తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటి కుష్బూ భర్త దర్శకుడు సుందర్ పోటీ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దర్శకుడు సుందర్ సీ మధురై సెంట్రల్ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. నటి ఖుష్బూ తన భర్త నిర్ణయంపై గర్వంగా స్పందించారు.
విధాత : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నాయకురాలు, నటి కుష్బూ భర్త, ప్రముఖ దర్శకుడు సుందర్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. సుందర్ మధురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. పొత్తులో భాగంగా బీజేపీ అన్నాడీఎంకేకు వదిలిన ఈ సీటులో సుందర్ అన్నాడీఎంకే పార్టీ గుర్తుపైనే పోటీ చేస్తారు. కుష్బూ ప్రస్తుతం బీజేపీ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భర్త సుందర్ పోటీపై ఖుష్బూ స్పందిస్తూ.. ‘సినీ కెరీర్‌లో మూడు దశాబ్దాల పాటు నా భర్తకు ఈ రాష్ట్ర ప్రజలు మద్దతుగా నిలిచారని.. అందుకే ఇప్పుడు వారికి సేవ చేయడమే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగారు. ఆయన భార్యగా నేను గర్వపడుతున్నానంటూ ఆమె ట్వీట్ చేశారు.
తమిళ రాజకీయాల్లో సినీ రంగం ప్రభావం..
తమిళనాడు రాజకీయాలలో కొన్ని దశాబ్ధాలుగా సినీ రంగం వారి హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేవలం నటులు మాత్రమే కాకుండా.. రచయితలు, దర్శకులు కూడా తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. దివంగత సీఎంలు ఎంజీ రామచంద్రన్, జయలలితలు అన్నాడీఎంకే నుంచి సీఎంలుగా పనిచేశారు. ఎంజీ రామచంద్రన్ మూడుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన వారసురాలిగా అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టిన జయలలిత పురుచ్చతలైవిగా పేరొంది ఆరుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
సినీ రచయిత కరుణానిధి సైతం డీఎంకే అధినేతగా,. ఐదుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు, ప్రస్తుత సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి.. ప్రస్తుతం తమిళనాడు డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు.
తమిళ నటుడు శివాజీ గణేషన్ తొలుత కాంగ్రెస్‌లో చేరి, ఆ తర్వాత సొంతంగా ‘తమిళగ మున్నేట్ర మున్నాని’ పార్టీ పెట్టినా ఆయన విజయం సాధించలేకపోయారు. ఆ తర్వాత కెప్టెన్ విజయకాంత్ డీఎండీకే పార్టీ పెట్టినా సక్సెస్ అందుకోలేకపోయారు. కమలహాసన్ 2018లో ఎంఎన్ఎం (మక్కల్ నీది మయ్యం) పేరుతో ఒక పార్టీని స్థాపించారు. 2019 లోక్‌సభ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ పోటీ చేసి.. ఎక్కడా కనీసం ప్రభావం చూపలేకపోయింది. చివరకు తను కూడా ఓడిపోయారు. దీంతో 2024లోక్ సభ ఎన్నికల్లో పోటీ నుంచి ఎంఎన్ఎం పార్టీ తప్పుకుని డీఎంకేకు మద్దతు ప్రకటించింది. డీఎంకే మద్దతుతో కమల హాసన్ రాజ్యసభకు ఎంపికయ్యారు.
సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న రజనీకాంత్ మాత్రం రాజకీయాల్లోకి వస్తున్నానని పలుమార్లు హడావుడి చేసి చివరకు వెనక్కి తగ్గారు. సీనియర్ హీరో శరత్ కుమార్ అఖిల భారత సమత్తువ మక్కల్ కట్చి పార్టీని స్థాపించి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత భార్య, సీనియర్ నటి రాధికతో పాటు బీజేపీలో చేరి తన పార్టీని ఆ పార్టీలోనే విలీనం చేశారు. కార్తీక్ అఖిల భారత నాడలుం మక్కల్ కట్చి అనే పార్టీ పెట్టినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. నటీ మణులు రాధిక, కస్తూరీ, ఖుష్బూలు ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు.
కొత్తగా టీవీకే అధ్యక్షుడు, హీరో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒంటరి పోరాటం చేస్తున్నారు. డీఎంకే కాంగ్రెస్ కూటమి, ఏఐఏడీఎంకే, బీజేపీ కూటమి వంటి బలమైన క్యాడర్ ఉన్న పార్టీలను ఢీకొని విజయ్ పార్టీ విజయం సాధించడం అంత తేలిక కాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Telangana Weather Updates : తెలంగాలో కొనసాగనున్న వర్షాలు : వాతావరణ శాఖ
తొలిముద్దతో చిన్నారులకు పోషకాహారం : సీఎంరేవంత్ రెడ్డి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram