civic volunteers । బెంగాల్‌లో అసలెవరీ సివిక్‌ వాలంటీర్లు? వాళ్ల అరాచకాలు వింటే..!

 civic volunteers । అదొక అనధికారిక పోలీస్‌ వ్యవస్థ. ఓ దశాబ్దం క్రితం పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (Mamata Banerjee) ట్రాఫిక్‌ నియంత్రణలో పోలీసులకు సహకరించేందుకు తీసుకువచ్చారు. ఇప్పుడు అలాంటి సివిక్‌ వాలంటీర్లు (civic volunteers) (పౌర స్వచ్ఛంద సేవకులు) రాష్ట్రవ్యాప్తంగా లక్షా19 వేల మందితో.. పరోక్షంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆర్మీగా (Trinamul 'army') అజమాయిషీ చెలాయిస్తున్నది

civic volunteers । బెంగాల్‌లో అసలెవరీ సివిక్‌ వాలంటీర్లు? వాళ్ల అరాచకాలు వింటే..!

civic volunteers । అదొక అనధికారిక పోలీస్‌ వ్యవస్థ. ఓ దశాబ్దం క్రితం పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (Mamata Banerjee) ట్రాఫిక్‌ నియంత్రణలో పోలీసులకు సహకరించేందుకు తీసుకువచ్చారు. ఇప్పుడు అలాంటి సివిక్‌ వాలంటీర్లు (civic volunteers) (పౌర స్వచ్ఛంద సేవకులు) రాష్ట్రవ్యాప్తంగా లక్షా19 వేల మందితో.. పరోక్షంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆర్మీగా (Trinamul ‘army’) అజమాయిషీ చెలాయిస్తున్నది. ఇప్పుడు ఆర్‌జీ కార్‌ వైద్య కళాశాలలో జూనియర్‌ వైద్యురాలు హత్య, లైంగిక దాడి కేసులో సంజయ్‌ రాయ్‌ అనే పౌర స్వచ్ఛంద సేవకుడి పాత్ర అనుమానాస్పదంగా మారింది. ఈ వ్యవస్థ.. ప్రజల రోజువారీ జీవన విధానంలో తనంతట తానుగా పాతుకు పోయింది. పోలీసు వ్యవస్థలో ఖాళీలను భర్తీ చేసే క్రమంలో తీసుకొచ్చిన ఈ వ్యవస్థలో 1.30 లక్షల మందిని రిక్రూట్‌ చేసుకోవడం లక్ష్యంగా ముఖ్యమంత్రి కార్యాలయ (chief minister’s office) హోం పేజీ పేర్కొంటున్నది. ఇప్పటి వరకూ 1,19,916 మంది వలంటీర్లను రిక్రూట్‌ చేశారు.

ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీలో (RG Kar Medical College) హత్య ఉదంతంలో ఇక్కడ రిక్రూట్‌ అయిన సంజయ్‌ రాయ్‌ (35) అనే సివిక్‌ వాలంటీర్‌ ఒక్కడే అరెస్టయ్యాడు. సంజయ్‌ అరెస్టుతో అసలీ సివిక్‌ వాలంటీర్‌ వ్యవస్థ ఏంటి? వారి విధులేంటి? అధికారాలేంటి? అనే చర్చ ఇతర రాష్ట్రాల్లో మొదలైంది. వీళ్లు కోల్‌కతా పోలీస్‌ బ్యారక్స్‌లో నివసిస్తారు. పోలీస్‌ మోటర్‌ బైక్‌ నడుపుతారు. గత కొన్నేళ్లుగా సివిక్‌ వాలంటీర్ల వ్యవస్థ.. తృణమూల్‌ కాంగ్రెస్‌కు సొంత ప్రైవేటు ఆర్మీగా మారిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. తగిన విద్యార్హతలు లేక నిరుద్యోగులుగా (unemployed youth) ఉన్నవారికి మంచి జీతాలతో ఈ కొలువులు ఇచ్చారు. వాస్తవానికి తొలుత వీరిని ట్రాఫిక్‌ నియంత్రణలో (control traffic) పోలీసులకు సహకరించేలా, మంచి చేసేవారికి తీసుకున్నారు. కాలం మారిన కొద్దీ శాంతి భద్రతల పరిరక్షణ వ్యవస్థలో షాడో వ్యవస్థగా (shadowy law and order management system) మారింది. అధికార పార్టీతో ఉన్న సాన్నిహిత్యం రీత్యా వారికి జీతభత్యాలు బాగానే ముడుతున్నాయి. గతంలో ఆకుపచ్చ రంగు యూనిఫాం (green uniform) ధరించేవారు. కానీ.. తదుపరి కాలంలో మమతా బెనర్జీకి ఇష్టమైన (Mamata Banerjee’s favourite colour) నీలం రంగుకు యూనిఫాంను మార్చారు.

బెంగాల్‌లో 2023 నాటికి 77.6 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అంచనా. రాష్ట్రంలో నిరుద్యోగిత సమస్య తీవ్రతకు ఈ సంఖ్య అద్దం పడుతున్నది. ఈ సమయంలో సివిక్‌ వాలంటీర్ల జాబ్‌కు 9వేలు ఇవ్వడం అంటే గొప్పే. వీరికి చట్టాలపై ఎలాంటి శిక్షణ (untrained) లేదు. మానవ హక్కులు (human rights) అంటే ఏమిటో తెలియదు. వారికి తెలిసిదల్లా ఒక్కటే. స్థానిక తృణమూల్‌ ‘దాదా’ను సంతృప్తిపర్చడమే. ఆ పని నెరవేర్చితే చాలు ఉద్యోగం రెన్యువల్‌ అయిపోతుంది.

‘సివిక్‌ వాలంటీర్లను వారి పార్టీకి సన్నిహితంగా (proximity) ఉండేవారితోనే నింపేస్తున్నారు. చాలా మంది ఇన్‌చార్జ్‌ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు తమ చుట్టూ నలగురైదుగురు సివిక్‌ వాలంటీర్లను వెంటేసుకుని తిరుగుతుంటారు’ అని ఉత్తర బెంగాల్‌లోని ఫలకటాకు (Falakata) చెందిన బీజేపీ ఎమ్మెల్యే దీపక్‌ బర్మన్‌ ఆరోపించారు. పోలీసులకు అవసరమైన పనులు చేసిపెట్టడం, వారి తరపున మామూళ్లు వసూలు చేయడం, ప్రతిపక్ష పార్టీల నాయకుల కదలికలపై కన్నేసి (surveillance) ఉంచడమే వారి పని. ఎక్కడైనా జిల్లాల్లో మమతాబెనర్జీ సభలు (public meeting) లేదా ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటే.. వారు తమ యూనిఫాం తీసేసి, తృణమూల్‌ కార్యకర్తలుగా మారిపోయి.. సభా ప్రాంగణాన్ని నింపేస్తారు’ అని ఆయన ఆరోపించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. కోల్‌కతా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల సివిక్‌ వాలంటీర్లు.. జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ నాయకత్వంలోని నాజీ పార్టీకి చెందిన కరడుగట్టిన షుడ్జ్‌టఫెల్‌గా (Schutzstaffel) మారిపోయారన్న విమర్శలు ఉన్నాయి. వీరికి ఎలాంటి సైద్ధాంతిక అవగాహన లేకుండానే అది ఉనికిలో ఉన్న దాదాపు రెండు దశాబ్దాలపాటు జర్మన్‌ సైనిక దుస్తుల్లో కొనసాగారు.

సివిక్‌ పోలీస్‌ వాలంటీర్లకు సంబంధించిన ప్రభుత్వ వెబ్‌సైట్‌ మాత్రం వారిని ట్రాఫిక్‌ గార్డులుగా, పోలీస్‌ స్టేషన్ల వద్ద కాపలాదారులుగా మాత్రమే పేర్కొంటున్నది. ప్రధాన పండుగల సందర్భంగా ట్రాఫిక్‌ను నియంత్రించడం, అనధికారికంగా పార్క్‌ చేసిన వాహనాలను తొలగించడం (unauthorized parking) , పోలీసుల అధికారిక పనుల్లో సహకరించడం, ప్రజా భద్రత, పై అధికారులు ఆదేశించిన పనులు చేయడం వీరి ప్రాథమిక విధుల్లో కొన్ని. సంజయ్‌ రాయ్‌నే ఉదాహరణగా తీసుకుంటే.. అతడు సివిక్‌ వాలంటీర్‌గా ఆర్‌జీ కార్‌ హాస్పిటల్‌లో ఏ సమయంలోనైనా, ఏ విభాగంలోకైనా వెళ్లేందుకు అధికారం కలిగి ఉన్నాడు. అసలు ఈ మొత్తం వ్యవస్థే అక్రమమైనదని సీపీఎం నేత సుజన్‌ చక్రవర్తి (Sujan Chakraborty) ఆరోపించారు. ‘ఎలాంటి రాత పరీక్షలు లేవు. ఇంటర్వ్యూలు లేవు. సివిక్‌ వాలంటీర్‌గా పనికి వస్తాడని ఎవరు నిర్ణయిస్తారు? అధికార పార్టీ ఒక లిస్టును ఇస్తుంది. ఆ మేరకు రిక్రూట్‌మెంట్లు జరుగుతాయి’ అని సుజన్‌ చక్రవర్తి చెప్పారు. ‘సివిక్‌ వాలంటీర్లుగా చెప్పే వీరిలో అనేక మంది నేరపూరిత కార్యకలాపాల్లోనూ (criminal activities) ఉన్నారు. అధికార పార్టీతో ఉన్న సంబంధాల రీత్యా పోలీసులను సైతం కంట్రోల్‌ చేసే పరిస్థితికి సివిక్‌ వాలంటీర్ల వ్యవస్థ వెళ్లిపోయింది’ అని ఆయన చెప్పారు. వాస్తవానికి క్రిమినల్‌ రికార్డు ఉంటే వారిని రిక్రూట్‌ చేసుకోరు. కానీ.. సంజయ్‌పై గృహ హింస కేసు (domestic violence) ఉన్నది. కానీ అరెస్టు కాలేదు.

గతంలో విద్యార్థి ఉద్యమ కార్యకర్త అనిస్‌ ఖాన్‌ (Anis Khan) 2022లో హత్యకు గురైనప్పుడు ఆయన హత్య వెనుక సివిక్‌ వాలంటీర్‌ ఒకరు ఉన్నట్టు తేలింది. ఆ సమయంలో సివిక్‌ వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని అప్పటి అడ్వొకేట్‌ జనరల్‌ గోపాల్‌ ముఖోపాధ్యాయ ఆన్‌ రికార్డ్‌ చెప్పడం గమనార్హం. అయితే.. తర్వాత అది తన వ్యక్తిగత అభిప్రాయంగా ఆయన చెప్పుకొన్నారు. పది రోజుల క్రితం కూడా ఒక టోటో డ్రైవర్‌కు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. ఒక సివిక్‌ వాలంటీర్‌ అతడి నుంచి 11,370 రూపాయలు వసూలు చేశాడు. కలకత్తాలోని లేక్‌ కాళీ బరీ ఆలయంలో ఎవరైనా కొత్త లేదా పాత వాహనాలకు పూజ చేయించుకోవడానికి వస్తే.. అక్కడి పౌర సేవకులకు వంద, యాభై రూపాయలు ఇవ్వాల్సిందేనన్న విమర్శలు ఉన్నాయి.

సివిక్‌ వాలంటీర్ల వ్యవస్థను పోలీసుల నుంచి డీ లింక్‌ (delink the civic volunteers) చేయాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఎం నేత సుజన్‌ చక్రవర్తి అన్నారు. ‘వాళ్లు నాగరికులు, స్వచ్ఛంద సేవకులూ కానప్పుడు వారికి హోం శాఖ నుంచి జీతాలు ఎందుకు చెల్లించాలి? వారు పోలీసులతో కలిసి తిరగడమేంటి? రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాలంటే ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ నుంచి వారిని తప్పించాలి’ అని చక్రవర్తి డిమాండ్‌ చేశారు.