మ‌రో విమానం సిద్ధంగా ఉంది ఇది దిగిపోండి’.. అబ‌ద్ధ‌మాడి ప్ర‌యాణికుల‌ను దించేసిన ఇండిగో

బెంగ‌ళూరు (Bengaluru) నుంచి చెన్నై వెళ‌దామ‌ని విమానం (Airplane) లో కూర్చున్నారు. ఇక కాసేప‌ట్లో బ‌య‌లుదేర‌తామ‌న‌గా విమాన సిబ్బంది వారితో మాట్లాడారు. ఈ విమానం (Indigo) లో స‌మ‌స్య ఉంద‌ని... కాసేప‌ట్లోనే చెన్నైకు బ‌య‌లుదేరుతున్న విమానంలో పంపుతామ‌ని చెప్పి దిగ‌మ‌న్నారు

  • Publish Date - November 21, 2023 / 07:53 AM IST

విధాత‌: బెంగ‌ళూరు (Bengaluru) నుంచి చెన్నై వెళ‌దామ‌ని విమానం (Airplane) లో కూర్చున్నారు. ఇక కాసేప‌ట్లో బ‌య‌లుదేర‌తామ‌న‌గా విమాన సిబ్బంది వారితో మాట్లాడారు. ఈ విమానం (Indigo) లో స‌మ‌స్య ఉంద‌ని… కాసేప‌ట్లోనే చెన్నైకు బ‌య‌లుదేరుతున్న విమానంలో పంపుతామ‌ని చెప్పి దిగ‌మ‌న్నారు. తీరా వారంతా దిగాక‌.. త‌ర్వాతి రోజు ఉద‌యం వ‌ర‌కు విమానం అందుబాటులో లేద‌ని చెప్పి విమాన‌శ్ర‌యంలోనే ఉంచేశారు.


ఆ త‌ర్వాత తెలిసింది ఏంటంటే.. విమానంలో ఆరుగ‌రు ప్ర‌యాణికులే ఉండ‌టంతో న‌ష్టం వ‌స్తుంద‌ని భావించిన విమాన‌యాన సంస్థ వారిని మ‌భ్య‌పెట్టి విమానం దించేసింది. తెలివిగా స‌ర్వీసు క్యాన్సిల్ చేసి త‌ర్వాతి రోజు ఉద‌యం వారిని వివిధ విమానాల్లో చెన్నై పంపించింది. విమాన‌యాన రంగంలో పొదుపున‌కు మారుపేరైన ఇండిగో సంస్థ ఈ వివాదానికి కేంద్ర‌బిందువుగా నిలిచింది.


అమృత్‌స‌ర్ – చెన్నై వ‌యా బెంగ‌ళూరు విమానంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ విమానం బెంగ‌ళూరుకు వ‌చ్చిన స‌మ‌యంలో ఆరుగురుం మాత్ర‌మే చెన్నై వెళ్లేందుకు ఉండ‌టంతో త‌మ‌ను అబ‌ద్ధం చెప్పి దించేశార‌ని ప్ర‌యాణికులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌గా ప్ర‌యాణికుల్లో కొంద‌రు మీడియాకు సమాచారం ఇవ్వ‌డంతో ఈ ఘ‌ట‌న తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.


ఆ రాత్రి చెన్నై వెళ్లే విమానం ఏదీ లేక‌పోవ‌డంతో ఇద్దరు వృద్ధులు స‌హా తామంతా ఎయిర్‌పోర్ట్‌లోనే గ‌డిపామ‌ని వారు వాపోయారు. విమానం బెంగ‌ళూరుకు చేరుకోగానే నాకు ఫోన్ వ‌చ్చింది. ఇండిగో సంస్థ నుంచి మాట్లాడుతున్నానని చెప్పిన ఆ వ్య‌క్తి.. తాను బోర్డింగ్ పాస్‌తో సిద్ధంగా ఉన్నాన‌ని. విమానం దిగితే వేరే విమానంలో చెన్నై వెళ్లిపోవ‌చ్చ‌ని ఫోన్‌లో చెప్పాడు. అది న‌మ్మి దిగిపోయా. మిగ‌తా అయిదుగురికీ ఇలానే ఫోన్లు వ‌చ్చాయి అని ఓ ప్ర‌యాణికుడు తెలిపాడు.


దీనిపై ఇండిగోను వివ‌ర‌ణ కోర‌గా… ప్ర‌యాణికుల్లో ఇద్ద‌రికి విమానాశ్ర‌యానికి 13 కి.మీ. దూరంలో ఉన్న హోట‌ల్‌లో వ‌స‌తి క‌ల్పించామ‌ని.. మిగ‌తా న‌లుగురు ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లోనే ఉంటామ‌ని చెప్పార‌ని సంస్థ సిబ్బంది తెలిపారు. వారంద‌రినీ సోమ‌వారం ఉద‌యం వివిధ విమానాల్లో చెన్నై పంపేశామ‌ని పేర్కొన్నారు.


అయితే త‌మ‌కు జ‌రిగిన అవ‌మానానికి సంస్థ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని ఒక ప్ర‌యాణికుడు పేర్కొన్నారు. ముందు బుకాయించిన సిబ్బంది త‌ర్వాత అస‌లు విష‌యం చెప్పార‌ని.. హోట‌ల్ ఇవ్వ‌మ‌ని అడిగితే అందుకు త‌మ‌కు అర్హ‌త లేద‌ని తేల్చేశార‌ని వాపోయాడు.

Latest News