Sharavathi Power Project | కర్ణాటక లోనూ ‘మేఘా’ చిచ్చు? : శరావతి పవర్ ప్రాజెక్టు మంటలు

శరావతి పవర్ ప్రాజెక్టుపై కర్నాటకలో ప్రజల ఆగ్రహం, పర్యావరణవేత్తల హెచ్చరికలు. మేఘా కంపెనీకి రూ.8 వేల కోట్ల కాంట్రాక్టు. కేంద్ర అటవీ శాఖ అనుమతి నిరాకరణ.

Sharavathi Power Project | కర్ణాటక లోనూ ‘మేఘా’ చిచ్చు? : శరావతి పవర్ ప్రాజెక్టు మంటలు

‘MEIL’ Controversy in Karnataka? Sharavathi Power Project Sparks Environmental Fire

  • అభయారణ్యానికి ముప్పు తప్పదా?
  • ట్రాన్స్ మిషన్ లైన్ల‌కే పదివేల ఎకరాలు
  • కేంద్ర అటవీ శాఖ అనుమతి నిరాకరణ
  • పర్యావరణ వేత్తలు, ప్రజలు తీవ్ర అభ్యంతరం

హైదరాబాద్, విధాత :

Sharavathi Power Project | కర్ణాటక రాష్ట్రంలో శరావతి పవర్ ప్రాజెక్టు పై రోజురోజుకు పర్యావరణవేత్తలు, ప్రజల ఒత్తిడి పెరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును కట్టనిచ్చేది లేదంటూ స్థానికులు సైతం సర్వే పనులకు అడ్డుపడుతున్నారు. పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఉందంటూ పలువురు ఆక్షేపణ తెలుపుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. పలు ప్రభుత్వ సంస్థలు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చినప్పటికీ, కేంద్ర అటవీ శాఖ మాత్రం నిరాకరించింది. దీని వల్ల పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని, అరుదైన జీవజాతులు కనుమరుగు అవుతాయని పలువురు ప్రజాభిప్రాయ సేకరణలో గళమెత్తారు. హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్​(Megha Engineering – MEIL) కంపెనీ వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు పనులు దక్కించుకున్నది.

Sharavathi Power Project Faces Public Outrage

కర్ణాటక  రాష్ట్రంలోని పశ్చిమ కనుమలు (Western Ghats) లో 2వేల మెగా వాట్ల పంప్​డ్​ స్టోరేజి పవర్ ప్రాజెక్టు(PSH)కు కర్ణాటక  పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (KPCL) శ్రీకారం చుట్టింది. దేశంలోనే ప్రప్రథమ భారీ పంప్​డ్​ స్టోరేజి ప్రాజెక్టు ఇది. తలకలాలే, గెరుసొప్పా రిజర్వాయర్ల జలాలను కలుపుతూ విద్యుత్ ఉత్పత్తికి వినియోగించనున్నారు. కేపీసీఎల్ 2024 లో టెండర్లు ఆహ్వానించగా హైదరాబాద్ కు చెందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్ (MEIL) సుమారు రూ.8వేల కోట్లకు కాంట్రాక్టు దక్కించుకున్నది. నిబంధనల ప్రకారం టెండర్ అవార్డు చేయలేదంటూ ప్రముఖ కంపెనీ ఎల్ అండ్ టీ న్యాయస్థానంలో సవాల్ చేయగా, విచారణానంతరం పిటిషన్ కొట్టివేసింది. న్యాయపరంగా చిక్కులు విడిపోవడంతో కేపీసీఎల్, ఎంఈఐఎల్ తో కాంట్రాక్టు అగ్రిమెంట్ కుదుర్చుకున్నది. పనులు పూర్తయ్యే నాటికి కాంట్రాక్టు విలువ రెట్టింపు అవుతుందనే వాదనలు కూడా ఉన్నాయి.

యునెస్కో Heritage Site గా గుర్తించిన ప్రాంతం

Threat to Western Ghats Ecosystem and Wildlife Reserve

శివమొగ్గ జిల్లా సాగర్ తాలూకా లోని 431 హెక్టార్లలో విస్తరించి ఉన్న శరావతి నదీ లోయను యునెస్కో(UNESCO)  ప్రపంచ వారసత్వ ప్రాంతం(World Heritage Site)గా గుర్తించింది. 1972 లో శరావతిని వన్యప్రాణి అభయారణ్యం గా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో మచ్చల జింక, పులులు, సింహాలు, గిరినాగులు, నెమళ్లు, కింగ్ ఫిషర్, మైనా, బీ ఈటర్స్, వేట కుక్కలు, అడవి పందులతో పాటు అరుదైన పక్షులు, జీవజాతులు, లక్షల కొద్ది భారీ వృక్షాలు ఉన్నాయి. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే 700 వరకు సింహపు తోక కోతులు(Lion-tailed macaque) ఉన్నాయి.

