ప్రముఖ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

ప్రముఖ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి(84) కన్నుమూశారు. అనారోగ్యంతో ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. యామినీ కృష్ణమూర్తి భరతనాట్యం, కూచిపూడి నర్తకిగా ఖ్యాతిగాంచారు.

ప్రముఖ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

విధాత, హైదరాబాద్ : ప్రముఖ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి(84) కన్నుమూశారు. అనారోగ్యంతో ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. యామినీ కృష్ణమూర్తి భరతనాట్యం, కూచిపూడి నర్తకిగా ఖ్యాతిగాంచారు. యామినీ కృష్ణమూర్తి చిత్తూరు జిల్లా మదనపల్లిలో 1940 డిసెంబర్ 20న జన్మించారు. నాట్యకళలో ఆమె దేశ, విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం పొందిన యామినీ.. 1957లో తన తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారు. అప్పటి నుంచి దేశవిదేశాల్లో వేలాది ప్రదర్శనలిచ్చి పేరు ప్రఖ్యాతలు పొందారు. ఆమెకు భారత ప్రభుత్వం1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ అవార్డులతో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డులతో గౌరవించింది. గతంలో టీటీడీ ఆస్థాన నర్తకిగా కూడా ఆమె సేవలందించారు. ఢిల్లీలో ‘యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్’ స్థాపించి ఎంతో మంది యువతకు భరత నాట్యం, కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇచ్చారు. ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్ పేరుతో పుస్తకం రచించారు. యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల భారత రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సహా వివిధ రంగాల ప్రముఖులంతా తమ సంతాపాన్ని తెలుపుతున్నారు.