L.K ADVANI | హాస్పిటల్‌లో చేరిన అద్వానీ.. నిలకడగా ఆరోగ్యం

బీజేపీ కురువృద్ధ నేత, మాజీ ఉప ప్రధాని లాల్‌ కృష్ణ అద్వానీ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఆయనను మంగళవారం ఢిల్లీలోని అపోలో హాస్పిటల్‌లో చేర్చారని అక్కడి విశ్వసనీయ వర్గాలు తెలిపాయి

L.K ADVANI | హాస్పిటల్‌లో చేరిన అద్వానీ.. నిలకడగా ఆరోగ్యం

న్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధ నేత, మాజీ ఉప ప్రధాని లాల్‌ కృష్ణ అద్వానీ మరోసారి హాస్పిటల్‌లో చేరారు. ఆయనను మంగళవారం ఢిల్లీలోని అపోలో హాస్పిటల్‌లో చేర్చారని అక్కడి విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నదని పేర్కొన్నాయి.

అనంతరం అపోలో హాస్పిటల్ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మాజీ ఉప ప్రధాని ఎల్ అద్వానీ ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యారు. ఆయనకు డాక్టర్‌ వినీత్‌ సూరి వైద్యసేవలు అందిస్తున్నారు. రోజువారీ పరీక్షలు, ఫాలోఅప్‌ టెస్టుల కోసం ఆయన హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యారు. త్వరలోనే ఆయన డిశ్చార్జ్‌ అవుతారు’ అని అందులో తెలిపారు. ఆయనను బుధవారం డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉన్నదని హాస్పిటల్‌ వర్గాలు చెబుతున్నాయి.

అద్వానీ వయసు ప్రస్తుతం 96 ఏళ్లు. అవిభాజ్య భారత్‌లో ఆయన జన్మించారు. జూలై మొదటివారంలో కూడా అద్వానీ స్వల్ప అస్వస్థతకు గురవడంతో వెంటనే హాస్పిటల్‌లో చేర్చారు. కొద్ది రోజులు ఆయనను వైద్య పర్యవేక్షణలో ఉంచి, అనంతరం డిశ్చార్జ్‌ చేశారు. ఆయనకు న్యూరాలజీ విభాగం సీనియర్‌ కన్సల్టెంట్‌ వినీత్‌ సూరి వైద్య సేవలు అందించారు. అంతకు ముందు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కూడా అద్వానీ అడ్మిట్‌ అయ్యారు. రాత్రంతా ఆయనను పర్యవేక్షణలో ఉంచిన వైద్యులు.. ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నదని పేర్కొంటూ మరుసటి రోజు డిశ్చార్జ్‌ చేశారు.
బీజేపీ రాజకీయ ఎదుగుదలలో వాజ్‌పేయితోపాటు అద్వానీ కృషి ఎంతో ఉన్నది. ప్రత్యేకించి అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అద్వానీ చేపట్టిన రథ యాత్రతో ఆయన హిందూ ఓటర్లకు బీజేపీ బాగా దగ్గర చేశారు. అదే ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది.