Maoist Leaders Letters War | ప్రజాయుద్ధ పంథా దేశ పరిస్థితులకు తగనిది! దేవ్‌జీ జనరల్‌ సెక్రటరీ ఎంపిక మీడియా సృష్టే: జగన్‌కు కౌంటర్‌గా అభయ్‌ మరో స్టేట్‌మెంట్‌

సాయుధ పోరాట విరమణ విషయంలో మావోయిస్టు నాయకుల బహిరంగ లేఖల యుద్ధం కొనసాగుతున్నది. మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధికి కౌంటర్‌గా ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్‌ అలియస్‌ మల్లోజుల వేణుగోపాల్‌ తాజా మరో లేఖాస్త్రాన్ని సంధించారు.

Maoist Leaders Letters War | ప్రజాయుద్ధ పంథా దేశ పరిస్థితులకు తగనిది! దేవ్‌జీ జనరల్‌ సెక్రటరీ ఎంపిక మీడియా సృష్టే: జగన్‌కు కౌంటర్‌గా అభయ్‌ మరో స్టేట్‌మెంట్‌

విధాత ప్రత్యేక ప్రతినిధి :

Maoist Leaders Letters War | మావోయిస్టుల మధ్య లేఖల యుద్ధం కొనసాగుతున్నది. తాత్కాలిక సాయుధ పోరాట విరమణ పేరుతో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి అభయ్‌ అలియాస్‌ మల్లోజుల వేణుగోపాల్‌ లేఖ, దానికి తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ ఖండన ఇప్పటి వరకూ ఉండగా.. ఇప్పుడు జగన్‌కు కౌంటర్‌గా అభయ్‌ మరో ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశమైంది. దీర్ఘకాల ప్రజా యుద్ధ పంథాకే జగన్‌ దృఢంగా కట్టుబడి ఉండటంపై తనకేమీ అభ్యంతరం లేదన్న అభయ్‌.. జగన్‌ ప్రకటనలోని అంశాలకు అంశాలవారీగా కౌంటర్‌ ఇచ్చారు. ఈ నెల 22వ తేదీ పేరుతో ఈ ప్రకటన విడుదల చేసినట్టు ఉన్నది. ‘నా ప్రకటనలో నేను చాలా స్పష్టంగానే మా పార్టీ ప్రధాన కార్యదర్శి అమరుడు కామ్రేడ్ నంబాల కేశవరావు ప్రారంభించిన శాంతి చర్చలను నేను, నాతో పాటు కొంతమంది కామ్రేడ్స్ కొనసాగించదలచుకున్నామనే తెలిపాను. వారిలో కామ్రేడ్ రూపేశ్ ఒకరు. కాబట్టి ఇది పూర్తి పార్టీ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం కాదని జగన్ విడిగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన తొందరపాటుతో ఇచ్చిన ఈ ప్రకటన పార్టీ నిర్మాణ పద్దతులకు కూడా భిన్నమైనది. ఆయన తన రాష్ట్రానికి పరిమితమై నా ప్రకటనపై తన/తమ అభిప్రాయాలను ఇవ్వాల్సి వుంటుందనీ ఆయనకు తెలియనిదేమీ కాదు’ అని పేర్కొన్నారు.

దీర్ఘకాల ప్రజా యుద్ధ పంథా తగనిది..

ప్రాంతాలవారీగా రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకునే దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథా ఇకపై మన దేశ కాల పరిస్థితులకు తగనిది అని తెలంగాణ సహా దేశంలోని అనేక విప్లవోద్యమ ప్రాంతాలు నిరూపించాయని అభయ్‌ పునరుద్ఘాటించారు. ‘గత రెండు దశాబ్దాలకు పైగా తెలంగాణ భూభాగంలోకి వెళ్లి విప్లవోద్యమ కృషి చేయలేకపోతున్నామనేది, ప్రతిసారి రక్తతర్పణం చేసి డీకేకు వెనుదిరుగుతున్నామనేది మీరూ, నేనూ, మనమెవరమూ కాదనలేని వాస్తవం. దీనిని ఇప్పటికైనా గుర్తించండి’ అని మల్లోజుల వేణుగోపాల్‌ తన తాజా లేఖలో కోరారు. అనవసర నష్టాలకు తావివ్వకుండా విజ్ఞతతో వ్యవహరించడమే విప్లవకారులు చేయాల్సిన పని అని అన్నారు. ఇందులో మన సీసీ ఘోరంగా విఫలమైందనే మన 2024 సర్క్యులర్ చెపుతున్నదని, దానిని అర్ధం చేసుకోవాలని కోరారు. ‘మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మారుదాం. మనం విశాల ప్రజల మధ్యకు వెళ్లి ప్రజాపునాదిని పటిష్టపరుచుకుందాం’ అని మరోసారి విజ్ఞప్తి చేశారు. “గత పదేళ్ల సాయుధ పోరాటంలో ప్రతిష్టంభన ఏర్పడింది. అది దెబ్బ తిన్నది. చాలా కష్టం మీద అక్కడొకటి, యిక్కడొకటి యాక్షన్ చేయడం తద్వారా శత్రువుకు కల్గించిన నష్టం కంటే మనం ఎక్కువ నష్టానికి గురవడం జరుగుతోంది. ప్రజా పునాది ప్రాముఖ్యతను మన కేడర్ గుర్తించకపోవడం కూడా ముఖ్య కారణం. ఆ సంబంధాలే వుంటే, ఒకసారి దెబ్బతిన్న ప్రాంతంలో అతి దీర్ఘకాలం సంబంధాలు నెలకొనకపోవడం జరుగదు”. ఈ నేపథ్యంలో మనం తెలంగాణ విప్లవోద్యమాన్ని మారిన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ పునరాభివృద్ధి కోసం పాటుపడాలనీ కోరుతున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు.

శాంతి చర్చలను 2024 నవంబర్‌లోనే తిరస్కరించాం

నవంబర్ 2024లో జీ.ఎస్. సమక్షంలోనే కొంతమంది సీసీఎంలం శాంతి చర్చల విషయాన్ని చర్చించి ఆయుధాలు వదలకుండా ప్రభుత్వం చర్చలకు సిద్ధం లేదనీ, మనం ఇక శాంతి చర్చల గురించి అలోచించకూడదని కూడా అభిప్రాయపడినాం. కానీ, దీనికి భిన్నంగా మీ అందుబాటులోని సీసీఎంలు ‘శాంతి చర్చలకు మేం సిద్ధం’ అంటూ, మార్చ్ 2025లో తెలంగాణ శాంతి చర్చల మిత్రులకు అభిప్రాయం పంపారు. ప్రభుత్వం పదే పదే ఆయుధాలను వదలడం గురించి చెపుతున్న విషయంలో అందుబాటులో వున్న కొద్దిమందైనా స్పష్టమైన నిర్ణయం తీసుకొని, దానిని స్పష్టం చేస్తూ ఆ ప్రకటన పంపి ఉండాల్సింది. అలా చేయకపోవడంతో, ఆ ప్రకటననే అనుసరిస్తూ కామ్రేడ్ బసవరాజు, రూపేశ్ పరస్పరం చర్చించుకొని శాంతి చర్చలపై అనివార్యంగా ప్రకటనలు విడుదల చేశారు. ఇవన్నీ నవంబర్ 2024 అవగాహనకు భిన్నమైనవనే విషయం జగన్ తన బాధ్యుల నుండి తెలుసుకోవాలి. అయినప్పటికీ, పరిస్థితి తీవ్రతలో వస్తున్న పరిణామాల నేపథ్యంలో కామ్రేడ్స్ చొరవ చేస్తున్నారనే యావత్తు పార్టీ భావించింది. వాటి కొనసాగింపుగానే ప్రస్తుత నా ప్రకటన అనేది ఆయన అర్థం చేసుకోవాలి. సీసీలో జరుగుతున్న విషయాలపై ఆయనకు స్పష్టత లేనపుడు ముందుగా వాటిని తెలుసుకొని అవసరం అనుకుంటే వాటిపై తన/తమ వైఖరిని సీసీకి పంపుకోవచ్చు. ఆయనకు అన్ని అవకాశాలు వున్నప్పటికీ ఏదీ చేయకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం విచారకరం’ అని అభయ్‌ తెలిపారు.

