Maoist Party | మావోయిస్టులతో శాంతి చర్చలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలి : సికాస కార్యదర్శి అశోక్
మావోయిస్టుల నుంచి మరో లేఖ వచ్చింది. అయితే.. ఈసారి సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) కార్యదర్శి అశోక్ ఈ లేఖను విడుదల చేశారు. శాంతి చర్చలకు పార్టీలో మెజార్టీ సభ్యులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సాయుధ పోరాట విరమణపై పార్టీలో రెండేళ్లుగా ఘర్షణ సాగుతున్నదని వెల్లడించారు.

Maoist Party | మావోయిస్టు పార్టీలో మెజార్టీ సభ్యులు శాంతి చర్చలకే మొగ్గు చూపుతున్నారని సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) కార్యదర్శి అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. మెజార్టీ సభ్యుల వైఖరిని పరిగణనలోకి తీసుకుని, శాంతి చర్చలు జరిగేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ప్రభుత్వ పక్షాన ప్రతినిధి వర్గాన్ని ప్రకటిస్తే.. తమవైపు ప్రతినిధులను ఖరారు చేసి, ఆయుధాలు త్యజించి, శాంతియుతంగా పార్టీని చట్ట పరిధిలోకి తీసుకొచ్చే ప్రక్రియను ప్రారంభిస్తామని అశోక్ స్పష్టంచేశారు. పార్టీని, కార్యకర్తలను రక్షించుకోవడం కోసం సాయుధ పోరాటం వదిలి చట్టబద్ధ పోరాటంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ శాంతి ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
రెండు పంథాల మధ్య పార్టీలో పోరాటం
తమ పార్టీలో రెండు పంథాల మధ్య జరుగుతున్న పోరాటం వాస్తవమేనని అశోక్ ధృవీకరించారు. తమ పొలిట్ బ్యూరో సభ్యుడు సోను (అభయ్) శాంతి ప్రతిపాదన సమర్థిస్తున్నట్లు అశోక్ వెల్లడించారు. గత రెండు సంవత్సరాలుగా పార్టీలో రెండు పంథాల మధ్య ఘర్షణ జరుగుతున్నది వాస్తవమేనని, విప్లవ పార్టీలో ఈ విధమైన పోరాటం మంచిదేనని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అశోక్ సమర్థించుకున్నారు. కేంద్ర కమిటీ సమావేశాలలో పార్టీ అవలంబిస్తున్న వ్యూహం ఎత్తుగడలను గురించి లోతైన చర్చలు జరిగినప్పటికీ వాటిని మార్చుకోవడంలో తమ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలు విఫలం అయ్యాయని అంగీకరించారు. దాని ఫలితంగా తమ పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. తమ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, అమరుడు బసవరాజ్ అభయ్ పేరుతో విడుదల చేసిన శాంతి చర్చల ప్రతిపాదన, ఆ తరువాత సోను అభయ్ పేరుతో విడుదల చేసిన ప్రకటనలను సైతం కేంద్ర ప్రభుత్వం గుర్తించకుండా పోలీస్ ఆపరేషన్లు, ఎన్ కౌంటర్లు కొనసాగిస్తున్నదని ఆరోపించారు.
ఆయుధాలు త్యజిస్తాం
దీర్ఘకాలిక ప్రజాయుద్ధ మార్గంలో పార్టీ తీవ్రంగా నష్టపోయిన ఈ స్థితిలో ఆయుధాలను త్యజించి, రాజ్యాంగ పరిధిలో ప్రజల సమస్యలపై పనిచేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాజ్యాధికారం లక్ష్యంగా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవడమే సరైన విధానంగా సికాస గుర్తిస్తుందన్నారు. యావత్ పార్టీ యూనిట్లు శాంతిని నెలకొల్పడం, సాయుధ పోరాటాన్ని విరమించడం అనే విషయంలో సానుకూల వైఖరితో ఉన్నాయని తెలిపారు. పొలిట్ బ్యూరో మెంబర్ సోను శాంతి ప్రతిపాదనలను సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులు, అభ్యుదయ భావాలను ఎల్లప్పుడూ ఆదరిస్తారని, ఇక్కడి ప్రజల చైతన్యం కారణంగానే సుదీర్ఘకాలంగా ప్రజా ఉద్యమాలు కొనసాగుతున్నాయని అశోక్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Maoists Clarification Ceasefire | అది పార్టీ నిర్ణయం కాదు.. తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటన సోనూ వ్యక్తిగత అభిప్రాయమే: మావోయిస్టు పార్టీ
Maoist Party | మావోయిస్టుల సంచలన ప్రకటన: ఆయుధాలు వదిలేస్తాం.. ప్రజా పోరాటాల్లో పాల్గొంటాం
Maoist Leaders Letters War | ప్రజాయుద్ధ పంథా దేశ పరిస్థితులకు తగనిది! దేవ్‌జీ జనరల్ సెక్రటరీ ఎంపిక మీడియా సృష్టే: జగన్‌కు కౌంటర్‌గా అభయ్ మరో స్టేట్‌మెంట్