హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమయ్యాయి. . హైస్పీడ్ రైలు కారిడార్‌ల కోసం రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్ జిల్లాల్లో క్షేత్రస్థాయి సర్వే మొదలైంది. యాచారం మండలంలోని పలు గ్రామాల్లో మార్కింగ్‌లు పూర్తయ్యాయి. ఏరియల్ సర్వే తర్వాత రూట్ ఖరారు చేసే పనులు వేగవంతం కాగా, సర్వే పూర్తయితే తుది ఎలైన్‌మెంట్, స్టేషన్ల స్థానాలు, భూసేకరణపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.
చెన్నై – హైదరాబాద్, హైదరాబాద్ – బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించి ఇప్పటికే ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రస్తుతం సాధ్యాసాధ్యాల అధ్యయనం కొనసాగుతోంది. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలో రూట్ ఖరారు చేసే పనుల్ని వేగవంతం చేశారు. హైదరాబాద్- చెన్నై కారిడార్‌కు శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, యాచారం మండలాల మీదుగా నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వైపు సర్వే చేస్తున్నారు. అలాగే హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌కు శంషాబాద్, షాబాద్ మండలాల మీదుగా బెంగళూరు వైపునకు వెళ్లేలా పది రోజులుగా సర్వే చేస్తున్నారు. పొలాలు, ఇతర ప్రాంతాల్లో ఎరుపు-తెలుపు రంగులతో ప్రత్యేక గుర్తులు వేస్తున్నారు.
యాచారం మండలంలోని కురుమిద్ద, మేడిపల్లి, మల్కిస్ గూడం, తక్కళ్లపల్లి, చింతపట్ల, నల్లవెల్లి, మందన, గౌరెల్లి గ్రామాల పరిధిలో మార్కింగ్ లు ఇప్పటికే పూర్తయ్యాయి. కారిడార్ ఎలైన్మెంట్, సర్వే పాయింట్లు, భూసేకరణ అవసరాలను గుర్తించేందుకు ఈ మార్కింగ్‌లు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా గుర్తించిన ఏడు కారిడార్లలో ముంబై-పుణె, పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి మార్గాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదిత నెట్‌వర్క్ వల్ల ఆయా నగరాల మధ్య ప్రయాణ వేగం అద్భుతంగా పెరగనుంది. దక్షిణ భారతదేశంలో బెంగళూరు-చెన్నై మధ్య 73 నిమిషాలు, బెంగళూరు-హైదరాబాద్ మధ్య 2 గంటల 10 నిమిషాలు, పూణే-హైదరాబాద్ మధ్య 2 గంటల 8 నిమిషాల వ్యవధిలోనే ప్రయాణించవచ్చు. ఉత్తర భారతదేశ విషయానికి వస్తే.. ఢిల్లీ నుండి లక్నోకు 2 గంటలు, ఢిల్లీ నుండి వారణాసికి 3 గంటల 15 నిమిషాలు మరియు ఢిల్లీ నుండి సిలిగురికి సుమారు 6 గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.
