Liquor policy scam | లిక్కర్ పాలసీ స్కామ్‌లో కేజ్రీవాల్ సూత్రధారి : ఢిల్లీ హైకోర్టులో సీబీఐ వాదనలు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూత్రధారి అని సీబీఐ ఆరోపించింది.

లిక్కర్ పాలసీ స్కామ్‌లో కేజ్రీవాల్ సూత్రధారి
ఈ కుంభకోణంలో ఆయన ప్రత్యక్ష పాత్ర
ఆధారాలు దొరికినందునే అరెస్టు చేశాం
బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించిన సీబీఐ
ఆధారాలు లేవు.. రికవరీలూ లేవు
వదంతులపై పెట్టిన కేసే ఇది
కేజ్రీవాల్ తరఫు న్యాయవాది సింఘ్వి
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూత్రధారి అని సీబీఐ ఆరోపించింది. ఆధారాలు లభించడం మొదలైన తర్వాతే ఆయనను అరెస్టు చేశామని సీబీఐ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీపీ సింగ్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న ఢిల్లీ హౌకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన తర్వాత దర్యాప్తు సంస్థకు ఆధారాలు లభించాయని డీపీ సింగ్ తెలిపారు. ఆప్ కార్యకర్తలు సహా అనేక మంది ముందుకు రావడం మొదలు పెట్టారని పేర్కొన్నారు. ఆప్ చీఫ్‌ను అరెస్టు చేయకుండా సీబీఐ తన దర్యాప్తును ముగించలేక పోయేదని తెలిపారు. ఈ స్కాంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారని నిరూపించేందుకు సీబీఐకి ఆధారాలు లభించాయని చెప్పారు. చార్జ్‌షీటు దాఖలైన తర్వాత కూడా ముఖ్యమంత్రి నేరుగా లేదా పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని డీపీ సింగ్ చెప్పారు. పోలీస్ రిమాండ్‌లో ఉన్నప్పుడు మినహా ఇంత వరకూ కేజ్రీవాల్‌ను దర్యాప్తు సంస్థ ఇంటరాగేట్ చేయలేదని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టు దృష్టికి తెచ్చారు. కేజ్రీవాల్‌పై నేరుగా ఆధారాలు ఏమీ లేవని, ఆయన నివాసాల నుంచి రికవరీ చేసింది కూడా ఏమీ లేదని పేర్కొన్నారు. లిక్కర్ పాలసీ తయారీ లేదా అమలులో కేజ్రీవాల్ ఒక్కరే పాల్గొనలేదని, లెఫ్టినెంట్ గవర్నర్, 9 మంది మంత్రులతోపాటు దాదాపు 50 మంది అధికారులతో కూడిన వ్యవస్థాగత నిర్ణయమని అన్నారు. ‘ఈ రోజు నేరుగా సాక్ష్యాలు లేవు. నేరుగా రికవరీ చేసిందేమీ లేదు. ఇది కేవలం వదంతుల ఆధారంగా పెట్టిన కేసు’ అని సింఘ్వి వాదించారు. ఈ కేసులో లెఫ్టినెంట్ గవర్నర్‌ను కూడా నిందితుడిగా సీబీఐ చేర్చాలని డిమాండ్ చేశారు. దీనికి అభ్యంతరం తెలిపిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీపీ సింగ్.. ఈ విషయంలో ఎల్జీ పాత్ర ఏమీ లేదని అన్నారు.