శృంగార సమ్మతి వయసు తగ్గించొద్దు.. కేంద్ర ప్రభుత్వానికి న్యాయ కమిషన్ సూచన

న్యూఢిల్లీ: సమ్మతితో శృంగారంలో పాల్గొనే వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించవద్దని లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొనడంపై పోక్సో చట్టంలో వయోపరిమితి 18 ఏళ్లుగా ఉన్నది. దీనిని తగ్గించడం వల్ల బాల్య వివాహాలు, చిన్నారుల అక్రమ రవాణా వంటివాటిపై పోరాటంలో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయని లా కమిషన్ అభిప్రాయపడింది.
అయితే.. చట్టానికి వ్యతిరేకమైనా 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలు పరస్పర సమ్మతితో శృంగారంలో పాల్గొన్న కేసులలో పరిస్థితిని మెరుగుపర్చేందుకు చట్టంలో తగిన సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నది. ఇటువంటి కేసులలో న్యాయ విచక్షణ మార్గదర్శనం చేయాల్సి ఉంటుందని తెలిపింది. పోక్సో చట్టంలోని శృంగారానికి సమ్మతిపై వయోపరిమితికి సంబంధించి పెరుగుతున్న ఆందోళనలకు ఒక పరిష్కారం చూపాలని గత ఏడాది డిసెంబర్‌లో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ పార్లమెంటును కోరిన విషయం తెలిసిందే.
‘ఇద్దరు మైనర్లు ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొన్నప్పటికీ దానికి పోక్సో చట్టం నేరంగానే పరిగణిస్తున్న విషయం మీకు తెలిసిందే. న్యాయమూర్తిగా నా పదవీకాలంలో ఈ విధమైన కేసులు న్యాయమూర్తులకు సవాలుగా పరిణమిస్తున్నాయని నేను గమనించాను’ అని జస్టిస్ చంద్రచూడ్ ఆ సమయంలో చెప్పారు. ఈ విషయంలో ఆందోళన పెరుగుతున్నదని, కౌమార వయసులో ఉన్నవారి ఆరోగ్యంపై నిపుణుల పరిశోధనల ఆధారంగా చట్టం వెలుగులో దీనిని పరిష్కరించాలని ఆయన కోరారు.