Delhi STF Seizes 10 Tonnes Red Sandalwood | న్యూఢిల్లీలో రూ.10కోట్ల ఎర్రచందనం దుంగల పట్టివేత

దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్లకాబాద్‌లో రూ.10 కోట్ల విలువైన 10 టన్నుల 'ఏ గ్రేడ్' ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు స్మగ్లర్‌లను అరెస్టు చేశారు.

Delhi STF Seizes 10 Tonnes Red Sandalwood | న్యూఢిల్లీలో రూ.10కోట్ల ఎర్రచందనం దుంగల పట్టివేత

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అక్రమ రవాణా చేసి నిల్వ చేసిన ఏ గ్రేడ్ ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలోని గోదాంలపై నిర్వహించిన దాడిలో అక్రమంగా నిల్వ చేసిన రూ.10కోట్ల విలువైన 10 టన్నుల ఎర్రచందనం దుంగలను పట్టుకుని సీజ్ చేశారు. ఢిల్లీ స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో హైదరాబాద్, ముంబైలకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు ఇర్ఫాన్, అమిత్ సంపత్ పవార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాకు చెందిన స్మగ్లర్ పరారీలో ఉన్నాడు. ఎర్రచందనం దుంగలను ఏపీలోని తిరుపతి అటవీ ప్రాంతాల నుండి స్మగ్లర్లు సేకరించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అవి ట్రక్కుల ద్వారా ఇతర సరుకుల ముసుగులో అక్రమంగా ఢిల్లీకి తరలించబడ్డాయని పోలీసులు తెలిపారు.

తుగ్లకాబాద్ లోని ఓ ప్రవైట్ గోదాంలో నిల్వ చేసిన ఎర్ర చందనం దుంగలను.. విదేశాలకు తరలించే ప్రణాళికతో ఉన్నారని సమాచారం. ఈ స్మగ్లింగ్ రాకెట్ అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తోందని, ముఖ్యంగా చైనా, దక్షిణాసియా దేశాలకు ఎర్రచందనం అక్రమంగా ఎగుమతి అవుతోందని వెల్లడించారు. నేపాల్, మయన్మార్ సరిహద్దుల ద్వారా ఎర్రచందనం దుంగలను చైనాకు తరలిస్తున్నారని అనుమానిస్తున్నామని తెలిపారు