న్యూఢిల్లీ : సాయుధ దళాలకు రూపొందించిన కొత్త వైకల్య పెన్షన్ నిబంధనలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వ నకిలీ జాతీయవాదం వీటి ద్వారా మరోసారి బయటపడిందని అన్నారు. జవాన్లు, మాజీ సైనికోద్యోగుల సంక్షేమం విషయంలో మోదీ ప్రభుత్వం పదే పదే దోషిగా నిలబడుతున్నదని అన్నారు.
వైకల్యం సంభవించిన లేదా మరణించిన సైనికులకు, వారి వితంతువులకు ఇచ్చే పెన్షన్, ఇతర ప్రయోజనాలపై ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను అఖిల భారత మాజీ సైనికుల సంక్షేమ సంఘం తీవ్రంగా వ్యతిరేకించిందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నిబంధనలను కేంద్ర రక్షణ శాఖ బుధవారం బయటపెట్టింది.
దీనిపై ఖర్గే శనివారం ‘ఎక్స్’లో ఒక పోస్టు పెట్టారు. వీటి ద్వారా బీజేపీ నకిలీ జాతీయవాదం మరోసారి బయటపడిందన్నారు. దాదాపు 40శాతం మంది ఆర్మీ అధికారులు వైకల్యంతో రిటైర్ అయి ఉన్నారని తెలిపారు. ఇప్పుడు తెచ్చిన కొత్త పాలసీ గతంలో వెలువడి అనేక తీర్పులు, ప్రపంచం ఆమోదించిన విధివిధానాలను అవహేళన చేస్తున్నదని మండిపడ్డారు.
మాజీ సైనికోద్యోగులను సాధారణ ఉద్యోగుల స్థాయికి కొత్త పాలసీ నెట్టివేస్తున్నదని ఆయన ఆరోపించారు. 2019లో కూడా మోదీ ప్రభుత్వం వైకల్యానికి పొందే పింఛన్లపైనా పన్ను విధిస్తూ ఇదే తరహా మోసానికి పాల్పడిందని గుర్తు చేశారు.
జవాన్‌లు, మాజీ సైనికోద్యోగులు, పదవీ విరమణ చేసిన సైనికుల పట్ల వ్యతిరేక చర్యలతో మోదీ ప్రభుత్వం పదే పదే దోషిగా నిలుస్తున్నదని ఆయన పేర్కొన్నారు. సైన్యం కోసం మోదీ ప్రభుత్వం వద్ద నిధులు లేవనడానికి అగ్నపథ్ పథకమే నిదర్శనమని చెప్పారు. మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి సత్వరమే ఎక్స్ సర్వీస్‌మెన్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.