకు ప్రైవేటు వ్యక్తుల దగ్గర తీసుకున్న రుణం ఉంది. ఈ డబ్బును ఎలా కట్టాలో తెలియక దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్నాడు. దీనివల్ల కొద్దికాలంలోనే 25 కిలోల వరకు బరువు కూడా తగ్గిపోయాడు. ఇది చూసిన అతని కుటుంబసభ్యులు ఆందోళన చెంది 30 లక్షలు తీసుకొచ్చి అప్పులు చెల్లించారు. వెంటనే బిజినెస్ ఆపేయాలని షరతు విధించారు.

అయినప్పటికీ మిగిలిన డబ్బును కట్టడం అతనికి క్లిషంగానే ఉంది. హోమ్‌లోన్ ఈఎంఐ నెలకు రూ.67వేలు కట్టాల్సి ఉంది. అయితే అతని తల్లికి నెలకు రూ.15వేల ఆదాయం వస్తుందని.. సోదరి నెలకు రూ.36వేలు సంపాదిస్తుందని.. వాటన్నింటినీ ఈఎంఐ కట్టడానికి ఉపయోగిస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మళ్లీ లోన్ తీసుకుని.. చిన్న కేఫ్ ప్రారంభించాలా? లేక ఉద్యోగం చేసి అప్పులు తీర్చుకోవడంపై దృష్టిపెట్టాలా? మంచి సలహా చెప్పండి అని సోషల్‌మీడియా వేదికగా కోరాడు.

 

25M, restaurant failed, ₹70L debt remaining. Considering taking more debt to restart. Need honest advice.
by
u/StonedButterchicken in
IndiaBusiness

దీనికి విపరీతమైన స్పందన వచ్చింది. మరోసారి వ్యాపారం కోసం అప్పులు చేసి చిక్కుల్లో పడవద్దని చాలామంది సూచించారు. ముందు స్థిరమైన ఉద్యోగంలో చేరి.. అప్పులు తీర్చుకోవాలని, ఆ తర్వాతే కొత్త వ్యాపారం గురించి ఆలోచించమని సలహా ఇచ్చారు. అయితే ఈ ఘటన యువ వ్యాపారవేత్తలకు ఒక వార్నింగ్ లాంటిది అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిజినెస్‌లో కొంచెం లాభాలు కనిపించగానే.. అత్యాశకు పోయి.. బిజినెస్‌ను విస్తరించాలని.. తలకు మంచి అప్పులు చేస్తే జీవితం మొత్తం తలకిందులు అవుతుందని అంటున్నారు.