India Warns Pakistan | ఉగ్రవాదం ఆపకపోతే ప్రపంచపటంలో పాకిస్తాన్ ఉండదు: ఆర్మీ చీఫ్ తీవ్ర హెచ్చరిక

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ ఒకేరోజు పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసారు “Operation Sindoor 1.0లో నియంత్రణ పాటించాం, 2.0 వస్తే పాక్ భూమ్మీద ఉండకపోవచ్చు” అని వార్నింగ్ ఇచ్చారు.

India Warns Pakistan | ఉగ్రవాదం ఆపకపోతే ప్రపంచపటంలో పాకిస్తాన్ ఉండదు: ఆర్మీ చీఫ్ తీవ్ర హెచ్చరిక

“Stop Terrorism or Lose Existence”: Army–Air Chiefs on Operation Sindoor 2.0
అనూప్‌గఢ్‌ (రాజస్థాన్) / న్యూఢిల్లీ:
India Warns Pakistan | పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉంటే అది భూగోళంపై మిగలదని భారత సైన్యం మళ్లీ ఘాటు హెచ్చరిక జారీ చేసింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సరిహద్దులో జవాన్లను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ 1.0 సమయంలో మేము సంయమనం పాటించాం. కానీ సిందూర్ 2.0లో ఎలాంటి ఓర్పు ఉండదు. మళ్లీ పాక్ ప్రేరేపిస్తే ఈసారి ఎలాంటి జాలి, కరుణ ఉండదు. అప్పుడు పాక్ ప్రపంచపటంలో ఉంటుందా లేదా అన్నది మేమే నిర్ణయిస్తాం. జవాన్లు సిద్ధంగా ఉండాలి, త్వరలోనే మళ్లీ మీకు తుపాకీ శక్తిని చూపించే అవకాశం రావొచ్చు. జైహింద్” అని ఘాటుగా హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు ఇరుదేశాల వాతావరణాన్ని వేడెక్కించాయి.

ఉపఖండపు పటం మారిపోతుంది : రక్షణ మంత్రి

ఇదే సమయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గుజరాత్‌లోని సర్‌క్రీక్ వివాదాన్ని ప్రస్తావిస్తూ, “పాక్ దాడి చేస్తే చరిత్రను, భౌగోళిక స్వరూపాన్ని మార్చే సమాధానం ఇవ్వాల్సి వస్తుంది” అన్నారు. 1965 యుద్ధంలో భారత సైన్యం లాహోర్ వరకు చేరిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇప్పుడు కరాచీ మార్గం సర్‌క్రీక్ ద్వారానే ఉందని హెచ్చరించారు. ప్రధాని మోదీ కూడా గత మేలోనే, సిందూర్ ఆగలేదని, పాక్ మళ్లీ మోసం చేస్తే మరింత తీవ్రమైన దాడి తప్పదని హెచ్చరించారు. ఈ వరుస వ్యాఖ్యలు మళ్లీ ఏదో జరుగబోతోందని, భారత సైన్యపు సన్నద్ధతనూ స్పష్టంగా చూపిస్తున్నాయి. జవాన్లు ఆధునిక టెక్నాలజీ, UAVలు, కౌంటర్-UAV సిస్టమ్‌లతో పూర్తిగా సిద్ధంగా ఉన్నారని సైన్యం తెలిపింది.


Operation Sindoor ప్రస్తావన

ఆపరేషన్ సిందూర్ మే 7న ప్రారంభమైంది. పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతంలో, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న 9 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లు, క్యాంపులపై భారత్ డ్రోన్, మిస్సైల్ దాడులు చేసింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. పాక్ సైన్యం ప్రతీకారంగా డ్రోన్, మిస్సైల్ దాడులు చేసింది, కానీ భారత్ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. మే 10న పాక్ సైనిక డైరెక్టర్ జనరల్ (DGMO) భారత్‌తో కాల్పుల విరమణను కోరింది.
ఢిల్లీలో ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ కూడా ఆపరేషన్ సిందూర్ వల్ల జరిగిన పాక్ నష్టాలను బయటపెట్టారు. “భారత్ దాడుల్లో పాక్ 4–5 ఫైటర్ జెట్లు, అందులో US తయారీ F-16లు, చైనా JF-17లు నేలమట్టమయ్యాయి. ఒక AEW&C రాడార్ విమానం, C-130 క్లాస్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ కూడా కూలిపోయాయి. పాక్ ప్రచారం చేసినట్లు ‘7 ఇండియన్ జెట్లు కూల్చాం’ అన్నది అంతా కట్టుకథలు మాత్రమే” అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. పాక్ ఎయిర్‌బేస్‌లు, కమాండ్ సెంటర్లు, రన్‌వేలు, రాడార్ స్టేషన్లు ధ్వంసం అయ్యాయని వివరించారు. కాగా, ఈ ఆపరేషన్ పాక్ ఉగ్రవాద క్యాంపులను ప్రపంచానికి బహిర్గతం చేసిందని సైన్యాధ్యక్షుడు ద్వివేది అన్నారు. లేకపోతే పాకిస్తాన్ వాటిని దాచేసేదని చెప్పారు. ఈ దాడులు భారత్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను ప్రదర్శిస్తే, పాక్ బలహీనతలను బయటపెట్టాయి. ఇది 1971 యుద్ధం తర్వాత పాక్‌కు ఎదురైన భారీ నష్టమని విశ్లేషకులు చెబుతున్నారు.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాక్ దూకుడు చూపితే చరిత్ర, ప్రపంచపటం రెండూ మార్చే సమాధానం ఎదుర్కోవాల్సిఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా సర్ క్రీక్ వివాదంలో పాక్ జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు.పాక్ ఉగ్రవాదం ఆపకపోతే ఆపరేషన్ సిందూర్ 2.0 తప్పదు, ఇక ఎంత మాత్రం సంయమనం ఉండదు, పాక్ వరల్డ్ మ్యాప్‌లో మిగలకపోవచ్చని రక్షణ మంత్రి, భారత సైన్యాధికారుల ఘాటు వ్యాఖ్యలు ఒకే విధమైన సందేశాన్ని ఒకేరోజు ఇవ్వడం గమనార్హం.

భారత్ దాడుల తర్వాత పాక్‌లో భయం నెలకొంది. ఆర్థికంగా కుదేలైన పాక్, IMF అప్పుల కోసం తలమానికం అవుతోంది. ఇప్పుడు Operation Sindoor 2.0 వస్తుందనే భయం మరింత పెరిగింది. ప్రధాని షహ్‌బాజ్ షరీఫ్ UNలో ప్రసంగించి భారత్‌ను నిందించడానికి ప్రయత్నించినా, అంతర్జాతీయంగా పెద్దగా స్పందన రాలేదు. పాక్ సైన్యంలోనూ ఆత్మవిశ్వాసం కరువైందని ఇంటెలిజెన్స్ రిపోర్టులు చెబుతున్నాయి.