Buddhadeb Bhattacharjee | భద్రలోక్ అస్తమయం.. తుది శ్వాస విడిచిన బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య
Buddhadeb Bhattacharjee | ప్రముఖ వామపక్ష నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (80) గురువారం ఉదయం కన్నుమూశారు. దక్షిణ కోల్‌కతాలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన గతకొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
కోల్‌కతా: బెంగాల్ రాజకీయాల్లో ఒక అధ్యాయం ముగిసింది. ప్రముఖ వామపక్ష నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (80) గురువారం ఉదయం కన్నుమూశారు. దక్షిణ కోల్‌కతాలోని తాను నివసిస్తున్న పామ్ అవెన్యూ అపార్ట్‌మెంట్‌లోని రెండు గదుల ప్రభుత్వ ఫ్లాట్‌లో తుదిశ్వాస విడిచారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఇదే ఇంటిలో నివసించేవారు. ఆయన గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శ్వాసకోశ సంబంధిత సమస్యలతో పలుసార్లు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. గతేడాది ఆయనకు న్యుమోనియా సోకడంతో లైఫ్ సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన కోలుకున్నారు. ఆయనకు భార్య మీరా, కుమారుడు సుచేతన్ ఉన్నారు. సీనియర్ వామపక్ష నేత సీపీఎం అత్యున్నత నిర్ణయాధికార విభాగం పొలిట్‌బ్యూరో మాజీ సభ్యుడు. 2000 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పని చేశారు. జ్యోతిబసు అనంతరం అత్యున్నత పదవిలో కొనసాగారు. భద్రలోక్‌గా (పెద్దమనిషి) పిలుచుకునే బుద్ధదేవ్ భట్టాచార్య బెంగాల్‌ను పారిశ్రామికంగా పరుగులు పెట్టించేందుకు విశేష కృషి చేశారు. ‘వ్యవసాయం మన పునాది.. పారిశ్రామీకరణ మన భవిష్యత్తు’ ఆయన ఉద్దేశాలు ప్రగతిశీలమైనవే అయినప్పటికీ.. నాటి ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో 34 ఏళ్ల సుదీర్ఘ సీపీఎం పాలనకు ముగింపు పలికాయి.
బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మాజీ సీఎం
భట్టాచార్య 1944 మార్చి ఒకటిన ఉత్తర కోల్‌కతాలో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తాత కృష్ణచంద్ర స్మృతితీర్థ స్వస్థలం ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని మదరిపూర్ జిల్లా. ఆయన గొప్ప సంస్కృత పండితుడు, రచయిత. ఆయన పురోహిత్ దర్పణ్ అనే అర్చక మాన్యువల్‌ను సిద్ధం చేశారు. ఇది పశ్చిమ బెంగాల్‌లోని బెంగాలీ హిందూ పూజారులలో ప్రసిద్ధి చెందింది. బుద్ధదేవ్ తండ్రి నేపాల్‌చంద్ర అర్చకత్వంలోకి ప్రవేశించకుండా.. హిందూ మతపరమైన వస్తువులను విక్రయించడానికి అంకితమైన కుటుంబ ప్రచురణ సరస్వత్ లైబ్రరీలో కొనసాగారు. భట్టాచార్య శైలేంద్ర సిర్కార్ విద్యాలయ పూర్వ విద్యార్థి. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో బెంగాలీ సాహిత్యాన్ని అభ్యసించారు. బెంగాలీలో బీఏ పూర్తి చేసి.. డమ్ డమ్‌లోని ఆదర్శ శంఖ విద్యా మందిర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. 1966లో సీపీఐ(ఎం)లో ప్రాథమిక సభ్యుడిగా చేరాడు. ఆహార ఉద్యమంలో చురుకుగా పాల్గొనడమే పాల్గొన్నారు. 1968లో వియత్నాం ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. 1968లో యువజన విభాగం అయిన డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో విలీనమైంది. 1981 వరకు అందులోనే కొనసాగారు.
