న్యూఢిల్లీ : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సర్ రాజ్యాంగబద్దమేనని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ కు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ నిర్వహించే అధికారం ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.SIR ప్రక్రియకు సుప్రీంకోర్టు బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.
బిహార్‌లో ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) జాబితా విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది.రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 ప్రకారం ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించేందుకు ఈసీకి అధికారాలు ఉన్నాయని పేర్కొంది. ఆర్టికల్ 324 మేరకు రాజ్యాంగ చట్టాలకు మరింత మద్దతుగా ఉందని అభిప్రాయపడింది. గతంలో చేపట్టిన ఆర్డినరీ ప్రక్రియకు సర్ విరుద్దంగా ఉన్నంతా మాత్రాన అధికారాలకు అతీతంగా భావిస్తూ..ప్రక్రియను నిలివేయాలన్న వాదన సరైంది కాదని, ఎన్నికల నిర్వహణ వ్యవస్థ బలోపేత చర్యగానే ఈసీ సర్ ప్రక్రియను చేపట్టినట్లుగా భావిస్తున్నామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ(సర్)ను అనేక రాష్ట్రాలు, పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దీనిపై సుప్రీం కోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఏ చట్టాన్ని లేదా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. SIR అనేది కచ్చితమైన, సమగ్రమైన ఓటర్ల జాబితా దిశగా ఒక ముందడుగు అని, రాజ్యాంగానికి జీవం పోస్తుందని వ్యాఖ్యానించింది. SIRను వినియోగించడం ద్వారా ఎన్నికల సంఘం తన చట్టబద్ధమైన అధికారాలకు వెలుపల వ్యవహరించలేదని తెలిపింది. ఎస్ఐఆర్ ద్వారా సాధించాలనుకుంటున్న లక్ష్యానికి, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలనే రాజ్యాంగ లక్ష్యానికి ప్రత్యక్ష సంబంధం ఉందని తాము కూడా సంతృప్తిగా ఉన్నామంది. సర్ కు మద్దతుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈసీకి ఊరట కలిగినట్లయ్యింది.
మే 30 నుంచి 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడో విడత, చివరి దశ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ప్రతిపక్ష పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది.
