కేంద్ర ఉద్యోగులకు డీఏ 2% పెంపు.. 60%కు చేరిన భత్యం, జనవరి నుంచే అమలు

కేంద్ర ఉద్యోగులకు డీఏ 2% పెంపుతో 60%కు చేరింది. జనవరి 2026 నుంచి అమలు కానున్న ఈ నిర్ణయంతో బకాయిలు కూడా లభించనున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి 8వ వేతన సంఘంపై ఉంది? పూర్తి వివరాలు తెలుసుకోండి.

కేంద్ర ఉద్యోగుల డీఏ 2 శాతం పెంపు నేపథ్యంలో చేతిలో నగదు నోట్లు పట్టుకున్న వ్యక్తి

కేంద్ర ఉద్యోగులకు డీఏ 2% పెంపు.. జీతాల్లో పెరుగుదలపై ఆశలు

DA Hike to 60% and 8th Pay Commission Buzz: Big Salary Boost for Central Govt Employees?

విధాత భారత్​ డెస్క్​ | 18 ఏప్రిల్​ 2026 | హైదరాబాద్​:

DA Hike to 60% : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం భారీ ఊరటనిచ్చింది. కరవు భత్యం (డీఏ)ను మరో 2 శాతం పెంచుతూనిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 58 శాతంగా ఉన్న డీఏ ఇప్పుడు 60 శాతానికి చేరింది. ఈ పెంపు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో గత నెలల బకాయిలు కూడా ఉద్యోగులు, పెన్షనర్లకు అందనున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయాల మధ్య ఈ నిర్ణయం లక్షలాది కుటుంబాలకు ఉపశమనం కలిగించనుంది.

డీఏ పెంపుతో ఉద్యోగుల చేతికి వచ్చే జీతం కొంత మేర పెరుగుతుంది. రూ.18,000 ప్రాథమిక వేతనం ఉన్న ఉద్యోగికి మొత్తం ఆదాయం పెరగనుంది. ఇది 28,800కు చేరుతుంది. 29,200 బేసిక్​ ఉన్నవారికి 46,720 దాక పెరుగుతుంది. ఉన్నతాధికారుల జీతాల్లో కూడా మంచి పెరుగుదల కనిపించనుంది. అయితే ఈ డీఏ పెంపు కంటే కూడా అందరి 8 వేతన సంఘం పైనే దృష్టి  ఎక్కువగా ఉంది.

ఇప్పుడు అసలు చర్చ 8 వేతన సంఘంపైనే

డీఏ పెంపు తక్షణ లాభం ఇస్తే, 8వ వేతన సంఘం అమలైతే దీర్ఘకాలిక భారీ లాభాలు ఉంటాయని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం కనీస మూల వేతనం రూ.18,000గా ఉంది. ఉద్యోగ సంఘాలు దీన్ని రూ.69,000కు పెంచాలనిడిమాండ్ చేస్తున్నాయి. దీనికి 3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే తక్కువ స్థాయి ఉద్యోగుల నుంచీ ఉన్నతాధికారుల వరకు అందరి జీతాల్లో చారిత్రాత్మక మార్పు రావచ్చు. ముఖ్యంగా కేంద్ర ఉద్యోగుల్లో ఈ అంశంపై భారీ ఆసక్తి నెలకొంది.

ఇంక్రిమెంట్లు, హెచ్‌ఆర్‌ఏ, పెన్షన్‌లోనూ ఆశలు

ఉద్యోగ సంఘాలు కేవలం బేసిక్ పే పెంపుతో ఆగడం లేదు. కనీస హెచ్‌ఆర్‌ఏ 30 శాతం ఉండాలని, ప్రతి సంవత్సరం 6 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరుతున్నాయి. పదోన్నతుల సమయంలో రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వడం, కనీసం రూ.10,000 ప్రయోజనం కల్పించడం, గ్రాట్యుటీ లెక్కల్లో మార్పులు చేయడం వంటి డిమాండ్లు కూడా ఉన్నాయి.

అలాగే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీంతో ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు కూడా 8వ వేతన సంఘంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎప్పుడు ప్రకటన?

ప్రస్తుతం కేంద్రం అధికారికంగా 8వ వేతన సంఘం అమలు తేదీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఉద్యోగ సంఘాల ఒత్తిడి, పెరుగుతున్న అంచనాల నేపథ్యంలో త్వరలోనే దీనిపై కీలక చర్చలు మొదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

డీఏ 60%కి చేరిన తర్వాత ఇప్పుడు కేంద్ర ఉద్యోగుల ముందున్న పెద్ద ప్రశ్న ఒక్కటే… 8 వేతన సంఘం ఎప్పుడు? జీతాలు ఎంత పెరుగుతాయి?

Latest News