కమ్యూనిస్ట్ సీనియర్ నాయకుడిగా..
దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన సీపీఎం ముఖ్య నేతల్లో ఒకరిగా ఎదిగారు. పార్టీ సీనియర్ నేత ప్రమోద్ దాస్ గుప్తా మార్గదర్శకత్వంలో పనిచేశారు. 1972లో సీపీఐఎం రాష్ట్ర కమిటీకి ఎన్నికయ్యారు. 1982లో రాష్ట్ర సెక్రటేరియట్‌లో చేరారు. తొలిసారిగా 1977 నుంచి 1982 వరకు కాశీపూర్-బెల్గాచియా ఎమ్మెల్యేగా కొనసాగారు. పశ్చిమ బెంగాల్ క్యాబినెట్‌లో 1977-1982 మధ్య సమాచార, ప్రజా సంబంధాల మంత్రిగా మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత పలు శాఖలకు సైతం మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1996 పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి జ్యోతిబసు ఆరోగ్యం పరిస్థితుల నేపథ్యంలో ఆయన హోంమంత్రిత్వ శాఖ మంత్రిగా, 1999లో పశ్చిమ బెంగాల్ ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. జ్యోతిబసు అనంతరం నవంబర్ 6, 2000న సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
పారిశ్రామికీకరణతో..
2002లో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరోకు ఎన్నికయ్యారు. 2001 నుంచి -2011 సీపీఎంను ముందుండి నడిపించి.. ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా పని చేశారు. బెంగాల్‌లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు పరిశ్రమలను తీసుకువచ్చేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు. పారిశ్రామీకరణకు సీపీఎం వ్యతిరేకం అన్న ప్రచారాన్ని తిప్పికొడుతూ రాష్ట్రాన్ని పారిశ్రామికరంగంలో పరుగులు తీయించారు. ఆయన ప్రభుత్వ హయాంలోనే పశ్చిమ బెంగాల్ ఐటీ, సేవల రంగంలో పెట్టుబడులు పెట్టింది. కోల్‌కతా సమీపంలోని సింగూర్ గ్రామంలోనే ప్రపంచంలోనే అత్యంత చౌకైన టాటా నానో కారు ప్రాజెక్టుకు ఆహ్వానం పలికారు. జిందాల్ గ్రూప్ నుంచి పశ్చిమ బెంగాల్ మేదినిపూర్ జిల్లా సాల్బోనిలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను తీసుకువచ్చారు. అలాగే, నందిగ్రామ్‌లో రసాయన కేంద్రం తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు చేశారు. నానోప్లాంట్, నందిగ్రామ్ రసాయన ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు జరగ్గా.. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 2011 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఓటమిపాలైంది. ఓటమి తర్వాత క్రమంగా క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటూ వచ్చారు. వయోభారం రీత్యా పార్టీ అత్యున్నత విభాగం పొలిట్‌బ్యూరో నుంచి కూడా వైదొలిగారు. 2022 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. అయితే.. ఆ విషయం తనకు ముందుగా తెలియజేయలేదంటూ దానిని తిరస్కరించారు.
ప్రధాని సంతాపం
బుద్ధదేవ్ భట్టాచార్య మృతిపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘బెంగాల్‌కు అంకిత స్వభావంతో సేవ చేసిన రాజకీయ యోధుడు. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’ అని ప్రధాని తన ఎక్స్ ఖాతాలో నివాళులర్పించారు. రాష్ట్రానికి బుద్ధదేవ్ అందించిన సేవలను బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ గుర్తు చేసుకున్నారు. ‘ఆయన చేసిన సేవలకు ఎల్లకాలం ఆయన గుర్తుండిపోతారు’ అని పేర్కొన్నారు. ప్రజల గౌరవం, ప్రేమను పొందిన నాయకుడిగా బుద్ధదేవ్‌ను బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ అభివర్ణించారు. రాష్ట్రం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని, దేశం అరుదైన రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని మాజీ గవర్నర్ గోపాల్ కృష్ణ గాంధీ అన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram