80 హిప్పోల ప్రాణదాత..అనంత్ అంబానీ!

వంతారా జంతు సంరక్షణ కేంద్రం నిర్వహణతో జంతుప్రేమికుడిగా నిలిచిన రిలయన్స్ సంస్థ వారసుడు అనంత్ అంబానీ కొలంబియా ప్రభుత్వం మరణశాసనానికి గురికాబోతున్న 80 హిప్పోలను(నీటీ ఏనుగులు) కాపాడేందుకు ముందుకొచ్చి మరోసారి వార్తల్లో నిలిచారు.

80 హిప్పోల ప్రాణదాత..అనంత్ అంబానీ!

వన్యప్రాణులు, మూగజీవాల సంరక్షణకు నేనున్నానంటూ వేలకోట్లు వెచ్చించి వంతారా అనే జంతు సంరక్షణ..పునరావాస కేంద్రాన్ని నిర్వహిస్తున్న అనంత్ అంబానీ పెద్ద మనసు అందరికి తెలిసిందే. తాజాగా కొలంబియా ప్రభుత్వం మరణశాసనానికి గురికాబోతున్న 80 హిప్పోలను(నీటీ ఏనుగులు) కాపాడేందుకు ముందుకొచ్చి మరోసారి వార్తల్లో నిలిచారు.

కొలంబియా దేశంలో 80 నీటి ఏనుగులను (Hippos) చంపేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయం తెలుసుకున్న రిలయన్స్ సంస్థ వారసుడు అనంత్ అంబానీ వాటిని కాపాడే బాధ్యత తనది అని ముందుకొచ్చారు. వాటిని చంపవద్దని.. గుజరాత్‌లో తను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘వంతారా’ (Vantara) జంతు సంరక్షణ కేంద్రంలో వాటికి శాశ్వత ఆశ్రయం కల్పిస్తానని, అన్ని సదుపాయాలు అందిస్తానని కొలంబియా ప్రభుత్వానికి తెలియజేశారు. వాటిని వంతారాకు తరలించాలని కోరారు. అనంత్ అంబానీ నిర్ణయంతో హిప్పోలకు ప్రస్తుతానికి ప్రాణాపాయం తప్పినట్లేనని భావిస్తున్నారు. ప్రాణం ఉన్న ప్రతి జీవికీ బతికే హక్కు ఉంటుందని ఆయన తీసుకున్న ఈ గొప్ప నిర్ణయానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.

అనంత్ అంబానీ నిర్ణయం పట్ల వన్యప్రాణుల ప్రేమికులు, పర్యావరణ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 80 హిప్పోల ప్రాణాలు కాపాడేందుకు ముందుకొచ్చిన అనంత్ రియల్ హీరో అంటూ హాట్సాఫ్ చెబుతున్నారు.

అసలు హిప్పోలను ఎందుకు చంపాలనుకున్నారు..?

కొలంబియాలోని మగ్డలేనా నది పరివాహక ప్రాంతంలో.. ఒక పర్యావరణ సమస్య తలెత్తింది. ఇక్కడ సుమారు 200 వరకు హిప్పోపొటమస్‌లు జీవిస్తున్నాయి. వీటి వల్ల స్థానిక జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యత, మనుషుల భద్రతపై ప్రభావం పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. కొలంబియా ప్రభుత్వం 80 హిప్పోలను చంపాలని నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ హిప్పోలు దక్షిణ అమెరికాకు చెందినవి కావు. వీటిని అప్పట్లో డ్రగ్‌ వ్యాపారి ఎస్కోబార్‌ ఆఫ్రికా నుంచి తీసుకువచ్చి తన సొంత జూలో ఉంచాడు. అనంతరం ఎస్కోబార్‌ను అరెస్టుచేయడంతో హిప్పోల సంరక్షణ పట్టించుకునే వారిలేక..అవి నదీ పరివాహకప్రాంతంలో ఉంటున్నాయి. వీటి సంతతి బాగా పెరగడంతో ఆహారం కోసం జనావాస ప్రాంతాలకు చొరబడుతున్నాయి. ప్రజలపై దాడులు చేయడం, చేపలు, తాబేళ్లను తినడం చేస్తున్నాయి.

దాంతో వాటి జనాభాను నియంత్రించాలని కొలంబియా సర్కారు నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగా 80 హిప్పోలను చంపివేయాలని ప్రభుత్వ అధికారులు ప్రతిపాదించారు. ఈ నిర్ణయాన్ని ఆపాలని అనంత్ అంబానీ కొలంబియా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. హిప్పోలను చంపాలనే నిర్ణయం సరికాదని వెల్లడించారు. జంతువులను చంపడం కంటే, వాటిని సురక్షితంగా మరో ప్రదేశానికి తరలించడం ఒక మంచి పరిష్కారం అని అన్నారు. ఈ విషయంపై కొలంబియా పర్యావరణ మంత్రి ఐరీన్ వెలెజ్ టోర్రెస్‌కు ఒక లేఖ రాశారు.

వన్యప్రాణుల పునరావాస కేంద్రంగా వంతారా

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న వంతారా, ప్రపంచంలోనే అతిపెద్దదైన అత్యంత అధునాతన వన్యప్రాణుల సంరక్షణ.. పరిరక్షణ కేంద్రాలలో ఒకటిగా కొనసాగుతుంది. అనంత్ అంబానీ దీనిని 3000 ఎకరాల్లో (కృత్రిమ అడవి) ఏర్పాటు చేసి.. జంతువులకు రక్షిస్తున్నారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా.. సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్‌బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి.

అనంత్ అంబానీకి వన్యప్రాణుల సంరక్షణ కృషికి ‘గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు’ దక్కింది. అమెరికాలో జరిగిన అంతర్జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో ‘గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు’తో ఆయనను సత్కరించారు. వంతారా ద్వారా జంతువుల రక్షణ, చికిత్స, పునరావాసం, సంరక్షణలో ఆయన నాయకత్వం వహించినందుకు ఈ అవార్డు ఆయనకు లభించింది. అసియా నుంచి ఈ అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తి అనంత్ అంబానీ కావడం విశేషం.

ఇవి కూడా చదవండి :

నికోబార్ లో కేంద్రం పర్యావరణ విధ్వంసం : రాహుల్ గాంధీ ట్వీట్
Viral Photo | ఒకే స్కూటర్‌పై ఆరుగురు చిన్నారులు.. బెంగళూరులో తీసిన ఫొటో వైరల్!