న్యూఢిల్లీ: మణిపూర్‌లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నా ప్రధాని మోదీ ఇప్పటికీ మౌనాన్నే ఆశ్రయించడంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. గతంలో ఏ ప్రధాన మంత్రీ ఒక రాష్ట్రాన్ని ఇలా వదిలేసిన ఉదంతాలు లేవని పేర్కొన్నది. 15 నెలల క్రితం మణిపూర్‌లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ దుర్మార్గమైన విధానాలు, ప్రధాన మంత్రి ప్రాధాన్యాల కారణంగానే మణిపూర్‌లో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్ విమర్శించారు.
డబుల్ ఇంజిన్ సర్కార్‌గా చెప్పకొనే మణిపూర్‌లో ప్రభుత్వ విభజన రాజకీయాల కారణంగా మే 3వ తేదీ సాయంత్రం మంటలు అంటుకున్నాయని విమర్శించారు. మణిపూర్ తగలబడుతుంటే.. దాదాపు నెల తర్వాత కర్ణాటక ఎన్నికల విధులు, ఇతర అత్యవరసర పనులు ముగించుకుని హోమంత్రి అమిత్‌షా తీరిగ్గా మణిపూర్‌ను సందర్శించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అయినా ఎలాంటి మార్పూ రాలేదు. నిజానికి అప్పటి నుంచి పరిస్థితులు మరింత దిగజారాయి. సామాజిక సామరస్యం పూర్తిగా దెబ్బతిన్నది.
నిత్యం దారుణమైన ఘటనలు బయటకు వస్తూనే ఉన్నాయి. వేల సంఖ్యలో ప్రజలు శరణార్థి శిబిరాల్లో కునారిల్లుతున్నారు. సాయుధ దళాలకు, రాష్ట్ర పోలీసులకు మధ్య ఘర్షణలు నిత్యకృత్యంగా మారాయి’ అని జైరాంరమేశ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అయినప్పటికీ ఇవేవీ ప్రధానికి పట్టలేదని, పార్లమెంటులో 133 నిమిషాలు మాట్లాడిన మోదీ.. మణిపూర్ గురించి ఐదు నిమిషాలే మొక్కుబడిగా మాట్లాడారని విమర్శించారు. మెజార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నా.. ఇంకా పదవిలోనే ఉన్నారని అన్నారు.
మణిపూర్ రగులుతున్న సమయంలో చివరిసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో ప్రధాని ఎప్పుడు మాట్లాడారు? మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యేలను చివరిసారి ఎప్పుడు కలిశారు? తన క్యాబినెట్ సహచరులతో మణిపూర్ గురించి మోదీ చివరిసారి ఎప్పుడు చర్చించారు? అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక ప్రధాన మంత్రి ఒక రాష్ట్రాన్ని ఇలా పూర్తిగా వదిలివేయడం గతంలో ఎన్నడూ లేదని జైరాం రమేశ్ అన్నారు. మణిపూర్‌లో ఘర్షణలు మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకూ మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించలేదు. దీనిని కాంగ్రెస్ గట్టిగా నిలదీస్తున్నది.