కేరళం సీఎంగా వీ.డీ. సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, సిద్ధరామయ్య, సుఖ్విందర్ సింగ్ సుఖు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు హాజరయ్యారు. తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ సతీశన్ తో సీఎంగా ప్రమాణం చేయించారు. 20 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
మంత్రుల ప్రమాణ స్వీకారం
20 మందిలో 14 మంది తొలిసారిగా బాధ్యతలు చేపట్టినవారే కావడం గమనార్హం. సామాజిక, ప్రాంతీయ, మిత్రపక్షాల సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రులను ఎంపిక చేసింది. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో IUML నుంచి 5గురు, జోసెఫ్ కేరళ కాంగ్రెస్, జాకబ్ కేరళ కాంగ్రెస్, RSP, CMP నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.
మంత్రులుగా చెన్నితల్ రమేశ్, కున్‌హల్‌కుట్టి, మురళీధరన్, షాజీ, అబ్దుల్ గఫర్, బషీర్, మోన్స్ జోసెఫ్.. ఇతరులు ఉన్నారు. అలాగే ఆయన కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు చోటు లభించింది. తులసి, బిందు కృష్ణలు మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధించింది. మొత్తం 140 స్థానాల్లో పోటీపడిన ఈ కూటమి 102 చోట్ల గెలుపొందింది. తాజా మాజీ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ (LDF) కూటమి 35 సీట్లు, బీజేపీ 3 సీట్లు గెలుచుకున్నాయి.
సతీశన్ నేపథ్యం
వడక్కేయిల్ దామోదరన్ సతీశన్ నెట్టూరు, ఎర్నాకులం జిల్లాలో మే 31, 1964న ఆయన జన్మించారు. పనంపిల్లి నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. తేవరలోని సేక్రేడ్ హార్ట్ కళాశాలలో అండర్-గ్రాడ్యుయేషన్ చదివారు. రాజగిరి కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుండి సోషల్ వర్క్‌లో (MSW) పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు . ఆ తర్వాత అతను కేరళ లా అకాడమీ లా కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ లాస్ (LLB), తిరువనంతపురంలోని ప్రభుత్వ లా కాలేజీ నుండి మాస్టర్ ఆఫ్ లాస్ (LLM) పూర్తి చేశారు. ఆర్. లక్ష్మీ ప్రియను సతీశన్ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఉన్నిమాయ అనే కుమార్తె ఉంది.
రాజకీయాల్లోకి రాకముందు 10ఏళ్ల పాటు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. NSUI ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. సతీశన్ 1996లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సతీశన్ కమ్యూనిస్ట్ కోటగా ఉన్న పరాపూర్ నుండి కేరళ శాసనసభ ఎన్నికలలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి పి. రాజు చేతిలో ఓడిపోయారు. 2001లో మొదటిసారిగా పరావూర్ నియోజకవర్గం నుంచి కేరళ అసెంబ్లీకి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుండి వరుసగా ఆరుసార్లు (2001, 2006, 2011, 2016, 2021,2026) అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికల తర్వాత, రమేష్ చెన్నితాల స్థానంలో సతీశన్ ను కేరళ శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఎల్డీఎఫ్ ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తూ అనేక పోరాటాలు చేస్తూ వచ్చిన సతీశన్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. పీఏసీ, అంచనాల కమిటీ చైర్మన్ గా పనిచేశారు. కేపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా, ఏఐసీసీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి :
Heat Wave | నిప్పుల కొలిమిలా తెలంగాణ..! మరో ఏడు రోజులు మండుటెండలే..!!
జయం రవి విడాకుల ట్విస్ట్.. భరణం లెక్కలు వింటే మతిపోవాల్సిందే.. ఒక్కో నెల ఇన్ని లక్షలా?
