Ram Navami 2026 : శ్రీ రామనవమికి అయోధ్య రామ మందిరం ముస్తాబు

శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరం అద్భుతంగా అలంకరించబడింది. సూర్య తిలకం ప్రత్యేక ఆకర్షణగా భక్తులను ఆకట్టుకోనుంది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Mar 26, 2026, 12:38 pm IST
Read Time: 5 mins
Ram Navami 2026 : శ్రీ రామనవమికి అయోధ్య రామ మందిరం ముస్తాబు

విధాత : శ్రీ రామ నవమికి అయోధ్య రామ మందిరం అత్యద్బుతంగా ముస్తాబవుతుంది. శ్రీరామనవమి సందర్భంగా బాలరాముడి దర్శనం కోసం తరలివచ్చే లక్షలాది భక్తజనం రద్దీని దృష్టిలో పెట్టుకుని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేపట్టింది. ముఖ్యంగా నూతన ఆలయ ప్రతిష్ఠాపన జరిగిన తర్వాత అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలను ఏటా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భారీ ఏర్పాట్లు చేస్తూ వస్తుంది. రామాలయాన్ని దేశ, విదేశాల నుంచి తెప్పించిన రంగురంగుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయంతో పాటు ప్రాంగణ కట్టడాలన్నింటిని పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణతో శోభాయామానంగా ముస్తాబు చేస్తున్నారు. లక్షన్నర దీపాలంకరణ వేడుక కోసం సరయూ నది ఒడ్డున, చౌధరీ చరణ్ సింగ్ ఘాట్ వరకు దీపోత్సవం ఏర్పాట్లు చేశారు.

ప్రత్యేక ఆకర్షణగా సూర్యతిలకం

శ్రీరామ నవమి వేడుకలో భాగంగా బాలరాముడికి జరగనున్న ‘సూర్య తిలకం’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రత్యేక ఆప్టో-మెకానికల్ వ్యవస్థ (అద్దాలు, లెన్స్‌ల వ్యవస్థ) ద్వారా మధ్యాహ్నం 12గంటలకు అభిజిత్ లగ్నంలో సూర్య కిరణాలు నేరుగా బాలరాముడి నుదుటి తిలకం తరహాలో 4నిమిషాల పాటు ప్రసరించేలా ఏర్పాట్లు చేశారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అదనపు ఏర్పాట్లు చేశారు. సూర్యవంశీయుడైన శ్రీరాముడు చైత్ర మాసంలో శుక్ల పక్ష నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడని పురాణ కథనం. అందుకే సూర్య కిరణాలతో రామునికి తిలకం దిద్దడం వల్ల రామునిలోని దైవత్వం మేల్కొంటుందని విశ్వసిస్తారు.

శ్రీరామ జన్మోత్సవ వేడుకలు వీక్షించేందుకు అయోధ్య నగరం అంతటా పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. డ్రోన్ల సాయంతో సరయూ నది జలాలను భక్తులపై జల్లనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన సమయాన్ని పొడిగించడమే కాకుండా, ఎండ తీవ్రత దృష్ట్యా చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యాలను కల్పించారు. అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ప్రత్యేక లడ్డూలు ప్రసాదాలు అందచేయనున్నారు. భద్రతా చర్యల నేపథ్యంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ నిఘాను పెంచారు. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ నినాదాలు, భక్తి గీతాలతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణంతో అయోధ్య ప్రాంతం భూలోక వైకుంఠాన్ని తలపిస్తుంది.

ఇవి కూడా చదవండి :

Bangladesh bus accident| బంగ్లాదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం..23మంది గల్లంతు
Monalisa | వివాదాల నడుమ మోనాలిసా-ఫర్మాన్ ఖాన్ వివాహం.. ఇలా చేస్తే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాం..