ECI Announces Bypoll In 8 Assembly Seats | దేశంలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు:సీఈసీ
దేశంలోని 7 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది.

దేశంలోని ఏడు రాష్ట్రాల్లోని ఎనిమిది అసెంబ్లీ నియోజకర్గాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నాడు షెడ్యూల్ ను ప్రకటించింది. భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని సీఈసీ ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ లోని బుదగాం, నగ్రోటా, రాజస్థాన్ లోని అంటా, జార్ఖండ్ లోని ఘట్సిలా, తెలంగాణలోని జూబ్లిహిల్స్, పంజాబ్ లోని తరన్ తరన్, మిజోరంలో డంప, ఒడిశాలో నౌపాడా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు వివిధ కారణాలతో మరణించారు.దీంతో ఈ ఆరు స్థానాల్లో ఉప ఎన్నికలకు అనివార్యమయ్యాయి. బుదగాం నుంచి గెలిచిన కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ స్థానానికి రాజీనామా చేశారు., దీంతో ఇక్కడ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రాజస్థాన్ లోని అంటా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన కన్వర్ లాల్ పై అనర్హత వేటు పడడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.
ఈ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలకు అక్టోబర్ 13న నోటిఫికేషన్ జారీ చేస్తారు.జమ్మూ కశ్మీర్, ఒడిశా రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగే స్థానాలకు అక్టోబర్ 20 నామినేషన్ల దాఖలుకు చివరి తేది. మిజోరం, పంజాబ్, తెలంగాణ, ,రాజస్థాన్ రాష్ట్రాల్లో మాత్రం ఉప ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు చివరి తేది అక్టోబర్ 21. రాజస్థాన్ లో మాత్రం నామినేషన్ల పరిశీలనను అక్టోబర్ 23న నిర్వహిస్తారు. మిగిలిన ఏడు అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 22నే నామినేషన్లను పరిశీలిస్తారు.రాజస్థాన్ లో మాత్రమే నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 27 వరకు గడువు ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 24 చివరి తేది. ఈ ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 14న కౌంటింగ్ జరుగుతుంది.