తెలంగాణలో ప్రారంభమైన తొలి విడత జనగణన

తెలంగాణలో తొలివిడత జనగణన- 2027 ప్రారంభమైంది. గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, మంత్రి పొన్నం ప్రభాకర్‌ సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ (స్వీయ గణన) చేసుకున్నారు. అధికారుల సమక్షంలో మంత్రి పొన్నం జనగణన నమోదు చేసుకున్నారు. ప్రజలంతా సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ చేసుకోవాలని కోరారు.

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో తొలివిడత జనగణన- 2027 ప్రారంభమైంది. గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, మంత్రి పొన్నం ప్రభాకర్‌ సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ (స్వీయ గణన) చేసుకున్నారు. అధికారుల సమక్షంలో మంత్రి పొన్నం జనగణన నమోదు చేసుకున్నారు. ప్రజలంతా సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ చేసుకోవాలని కోరారు. ప్రతి పౌరుడు తన కుటుంబ వివరాలను జనాభా లెక్కల్లో చూపెట్టాలని పిలుపునిచ్చారు. దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉండేలా సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ జరగాలని కోరారు.

మే 10వ తేదీ వరకు తొలి విడత జన గణన

జ‌న‌గ‌ణ‌న‌-2027లో భాగంగా తెలంగాణలో తొలివిడత సెల్ఫ్‌-ఎన్యుమ‌రేష‌న్ ప్రక్రియ ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని జనగణన తెలంగాణ డైరెక్టర్‌ భారతీ హాళికెరి తెలిపారు. తెలంగాణ భౌగోళిక పరిధిలో ఉన్న ప్రతి ఇంటినీ లెక్కిస్తామని వివరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి జనగణన ఇది అని పేర్కొన్నారు. డిజిట‌ల్ పద్ధతిలో జరుగుతున్న తొలి జ‌న‌గ‌ణ‌న కూడా ఇదేన‌ని తెలిపారు. ముఖ్యంగా మొద‌టిసారిగా జ‌న‌గ‌ణ‌న ప్రక్రియలో ఈసారి సెల్ఫ్‌-ఎన్యుమ‌రేష‌న్ ప్రక్రియ పాటిస్తున్నామ‌ని.. ప్రజలు నేరుగా జ‌న‌గ‌ణ‌న‌లో పాల్గొనేందుకు ఇది ఒక మంచి అవ‌కాశమ‌ని ఆమె చెప్పారు. కుల‌గ‌ణ‌న జ‌రుగుతుండ‌టం కూడా ఈసారి జ‌న‌గ‌ణ‌న‌లో ప్రత్యేకమని వివరించారు. దేశంలో 1931 తర్వాత స్వాతంత్ర్యం అనంతరం తొలిసారికుల గణన జరుగుతుండగా, 16 సంవత్సరాల అనంతరం జనగణన నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గతంలో పేపర్‌ ఆధారంగా చేపట్టిన గణనను ఇప్పుడు డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.ప్రజలు https://se.census.gov.in వెబ్ పోర్టల్‌ ద్వారా స్వచ్ఛందంగా జ‌న‌గ‌ణ‌న‌కు త‌మ వివ‌రాల‌ను అందించవచ్చని తెలిపారు.

సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఓ ఛాయిస్..

సాధారణంగా జనగణన సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరించే విధానానికి బదులుగా, సాంకేతికతను వినియోగించి ప్రజలే తమ వివరాలను నేరుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించినట్టు చెప్పారు. ఈ ప్రక్రియ తప్పనిసరి కాదని, కేవలం ఒక ఎంపిక మాత్రమేనని స్పష్టం చేశారు

ఆస్పత్రి, బడి, గుడి, గుడిసె, అద్దెభవనం ఇలా ఏదైనా జనగణన జరుగుతుందన్నారు. భవనంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. ప్రజలు తాము ఉన్నచోటు నుంచే జనాభా లెక్కలు నమోదు చేయించుకోవచ్చని తెలిపారు.సెల్ఫ్ ఎన్యుమరేషన్ లో కుటుంబ యాజమాని పేరు, మొబైల్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక 11 అంకెల ఐడీ నంబర్ లభిస్తుందని చెప్పారు. జనగణనలో మొత్తం 33 ప్రశ్నలు ఉండగా, సెల్ఫ్ ఎన్యుమరేషన్‌లో 27 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.

మిగిలిన 6 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను రెండో దశలో ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు అందించాలని సూచించారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసిన వారు తర్వాత ఎన్యుమరేటర్ వచ్చినప్పుడు రిఫరెన్స్ నంబర్ చూపిస్తే సరిపోతుందని తెలిపారు. ఒక కుటుంబం సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసినా, చేయకపోయినా రెండో దశలో ఎన్యుమరేటర్ ప్రతి ఇంటికీ తప్పనిసరిగా వస్తారని చెప్పారు. ఈ క్రమంలో ఇండ్ల గణన సమయంలో ప్రతి ఇంటికి ప్రత్యేక నంబర్ కేటాయిస్తామని తెలిపారు.

ఫిబ్రవరిలో రెండో దశ జన గణన

2027 ఫిబ్రవరిలో రెండో దశ మొదలయ్యేలోగా అంతా సిద్ధం చేస్తాం. రెండో దశలో 2027 ఫిబ్రవరి నుంచి వ్యక్తిగత సమాచారం సేకరిస్తాం. ఇళ్ల గణన కోసం బ్లాకులుగా విభజించి ఎన్యుమరేటర్లను కేటాయిస్తాం. మే 11 నుంచి జూన్‌ 9 వరకు ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి మార్కు చేస్తారు. ప్రతి భవనంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయనేది మార్కు చేస్తారు అని భారతీ హాళికెరి పేర్కొన్నారు.

Latest News