ఢాకాలో ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్, బంగబంధు స్మారక మ్యూజియంపై దాడి.. విధ్వంసం
ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా అనంతరం ఆందోళనకారులు సంబురాలు చేసుకున్నారు. అదే సమయంలో హసీనా నివాసం, పార్లమెంటు భవనంలోకి ప్రవేశించి హల్‌చల్ చేశారు.

ఢాకా: ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా అనంతరం ఆందోళనకారులు సంబురాలు చేసుకున్నారు. అదే సమయంలో హసీనా నివాసం, పార్లమెంటు భవనంలోకి ప్రవేశించి హల్‌చల్ చేశారు. ఆమె తండ్రి, బంగ్లా విమోచన పోరాట యోధుడు ముజిబుర్ రెహమాన్ విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆమె కార్యాలయం చాంబర్‌తోపాటు.. కార్యాలయ ప్రాంగణంలోనూ విధ్వంసం సృష్టించారు. దీంతో దేశవ్యాప్తంగా అల్లకల్లోల వాతావరణం నెలకొన్నది. బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లరిమూకలు ఢాకాలోని ధన్‌మోండీ ప్రాంతంలోని ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్‌తోపాటు, బంగబంధు స్మారక మ్యూజియంలో విధ్వంసానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ వార్తలు వస్తున్నాయి.
ఢాకాలోని బంగ బంధు భవన్ సహా పలు కీలక ప్రాంతాల్లో ఆందోళనకారులు సోమవారం మధ్యాహ్నం నిప్పుపెట్టారని ఢాకా ట్రిబ్యునల్ పత్రిక వెల్లడించింది. ఈ మ్యూజియం హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ స్మారకం. 1975లో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన హత్యకు గురైన విషయం తెలిసిందే.
ఇదే ప్రాంతంలో ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ కూడా ఉన్నది. దీనిని కూడా అల్లరిమూకలు ధ్వంసం చేశాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇదిలా ఉండగా.. హసీనా రాజీనామా అనంతరం ప్రధాని నివాసంలోకి ప్రవేశించిన ఆందోళనకారులు లోపల యథేచ్ఛగా సంచరించారు. ఆ ఇంటిని లూటీ చేశారు. ఆమె బెడ్‌రూమ్‌లోకి వెళ్లి.. బెడ్‌పై పడుకుని వీడియోలు తీసుకున్నారు. ఆమె చాంబర్‌ను ధ్వంసం చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయ ప్రాంగణంలోనూ విధ్వంసం సృష్టించారు. అక్కడితో ఆగని ఆందోళనకారులు పలు రోడ్ల కూడళ్లలోని హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. పార్లమెంటు భవనంలోకీ చొరబడిన ఆందోళనకారులు.. అక్కడి సీట్లలో కూర్చొని నినాదాలు చేశారు.
కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి వీధుల్లోకి వచ్చి ఆందోళనకారులు.. ధన్‌మోండీలోని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ కార్యాలయానికి నిప్పుపెట్టారు. ఇదే ప్రాంతంలో ఉన్న బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమాల్ ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో అక్కడికి చేరుకున్న వేల మంది ఆందోళనకారులు.. ఒక్కసారిగా గేట్లను బద్దలు కొట్టుకుని ఇంటిలోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఢాకాలో ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్‌ను 2010 మార్చిలో ప్రారంభించారు. ఇరు దేశాల సాంస్కృతిక సంబంధాల వారధిగా దీనిని ఏర్పాటు చేశారు. ఇక్కడ సాంస్కృతిక ప్రదర్శనలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంటారు. యోగా, హిందీ, భారతీయ సంగీతం, కథక్, మణిపురి వంటి భారతీయ నృత్యాలు నేర్పిస్తుంటారు. ఇక్కడి లైబ్రరీలో భారతీయ కళ, సంస్కృతి, రాజకీయాలు, ఆర్థిక, ఫిక్షన్‌కు సంబంధించిన సుమారు 21వేలకుపైగా పుస్తకాలు ఉన్నాయి.
ఢిల్లీకి సమీపంలోని హిండన్‌లో దిగిన హసీనా హెలికాప్టర్: దౌత్య వర్గాల వెల్లడి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రయాణిస్తున్న మిలిటరీ హెలీకాప్టర్ న్యూఢిల్లీకి సమీపంలోని హిండన్ వద్ద ల్యాండ్ అయినట్టు వివిధ దౌత్యవర్గాల ద్వారా తెలుస్తున్నది. తొలుత ఆమె త్రిపురలో దిగారని వార్తలు వచ్చినా ఆఖరుకు ఆమె ఢిల్లీకి సమీపంలో దిగారు. ఇక్కడి నుంచి ఆమె లండన్ వెళతారని తెలుస్తున్నది. హసీనా భారతదేశం వచ్చేందుకు అనుమతించాలని ఢాకా అధికారవర్గాలు చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సమ్మతించిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె ఢిల్లీ సమీపంలో ల్యాండ్ అయ్యారు.