Farmers Protest । శంభు సరిహద్దు వద్ద అన్నదాతలపై బాష్పవాయుగోళాలు
వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే కీలకమైన డిమాండ్‌తో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వానికి, ఆందోళనకు దిగిన రైతులకు వివాదం నడుస్తున్నది.

Farmers Protest । అంబాలా – ఢిల్లీ రహదారిపై శంభు సరిహద్దు పాయింట్ వద్ద ఆందోళన చేస్తున్న అన్నదాతలపై భద్రతా దళాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించాయి. తమ డిమాండ్ల సాధన కోసం చలో ఢిల్లీకి రైతు సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 10 మంది రైతులతో కూడా ఒక బృందం ముళ్ల కంచెలు సహా మూడు అంచెల అడ్డంకులను అధిగమించి ముందుకు సాగినా.. రోడ్లపై కాంక్రీట్ అడ్డంకులు, బాష్పవాయుగోళాల ప్రయోగంతో రైతులను అడ్డుకున్నారు. ఈ ఘటనలో పలువురు రైతులు గాయపడినట్టు తెలుస్తున్నది. పోలీసులు చర్యలకు దిగుతున్న నేపథ్యంలో రైతులను కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం), సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) వెనుకకు పిలిపించాయి. తాము ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించాలంటూ పోలీసు సిబ్బందిని త్రివర్ణ పతాకాలు చేబూని రైతులు విన్నవించుకున్నారు. తాము శాంతియుతంగా ఢిల్లీకి ప్రదర్శనగా వెళతామని చెప్పినా పోలీసులు అంగీకరించలేదు. అన్నదాతల ఆందోళనల నేపథ్యంలో డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 9 వరకూ హర్యానాలోని అంబాలా జిల్లాలో ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు.రైతుల ఆందోళనల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం అంబాలా- ఢిల్లీ హైవేపై శంభు పాయింట్ వద్ద అదనపు బలగాలను, నీటి ఫిరంగులను మోహరించింది.
వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే కీలకమైన డిమాండ్‌తో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వానికి, ఆందోళనకు దిగిన రైతులకు వివాదం నడుస్తున్నది. 2021 నవంబర్‌లో మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న సమయంలో కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీ ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని రైతు సంఘాలు ప్రస్తావిస్తున్నాయి. కానీ ఆ హామీని ఇప్పటి వరకూ నిలుపుకోలేదని విమర్శిస్తున్నాయి. గతంలో.. ఫిబ్రవరి నెలలో కూడా పంజాబ్ రైతులు ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. హర్యానా అధికార యంత్రాంగం తీవ్రంగా అడ్డుకున్నది. ఆ సమయంలో జరిగిన ఘర్షణల్లో ఒక అన్నదాత ప్రాణాలు కోల్పోయాడు. అనేక మంది గాయాలపాలయ్యారు. అప్పటి నుంచి పంజాబ్ – హర్యానా అంతర్రాష్ట్ర సరిహద్దు పాయింట్లయిన శంభు, ఖానౌరీ వద్ద రైతులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శుక్రవారం నాడు రైతులు మరోమారు హర్యానా ప్రభుత్వ భద్రతా వ్యవస్థను దాటుకుని ఢిల్లీ బాట పట్టేందుకు ప్రయత్నించారు. 2020 నాటి చారిత్రాత్మక నిరసనలను మళ్లీ చేపట్టడం తప్ప తమకు మరో మార్గం లేదని రైతు సంఘాలు తేల్చి చెబుతున్నాయి. అన్నదాతల ఆందోళనకు పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు మద్దతు పలుకుతున్నాయి.