Sonia Gandhi : బర్త్ డే రోజున..సోనియాగాంధీకి కోర్టు షాక్

సోనియా గాంధీపై పౌరసత్వం రాకముందే ఓటరు జాబితాలో పేరు చేరిందంటూ కేసు. రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది, విచారణ జనవరి 6కి వాయిదా.

Sonia Gandhi : బర్త్ డే రోజున..సోనియాగాంధీకి కోర్టు షాక్

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి మంగళవారం ఆమె జన్మదినం రోజున రౌస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది. భారత పౌరసత్వం రాక ముందే ఆమె పేరును ఓటరు జాబితాలో చేర్చారన్న ఆరోపణల నేపథ్యంలో దాఖలైన పిటిషన్‌పై రౌస్ అవెన్యూలోని సెషన్స్‌ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. అనంతరం సెషన్స్‌ కోర్టు సోనియాకు నోటీసులు జారీ చేసింది.

ఈ కేసులో పిటిషనర్‌ తరఫు న్యాయవాది పవన్‌ నారంగ్‌ తన వాదనలు వినిపించారు. సోనియాగాంధీకి పౌరసత్వం రాకముందే ఆమె పేరును ఓటరు జాబితాలో చేర్చారని, అందుకోసం అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై పునఃపరిశీలన అవసరమన్నారు. 1980లో ఓటర్ల జాబితాలో పేరు కోసం కొన్ని నకిలీ పత్రాలను సృష్టించి ఉంటారని అనుమానం వ్యక్తంచేశారు. ఆ తర్వాత ఆమె పేరును తొలగించి.. మళ్లీ 1983లో తిరిగి చేర్చారని ఆరోపించారు. ఈ రెండు కూడా సోనియాకు పౌరసత్వం రాకముందే జరిగాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన పలు ఆధారాలను ఆయన కోర్టుకు సమర్పించారు.

వాటినిపరిశీలించిన కోర్టు..దీనిపై వివరణ ఇవ్వాలని సోనియాతో పాటు ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 6కు వాయిదా వేసింది. గతంలో సోనియాగాంధి ఓటు నమోదు, పౌరసత్వం విషయంలో ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించారని. దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో మేజిస్ట్రేట్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్‌ రౌస్ అవెన్స్ సెషన్స్‌ కోర్టులో సవాల్‌ చేశాడు. విచారణ పిదప కోర్టు సోనియాగాంధీకి నోటీసులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి :

Madhavaram Krishna Rao : మీ బండారం విప్పితే..తట్టుకోలేవు: ఎమ్మెల్యే మాధవరం
Silver Price : 2లక్షల మార్క్ వైపు.. వెండి ధర పరుగు