అది ఆయన రాజకీయ అపరిపక్వత

తన సరెండర్‌ విషయంలో జగన్‌ చేసిన వ్యాఖ్యలపై అభయ్‌ తీవ్రంగా స్పందించారు. తన ప్రకటనలోని విషయాలపై కానీ, తాను ప్రజలకు చేసిన విజ్ఞప్తిపై కానీ నామమాత్రంగానైనా రాజకీయంగా స్పందించకుండా తన సరెండర్ గురించి మాట్లాడటం ఆయన రాజకీయ అపరిపక్వతను చాటుతోందని విమర్శించారు. పార్టీలో అంతర్గత సర్క్యులేషన్ కోసం తెలుగులో తాను విడుదల చేసిన 22 పేజీల కేడర్‌కు విజ్ఞప్తిని ఆయన చదివి దానిపై తన అమూల్యమైన అభిప్రాయాన్ని తెలిపి వుంటే, అది సీసీకి, పార్టీకి చాలా ఉ పయోగపడేదని పేర్కొన్నారు. పీబీ అగస్టు 2024లో విడుదల చేసిన సర్క్యులర్‌ను అమలు చేయలేకపోయామని, నిజానికి వాటిని మనం అమలు చేస్తూ భారత విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే, మనం తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేయడం అనివార్యమని గత యేడాది ఆచరణ మరింత స్పష్టంగా మనను హెచ్చరిస్తున్నదని పేర్కొన్నారు. దీనిని తన వ్యక్తిగత విషయంగా మార్చడం, మీ అమాయకత్వాన్ని ప్రదర్శించుకోవడమే అవుతుందని ఘాటుగా స్పందించారు. మీ అందుబాటులోని సీసీఎంలు కానీ, అమరుడు కామ్రేడ్ బసవరాజు కానీ, మన పార్టీ ఝార్ఖండ్ కామ్రేడ్స్ నుండి విడుదలైన కాల్పుల విరమణ ప్రకటన కానీ మన పార్టీని కాపాడుకోవడానికే తప్ప సరెండర్ల కోసం కాదని తెలిపారు. కామ్రేడ్ బసవరాజు పార్టీ ఆయుధాలు వదలడానికి కూడా సిద్దపడే విషయం ఆలోచించడం కేవలం ఆయన ఒక్కడి ప్రాణాలను కాపాడుకోవడం కోసం కానే కాదని స్పష్టంచేశారు. ఆయన అలాంటి ప్రతిపాదన చేయడం తప్పని ఈరోజు మీలాంటి కొంత మంది సమీక్షించడం మీ వ్యక్తిగతమైనదే అవుతుందని అన్నారు. కాల్పుల విరమణ విషయంలో బసవరాజుది స్వార్థమైతే, తనదీ స్వార్థమే అనుకోవచ్చని పేర్కొన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా మారకపోవడంలో పార్టీ తప్పిదం ఉందని, ఇకనైనా దానిని గుర్తించాలని కోరారు. అభిప్రాయాల వెల్లడికి తాను మెయిల్‌ ఐడీ ఇచ్చింది ఉత్తర ప్రత్యుత్తరాల కోసమేనని స్పష్టంచేశారు.

దేవ్‌జీ ఎన్నిక వార్త మీడియా సృష్టే

కామ్రేడ్ దేవ్‌జీ పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నికైనాడనే బూటకపు విషయాన్ని మీడియా సృష్టించిందని అభయ్‌ ఆరోపించారు. తమ రహస్య పార్టీ విషయాల సేకరణకు కావాలనే అనేక తప్పుడు విషయాలను ముందుకు తెస్తున్నదని విమర్శించారు.