Declining Of Birth Rate In India | ఇండియాలో పడిపోయిన బర్త్ రేట్:ఆందోళన కల్గిస్తున్న బాలికల సంఖ్య

భారత దేశంలో జనన రేటు 2023లో 18.4కి పడిపోయింది. బాలికల జనాభా కొద్దిగా మెరుగైనప్పటికీ సమస్య ఆందోళన కలిగిస్తోంది.

Declining Of Birth Rate In India | ఇండియాలో పడిపోయిన బర్త్ రేట్:ఆందోళన కల్గిస్తున్న బాలికల సంఖ్య

భారత్ లో జనన రేటు పడిపోతోంది. 2022లో 19.1 నుంచి 2023 నాటికి జనన రేటు 18.4కు తగ్గింది.అంటే 0.7 పాయింట్లు తగ్గినట్టు నివేదికలు చెబుతున్నాయి.మరో వైపు బీహార్ లో అత్యధికంగా బర్త్ రేట్, సంతానోత్పత్తి రేటు నమోదైంది. ఢిల్లీ, తమిళనాడులో అత్యల్పంగా రికార్డయ్యాయి. దేశంలోని 18 రాష్ట్రాల్లో సంతానోత్పత్తి 2.1 కంటే తక్కువగా ఉందని నివేదికలు చెబుతున్నాయి.

సీబీఆర్ అంటే ఏంటి

ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో (ఏడాదిలో) దేశంలో వెయ్యి మంది ప్రజలకు పుట్టే పిల్లలను సీబీఆర్ సూచిస్తోంది. దేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) రేటు కూడా రెండేళ్లలో మొదటిసారిగా 2023లో 1.9కి పడిపోయింది. ఇది 2021, 2022 సంవత్సరాల్లో టీఎఫ్ఆర్ రేటు 2.0 గా నమోదైందని తాజా రిపోర్ట్ తెలిపింది. భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం ఇటీవల ఈ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం బీహార్ లో అత్యధికంగా సీబీఆర్ రేటు నమోదైంది. బీహార్ లో సీబీఆర్ 25.8 గా రికార్డైంది. తమిళనాడులో 12గా ఉంది.ఇక మరణాల రేటు 6.4 గా నమోదైంది. 2022తో పోలిస్తే 0.4 పాయింట్లు తగ్గింది. దేశంలో శిశు మరణాల రేటు 2022తో పోలిస్తే 1 పాయింట్ తగ్గింది.

తగ్గిన సంతానోత్పత్తి

దేశంలో సంతానోత్పత్తి కూడా తగ్గింది. గతంలో సంతానోత్పత్తి రేటు 2.1గా ఉంది. కానీ, ఇది 1.9 జననాలకు తగ్గింది.1960లో భారతదేశ జనాభా దాదాపు 436 మిలియన్లు ఉన్నప్పుడు ఒక్క స్త్రీకి దాదాపు ఆరుగురు పిల్లలు ఉన్నారు. అప్పట్లో నలుగురు మహిళల్లో ఒక్కరి కంటే తక్కువ మంది ఏదో ఒక రకమైన గర్భ నిరోధక పద్దతులను ఉపయోగించారు. అంటే మిగిలిన వారు కుటుంబ నియంత్రణ పద్దతులను అంతగా పాటించేవారు కాదు. అంతేకాదు అప్పట్లో ప్రతి ఇద్దరు మహిళల్లో ఒక్కరి కంటే తక్కువ మంది ప్రాథమిక పాఠశాల స్థాయి చదువుకున్నారని 2020లో ప్రపంచ బ్యాంకు రిపోర్టు తెలిపింది.అయితే ఆ తర్వాతి కాలంలో కుటుంబ నియంత్రణతో పాటు విద్యపై కూడా మహిళలు ఫోకస్ పెంచారు. ఇది సమాజంలో అనేక మార్పులకు కారణమైంది. భారతదేశం సంతానోత్పత్తి రేటును తగ్గించడంలో గణనీయమైన పురోగతి సాధించింది. 1970లో దాదాపు ఐదుగురు పిల్లల నుండి ప్రస్తుతం ఇద్దరు పిల్లలున్నారు.

భారత్ లో యూత్ జనాభా ఎక్కువే

దేశ జనాభాలో 60 ఏళ్ల వయస్సు వారి జనాభా 9.7 శాతంగా ఉంది.ఇది ఏడాదిలో 0.7 శాతం పాయింట్లు పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. కేరళ రాష్ట్రంలో వృద్దుల జనాభా 15 శాతంగా ఉంది. అసోంలో 7. 6 శాతం, ఢిల్లీలో 7.7 శాతం, జార్ఖండ్ లో 7.6 శాతంగా ఉందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.
జనన రేటు మందగించినప్పటికీ భారతదేశ యువ జనాభా గణనీయంగా ఉంది. 0-14 సంవత్సరాల వయస్సులో 24 శాతం, 10-19 సంవత్సరాలలో 17 శాతం , 10-24 సంవత్సరాలలో 26 శాతం మంది ఉన్నారు.దేశంలోని 68 శాతం జనాభా 15-64 ఏళ్ల వయస్సు కలిగి ఉన్నారు. ఇక దేశంలో 65 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి వయస్సు ప్రస్తుతం ఏడు శాతంగా ఉంది. ఆయుర్దాయం మెరుగుపడటంతో రాబోయే దశాబ్దాలలో ఇది పెరుగుతుందని భావిస్తున్నారు. 2025 నాటికి జనన సమయంలో ఆయుర్దాయం పురుషులకు 71 సంవత్సరాలు, మహిళలకు 74 సంవత్సరాలుగా అంచనా వేశారు.

ఆందోళన కల్గిస్తున్న బాలికల సంఖ్య

దేశంలో వెయ్యి మంది అబ్బాయిలకు 917 మంది అమ్మాయిలున్నారు. కేరళలో 971 బాలికలు, ఛత్తీస్ గడ్ లో 974 బాలికలు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అత్యల్పంగా వెయ్యి మంది అబ్బాయిలకు 868 అమ్మాయిలున్నారు. 2020లో ఒకప్పుడు 964లో ఉన్న బీహార్ లో 2022 నాటికి 891కి పడిపోయింది. కానీ, 2023 నాటికి బాలికల జనాభాలో కొంత మెరుగుదల కన్పించింది. అంటే వెయ్యి మందికి 897 మంది బాలికలున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానాల్లో బాలికల జనాభా 900 కంటే తక్కువే ఉందని నివేదికలు చెబుతున్నాయి.