కర్ణాటక  రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కేజే.జార్జి మూడు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ, పీక్ అవర్స్ లో విద్యుత్ డిమాండ్ ను తట్టుకునేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు. దీనిపై ప్రజలు లేవనెత్తిన అనుమానాలు, అభ్యంతరాలకు ప్రభుత్వ అధికారులు వివరణలు ఇచ్చారని, ప్రతిపక్షాలు ప్రజల్లో అపోహలు కల్పిస్తున్నాయన్నారు. మంత్రి వివరణ ఇచ్చిన మరుసటి రోజే అనగా అక్టోబర్ 8వ తేదీన గెరుసప్ప ప్రజలు తిరుగుబాటు చేశారు. శరావతి డ్యామ్ వద్ధ సర్వే ఏజెన్సీ పనులు ప్రారంభించగా, ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తున్నారంటూ ప్రజలు అడ్డుపడ్డారు. వెంటనే కేపీసీఎల్ అధికారులు అక్కడకు చేరుకుని ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేశారు. భారీ యంత్ర పరికరాలను తరలించేందుకు 12 కిలోమీటర్ల పొడవునా రోడ్డు వేయాలని ప్రతిపాదించారు. ఈ రోడ్డు కోసం ఒక లక్ష చెట్లు తొలగించాల్సి ఉంటుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర అటవీ శాఖ అనుమతులు నిరాకరణ

శరావతి పవర్ ప్రాజెక్టు నివేదికను అధ్యయనం చేసిన కర్ణాటక  రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు(SBWL) ఈ ఏడాది జనవరిలో షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది. సుమారు 8 వేల వరకు చెట్లను తొలగించాల్సి ఉంటుందని అంచనా వేసింది. ఆ తరువాత మే నెలలో కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖ(ఫారెస్టు అండ్ క్లైమెట్ ఛేంజ్) కర్ణాటక  ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలు పరిశీలించింది. ప్రాజెక్టు రావడం మూలంగా ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడడం, అడవుల విధ్వంసం జరిగే ప్రమాదం ఉన్నందున అటవీ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. విచిత్రమేమంటే జూలై నెలలో నేషనల్ బోర్డు ఆఫ్ వైల్డ్ లైఫ్ 142 ఎకరాల అటవీ భూములను ప్రాజెక్టుకు కేటాయిస్తూ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. వన్య ప్రాణులు, జీవ జాతులకు ఇబ్బందులు కలుగకుండా, అవి సంచరించేందుకు వీలుగా బ్రిడ్జీలను నిర్మాణం చేయాలని నిబంధనలు విధించింది.

ప్రజాభిప్రాయ సేకరణలో అభ్యంతరాలు

సెప్టెంబర్ నెలలో సాగర్ తాలూకా కర్గల్ లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో పర్యావరణవేత్తలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(IISC) ఇచ్చిన నివేదికను కేపీసీఎల్ పట్టించుకోవడం లేదని కర్ణాటక వెస్ట్రన్ ఘాట్స్ టాస్క్ ఫోర్స్ మాజీ ఛైర్మన్ అనంత్ హెగ్డే ఆరోపించారు. ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే కొండ చరియలు విరిగిపడతాయని ఆయన హెచ్చరించారు. అప్పుడప్పుడు తీర్థహల్లి, షిరూర్ లో కొండచరియలు విరిగిపడుతున్నాయని ఆయన గుర్తు చేశారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో మేఘ విస్పోటనం జరిగి భారీ ప్రాణనష్టం సంభవించిన ఘటనలు చూశామన్నారు. శరావతి ప్రాంతం పర్యావరణ పరంగా అతి సున్నితమైన ప్రాంతమన్నారు. రాష్ట్ర అటవీ శాఖ అధికారులు కూడా ఈ ప్రాంతంలో ప్రాజెక్టు కడితే కోలుకోలేని విధంగా నష్టం వాటిల్లుతుందని తమ అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. అయినప్పటికీ కేపీసీఎల్ విన్పించుకోకుండా ముందుకు వెళ్తుందన్నారు.

సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ను ఇంగ్లీషు లో కాకుండా కన్నడ భాషలో ముద్రించి ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి పంపిణీ చేస్తే ప్రజలకు అర్థమవుతుందని పర్యావరణవేత్త అఖిలేష్ చిప్పలి డిమాండ్ చేశారు. ఈ సమావేశాన్ని రెండు నెలలు వాయిదా వేయాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి హెచ్.హలప్ప మాట్లాడుతూ, ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్ ను సరఫరా చేసేందుకు ట్రాన్స్ మిషన్ లైన్లు సరిపడా లేవని, ఎక్కడి నుంచి సరఫరా చేస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న లైన్ల ద్వారా సరఫరా చేయడం సాధ్యం కాదని, కొత్తగా ట్రాన్స్ మిషన్ లైన్లు వేయాలంటే పది వేల ఎకరాల వరకు భూ సేకరణ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు రావడం మూలంగా పూర్తిగా పశ్చిమ కనుమలకు ప్రమాదం ఉంటుందని కర్గల్ పట్టణ పంచాయతీ మాజీ ఉప సర్పంచి సిద్ధరాజు తెలిపారు.