Olympics | షూటౌట్‌లో గ్రేట్‌బ్రిటన్‌ను ఓడించి సెమీస్‌లోకి ఇండియా హాకీ జట్టు

వరుసగా రెండో ఒలింపిక్‌ పతకాన్ని సాధించే లక్ష్యంతో దూసుకుపోతున్న భారత పురుషుల హాకీ జట్టు.. ఆదివారం గ్రేట్‌ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి.. సెమీ ఫైనల్‌లోకి వెళ్లింది.

Olympics | షూటౌట్‌లో గ్రేట్‌బ్రిటన్‌ను ఓడించి సెమీస్‌లోకి ఇండియా హాకీ జట్టు

టోక్యో : వరుసగా రెండో ఒలింపిక్‌ పతకాన్ని సాధించే లక్ష్యంతో దూసుకుపోతున్న భారత పురుషుల హాకీ జట్టు.. ఆదివారం గ్రేట్‌ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి.. సెమీ ఫైనల్‌లోకి వెళ్లింది. పీఆర్‌ శ్రీజేశ్‌ అద్భుత ప్రతిభతో ప్రత్యర్థి జట్టును షూట్‌ అవుట్‌లో 4..2 తేడాతో ఓడించింది. గ్రేట్‌ బ్రిటన్‌ ఆటగాడిపై తన హాకీ స్టిక్‌ను ఎత్తడంతో అమిత్ రోహిదాస్‌ రెడ్‌ కార్డుకు గురయ్యాడు. దీంతో భారత జట్టు పది మందితోనే ఆడాల్సి వచ్చింది. అయితే.. 40 నిమిషాలపాటు గ్రేట్‌ బ్రిటన్‌ను నిలువరించడంతో 1, 1 గోల్స్‌తో ఇరు జట్లు నిలిచాయి. దీంతో షూట్‌అవుట్‌కు అవకాశం కల్పించారు.
భారత ఆటగాళ్లను బ్రిటన్‌ ఆటగాళ్లు.. మ్యాన్‌ టు మ్యాన్‌ వ్యూహంతో (man-to-man) వెంటాడంతో భారత జట్టు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నది. ఇదే వ్యూహంతో పూల్‌ మ్యాచ్‌లలో భారత జట్టు విజయాలు సాధించింది. అయితే.. తన ఆఖరి ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్ ఆడుతున్న వెటరన్‌ శ్రీజేశ్‌.. ఇండియన్‌ గోల్‌ పోస్ట్‌ వద్ద కొండలా నిలబడ్డాడు. ఒకదాని తర్వాత ఒకటిగా ప్రత్యర్థి షూట్‌అవుట్‌లను తిప్పికొట్టాడు.
ప్రత్యర్థి ఆటగాడు అడ్డుకోవడంతో భారత జట్టుకు 22వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న భారత ఆటగాడు హర్మన్‌ప్రీత్‌ సింగ్‌.. దానిని గోల్‌గా మలిచాడు. అనంతరం 27వ నిమిషంలో బ్రిటన్ ఆటగాడు లీ మోర్టన్‌ గోల్‌ చేయడం ద్వారా స్కోరును సమం చేశాడు. కీలక డిఫెండర్‌ రోహిదాస్‌కు రెడ్‌ కార్డు చూపించిన తర్వాత బ్రిటన్‌ ఆటగాళ్లు భారత గోల్‌పోస్ట్‌పై నిరవధిక దాడులు చేశారు. అయితే.. వారి ఎత్తుడగలను శ్రీజేశ్‌ పారనివ్వలేదు. షూటవుట్‌లో సైతం అదే పట్టుదలను ప్రదర్శించాడు. షూట్‌అవుట్‌లో స్కోరు 2..2గా ఉన్న సమయంలో శ్రీజేశ్‌ అడ్డుగోడలా నిలబడటంతో కొన్నూర్‌ విలియమ్సన్‌, ఫిలిప్‌ రోప్పర్‌ గోల్స్‌ విఫలమయ్యాయి. గ్రేట్‌ బ్రిటన్‌ జట్టులో షూట్‌అవుట్స్‌లో జేమ్స్‌ అల్బ్రే, జాచ్‌ వాలెస్‌ స్కోరు చేయగా.. భారత జట్టులో హర్మన్‌ప్రీత్‌, సుఖ్జీత్‌సింగ్‌, లలిత్‌ ఉపాధ్యాయ, రాజ్‌కుమార్‌పాల్‌ గోల్స్‌ చేశారు. ‘ఒక ఆటగాడు నిష్క్రిమించాల్సి వచ్చినా మేం కుంగిపోలేదు. శిక్షణాకాలంలో ఇటువంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాం. అమిత్‌ లేకపోవడంతో డిఫెండర్‌ బాధ్యతను నేను తీసుకున్నాను. ఇది చాలా గొప్ప విజయం’ అని మాజీ కెప్టెన్‌ మన్‌ప్రీత్‌సింగ్‌ మ్యాచ్‌ అనంతరం చెప్పాడు. ‘ఎప్పటిలానే శ్రీజేశ్‌ జట్టును కాపాడాడు’ అని ప్రశంసించాడు.