గర్భవిచ్చిత్తిని నిరాకరించిన సుప్రీంకోర్టు

  • Publish Date - October 16, 2023 / 11:41 AM IST

విధాత: 26 వారాల తన గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలని కోరుతూ ఓ మహిళ చేసిన విన్నపాన్ని సుప్రీంకోర్టు త్రోసిపుచ్చుతూ సంచలన తీర్పునిచ్చింది. ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన నివేదిక మేరకు ఈ కేసులో తల్లికి, గర్భస్థ శిశువుకు ఎటువంటి సమస్యల లేనందునా గర్భ విచ్చిత్తికి అంగీకరించేది లేదన్నారు. ఇప్పటికే 26 వారాల 5రోజులు పూర్తయ్యాయని, ఇప్పుడు ఆ గుండె చప్పుడును ఆపలేమన్నారు.


సీజేఐ డివై.చంద్రచూడ్ ధర్మాసనం ఈ కేసులో తల్లి, శిశువుకు ఇద్దరికి కూడా ఎలాంటి అసాధారణ అనారోగ్య పరిస్థితి లేనందునా, గర్భ విచ్చిత్తికి అనుమతిస్తే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్టులోని సెక్షన్ 3, సెక్షన్ 5 ఉల్లంఘనే అవుతుందన్నారు. చిన్నారి పుట్టిన తర్వాతా స్వయంగా పెంచుకోవడమా లేదా దత్తత ఇచ్చే అంశంపై తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవచ్చన్నారు.


ప్రస్తుతానికి గర్భంతో ఉన్న మహిళ ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారని, ఆమె ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కాగా పిటిషన్ వేసిన మహిళకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండగా, ప్రసవానంతర కుంగుబాటుతో ఇబ్బంది పడుతున్నానని, మానసికంగా, ఆర్ధికంగా మూడో బిడ్డను కని పెంచే పరిస్థితుల్లో లేనంటూ గర్భవిచ్చిత్తికి అనుమతివ్వాలంటూ ఆమె కోరింది.


దీనిపై ఎయిమ్స్ వైద్యుల నివేదిక ఆధారంగా ఆక్టోబర్ 9వ తేదీన గర్భవిచ్చిత్తికి అనుమతించింది. దీనిని కేంద్రం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసులో ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయలు వ్యక్తం చేయగా, కేసు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుకు వచ్చింది. సీజే చంద్రచూడ్ ధర్మాసనం ఈ కేసును విచారించి మహిళ గర్భవిచ్చిత్తి అభ్యర్థనను తిరస్కరిస్తూ తీర్పునిచ్చారు.