మహారాష్ట్ర అడవుల్లో అమెరికన్‌ను బంధించిన భర్త … దాదాపు 40 రోజులుగా అన్న పానీయాలు లేక అవస్థ
తనతో గొడవ పడిన భార్యను అడవికి తీసుకెళ్లి గొలుసుతో ఆమె కాళ్లను చెట్టుకు కట్టేసి పరారయ్యాడో భర్త. అలా 40రోజుల పాటు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తు ఆర్తనాదాలు చేస్తున్న ఆమెను ఓ గొర్రెలకాపరి చూడడంతో ప్రాణాలతో బయటపడగలిగింది

విధాత, హైదరాబాద్ : తనతో గొడవ పడిన భార్యను అడవికి తీసుకెళ్లి గొలుసుతో ఆమె కాళ్లను చెట్టుకు కట్టేసి పరారయ్యాడో భర్త. అలా 40రోజుల పాటు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తు ఆర్తనాదాలు చేస్తున్న ఆమెను ఓ గొర్రెలకాపరి చూడడంతో ప్రాణాలతో బయటపడగలిగింది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైకి 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింధుదుర్గ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో సోనుర్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి శనివారం ఆమె ఏడుపు విని దగ్గరకు వెళ్లి చూసి నిర్ఘాంతపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించి ప్రాథమిక చికిత్స అనంతరం గోవా ఆసుపత్రికి తరలించారు. ఆమెను అమెరికాకు చెందిన లలిత కాయి కుమార్ (50)గా గుర్తించారు. ప్రస్తుతం ఆమె తమిళనాడులో ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. బాధిత మహిళ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఆమె తన సమస్యలను పేపరు మీద రాసి వైద్యులకు తెలిపింది. 40 రోజులుగా తనకు ఆహారం లేదని, చిన్నపాటి గొడవ తర్వాత భర్తే తనను అడవిలోకి తీసుకెళ్లి గొలుసుతో చెట్టుకు కట్టేసినట్టు పేపర్‌లో తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె వాంగ్మూలం ఇచ్చే పరిస్థితిలో లేదని, రెండ్రోజుల నుంచి ఆమె ఏమీ తీసుకోకపోవడంతో బలహీనంగా ఉందని పోలీసులు తెలిపారు. ఎన్ని రోజుల నుంచి ఆమెను చెట్టుకు కట్టేశారో తెలియదని చెప్పారు. ఆమె నుంచి తమిళనాడు చిరునామాతో ఉన్న ఆధార్‌కార్డు, అమెరికన్ పాస్‌పోర్టుని స్వాధీనం చేసుకున్నారు.