ఎట్టకేలకు ఘజియాబాద్‌లోని హిండన్‌ ఎయిర్‌బేస్‌లో దిగిన హసీనా

బంగ్లాదేశ పదవీచ్యుత ప్రధాని షేక్‌ హసీనా సోమవారం ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌ హిండన్‌ ఎయిర్‌బేస్‌లో దిగారు. ఆమె ఢాకా నుంచి బంగ్లాదేశ్‌ ఆర్మీకి చెందిన సీ- 130 రవాణా ఎయిర్‌క్రాఫ్ట్‌లో వచ్చారు.

ఎట్టకేలకు ఘజియాబాద్‌లోని హిండన్‌ ఎయిర్‌బేస్‌లో దిగిన హసీనా

న్యూఢిల్లీ : బంగ్లాదేశ పదవీచ్యుత ప్రధాని షేక్‌ హసీనా సోమవారం ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌ హిండన్‌ ఎయిర్‌బేస్‌లో దిగారు. ఆమె ఢాకా నుంచి బంగ్లాదేశ్‌ ఆర్మీకి చెందిన సీ- 130 రవాణా ఎయిర్‌క్రాఫ్ట్‌లో వచ్చారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ 17, సీ 130 జే సూపర్‌ హెర్క్యులెస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ హ్యాంగర్‌లో దీనిని పార్క్‌ చేశారు. ఢాకాలో బయల్దేరి, భారత గగనతలంలోకి ప్రవేశించిన దగ్గరినుంచీ ఘజియాబాద్‌లో ల్యాండ్‌ అయ్యేంత వరకూ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పర్యవేక్షిస్తూ వచ్చిందని సమాచారం. భారతదేశంలో స్వల్ప విరామం అనంతరం ఆమె లండన్‌ వెళతారని దౌత్యవర్గాలు పేర్కొన్నాయి. మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లోనే లండన్‌కు వెళతారా? లేక ప్రత్యేక విమానంలో వెళతారా? అన్న విషయాన్ని ఎవరూ ధృవీకరించలేదు. షేక్‌ హసీనాను సీనియర్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారి ఒకరు రిసీవ్‌ చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఢాకా విజ్ఞప్తి మేరకు హసీనా ప్రయాణిస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్‌ సురక్షితంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు భారత ప్రభుత్వం సమ్మతించినట్టు సమాచారం.