మంచూరియా ప్రేమికులు ఈ వీడియో చూడ‌క‌పోతేనే మంచిది..

  • Publish Date - October 8, 2023 / 09:19 AM IST

విధాత‌: ఫాస్ట్ ఫుడ్ తినే వారు ఎవ‌రికైనా మంచూరియా పేరు చెప్ప‌గానే నోరూరిపోతుంది క‌దా.. వెజ్ మంచూరియా, బేబీ కార్న్ మంచూరియా, గోబీ మంచూరియా, చికెన్ మంచూరియా (Manchuria) ఇలా ర‌క‌ర‌కాల వెరైటీల్లో దానిని లాగించేస్తారు. వీటిని సొంతంగా ఇంట్లోనే త‌యారు చేసుకునే వెసులుబాటు ఉన్న‌ప్ప‌టికీ.. రోడ్డు సైడ్ చేసే మంచూరియా అంటేనే చాలా మందికి ఇష్టం.


క్యాబేజీ, క్యారెట్‌, ఉల్లిపాయ‌లు, పిండి, ఉప్పు, నూనెతో పాటు ఈ వంట‌కంలో ఆ చెఫ్ ఏం క‌లుపుతాడో న‌ని ప్ర‌తి ఒక్కరూ ఆ రుచికి ఫిదా అయిపోయిన వాళ్లే. అయితే ఎప్పుడైనా అంత పెద్ద మొత్తంలో మంచూరియా ఎలా త‌యారు చేస్తార‌ని ఆలోచించారా? అక్క‌డి వంట గ‌దుల్లో మంచూరియా ఎలా త‌యార‌వుతోందో ఏ మాత్రం శుభ్ర‌త ఉందో ఊహించారా?


తాజాగా గత కొద్ది రోజుల నుంచి ఎలాంటి ప‌రిస్థితుల్లో మ‌న‌కు న‌చ్చిన‌, బాగా తినే చిరుతిళ్లు త‌యార‌వుతున్నాయ‌నే దానిపై కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. తాజాగా ఒక స్నాక్ షాప్ కోసం 500 కేజీల మంచూరీ త‌యారీ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీనిని మంచూరియా ప్రేమికులు చూడ‌క‌పోతేనే మంచిద‌ని ఆ వీడియో డిస్ల్కైమ‌ర్‌లో పేర్కొన‌డం విశేషం.


ఇలా చేశారు..


ముందుగా కొంత మంది వ్య‌క్తులు పెద్ద మొత్తంలో క్యాబేజీని క‌సాపిసా త‌రిగి ప‌డేశారు. ఆ త‌ర్వాత పెద్ద పెద్ద చాకుల‌తో వివిధ కూర‌గాయ‌ల‌ను త‌రిగేశారు. అనంత‌రం ఆ క్యాబేజీ ముక్క‌ల్ని నీలం రంగు ట్రేల‌లో పెట్టి త‌ర్వాత వాటిని పెద్ద క‌ళాయి లాంటి దాంట్లో వేశారు. ఆ క్యాబేజీ తురుములో ఉప్పు, మైదా పిండి వేసి భుజాల దాకా అందులో చేతులు పెట్టి బాగా క‌లిపారు. అది కాస్త ద‌గ్గ‌ర ప‌డ్డాక చిన్న చిన్నఆ మిశ్ర‌మాన్ని చిన్న చిన్న ఉండ‌లుగా చేశారు.


అనంత‌రం ఉండ‌ల‌ను నీలం రంగు ట్రేల‌లో వేసి మంచూరియా త‌యారీకి బాగా ఫ్రై చేశారు. ఈ ప్రాసెస్‌లో వారు ఎక్క‌డా గ్లౌజుల‌ను గానీ, హెడ్ క‌వ‌ర్ల‌ను గానీ ఉప‌యోగించలేదు. మ‌రోవైపు ఈ వీడియో చాలా స్వ‌ల్ప కాలంలోనే 50 ల‌క్ష‌ల వ్యూల‌ను సంపాదించింది. అయితే మంచూరియా త‌యారీలోని అపరిశుభ్ర విధానాల‌పై కామెంట్లు పెద్ద సంఖ్య‌లో వ‌చ్చిప‌డ్డాయి.


ఈ ప్ర‌పంచం నుంచి ప‌రిశుభ్ర‌త అనేది పారిపోయిందా అని ఒక‌రు వ్యాఖ్యానించారు. ఈ వీడియో చూసి హైజీన్ అనేది మౌనంగా రోదిస్తోంద‌ని మ‌రొక‌రు పేర్కొన్నారు. ఇంచుమించుగా ఆ పిండి క‌లిపేవాడి శ‌రీరం స‌గం అందులోనే ఉంద‌ని మ‌రొక‌రు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. అన్న‌ట్లు ఈ వీడియో చూశాక మీరు ఇంకా రోడ్డు మీద మంచూరియా తినాల‌నుకుంటున్నారా?.