Climate change | మరో పదిహేనేళ్లలోనే ఆ సిటీల్లో జీవనం అసాధ్యం! ఇండియాలో ఆ సిటీలు కూడా?

చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం అనుభవించాల్సి రావడం అంటే ఇదేనేమో. ప్రకృతిని ఇష్టారాజ్యంగా ధ్వంసం చేస్తున్న ఆధునిక మానవడిపై ప్రకృతి కన్నెర్ర చేస్తున్నది. ఇప్పటికే అకాల వర్షాలు, అనూహ్య వరదలు, భరించలేని స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో డేంజర్‌ సిగ్నల్స్‌ పంపుతున్నది. వాటిని గ్రహించి, తగిన చర్యలు తీసుకోని పక్షంలో భారత్‌లోని రెండు నగరాలు సహా అనేక సిటీలు జలసమాధి అవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

  • By: TAAZ    news    Apr 29, 2025 7:00 AM IST
Climate change | మరో పదిహేనేళ్లలోనే ఆ సిటీల్లో జీవనం అసాధ్యం! ఇండియాలో ఆ సిటీలు కూడా?

Climate change |

మన ప్రకృతిని మనమే ధ్వంసం చేసుకుంటున్నాం. అడ్డూ అదుపూ లేకుండా వెలువుడుతున్న కర్బన ఉద్గారాల ఫలితంగా అనేక నగరాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అక్కడి కాంక్రీట్‌ జంగిల్‌.. వాటిని మరింత పెంచుతున్నది. యథేచ్ఛగా అడవులు నరికేస్తున్నాం. ఫలితంగా సముద్ర జలాలు అసాధారణంగా వెచ్చబడుతున్నాయి. ఆ పరిణామంతో హిమానీనదాలు కరిగి.. సముద్ర జల మట్టాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులు రానున్న కొన్ని సంవత్సరాల్లోనే ప్రపంచంలోని అనేక ప్రముఖ నగరాలను నివాసానికి మన జీవితకాలంలో అయోగ్యంగా మార్చనున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చుట్టూ దట్టంగా కమ్మేసిన పొగతో కూడిన మంచు! రోడ్లపైకి వచ్చేసిన సముద్ర జలాలు లేదా భరించలేని వేడి! ఈ పరిస్థితిలో కాలు బయటకు పెట్టే సాహసం కూడా ఎవరూ చేయలేని స్థితిలో.. అనేక నగరాలను ఖాళీ చేయాల్సిన దుస్థితి దాపురిస్తుందని శాస్త్రవేత్తలు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పర్యావరణ మార్పులు అత్యంత వేగంగా చోటుచేసుకుంటున్న సమయంలో అనేక తీర ప్రాంత ప్రఖ్యాత నగరాల్లోకి సముద్ర జలాలు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. అందులో భారతదేశంలోని ఒక నగరం కూడా ఉన్నది. ఆ నగరాలేంటో వాటికి కలిగే ప్రభావాలేంటో చూద్దాం..

జకార్తా

ఇండోనేషియా రాజధాని జకార్తా నిత్యం సందడిగా ఉంటుంది. ఈ నగరాన్ని సముద్ర జలాలు అత్యంత వేగంగా ముంచేస్తున్నాయి. ఈ నగరంలోని కొన్ని ప్రాంతాలు ఏటా 25 సెంటీమీటర్ల మేర ముంపునకు గురవుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూగర్భ జలాలను మితిమీరి తోడేయడం, భూమిపై అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వేస్తున్న అధిక భారం కారణంగా దిగ్భ్రాంతికర స్థాయిలో ఈ నగరం భూమిని కోల్పోతున్నది. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా 2040 నాటికి పెరిగే సముద్ర జల మట్టాలు.. జకార్తా నగరంలోని పెద్ద భాగాన్ని సముద్రంలో కలిపేయనున్నవి. ఫలితంగా లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వస్తుంది. తమ కళ్ల ముందే తమ నగరం సముద్రగర్భంలోకి వెళ్లిపోతుందనే ఆందోళనతో ప్రజలు జీవిస్తున్నారు.

మియామి

అద్భుతమైన నైట్‌లైఫ్‌కు, సన్‌షైన్‌కు ప్రఖ్యాతి పొందిన అమెరికా నగరం మియామి.. ఇప్పుడు పర్యావరణ మార్పుల ప్రతిఫలాలను అనుభవించేందుకు సిద్ధమవుతున్నది. దక్షిణ ఫ్లోరిడాలో సముద్ర జలాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఫలిలంగా మియామీ బీచ్‌లు ఆధునిక కాలపు అట్లాంటిస్‌ (గ్రీక్‌ పురాతన కథల్లో నీట మునిగిన ద్వీపం)గా మిగిలిపోనున్నాయని అంటున్నారు. నగర తాగునీటి వ్యవస్థలను సముద్రపు ఉప్పునీరు ఆక్రమించనున్నది. వర్షాలు లేనప్పటికీ నగరంలోకి నిత్యం నీళ్ల ప్రవాహం ఉంటుంది. 2040 నాటికి మియామీలో సాధారణ జన జీవితం అసంభవమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఢాకా

బంగ్లాదేశ్‌ రాజధాని అయిన ఢాకా నగరం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మెగా సిటీల్లో ఒకటి. అదే సమయంలో అత్యంత దుర్బల ప్రాంతం. ఇక్కడి ఏటా లక్షల మంది ప్రజలు వడగాలులు, తీవ్రస్థాయి వరదలు, భయానక వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నగరం ఉన్నదే దిగువ డెల్టా ప్రాంతంలో. దీంతో సహజంగానే సముద్ర జలాలు పెరుగుతున్నప్పుడు ఈ నగరం తొలి టార్గెట్‌ కానున్నది. 2040 నాటికి నగరంలోని రోడ్లపైకి నీళ్లు వస్తాయని, భయానక వేడి వాతావరణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దానికి తోడు గాలి నాణ్యత గణనీయంగా పడిపోతుందని హెచ్చరిస్తున్నారు.

దుబాయి

అసాధ్యాలు ఈ నగరంలో సుసాధ్యాలవుతుంటాయి. ఆకాశాన్నంటే భవనాలు, విలాసవంతమైన జీవితం ఈ నగరం సొంతం. కానీ.. భవిష్యత్తు మాత్రం దిక్కతోచనీయడం లేదు. 2040 నాటికి ఈ నగరంలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ దాటిపోయే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆ స్థాయి ఉష్ణోగ్రతలతో వీచే వడగాలులకు మనుషుల ప్రాణాలు దక్కవని అంటున్నారు. ఏసీల వినియోగం ద్వారా తాత్కాలిక రిలీఫ్‌ దక్కుతుందేమో గానీ.. ఆ విద్యుత్తు డిమాండ్‌ను తట్టుకోలేదని అంటున్నారు. నీటి కొరత అనేది దుబాయికి అదనపు కొరత కానున్నదని చెబుతున్నారు. ప్రస్తుతం దుబాయిలో ఉన్న పరిస్థితులు ఇలానే కొనసాగితే నగర వీధులను నిప్పుల కొలిమిలా మార్చుతాయని హెచ్చరిస్తున్నారు.

కోల్‌కతా

భారతదేశపు సాంస్కృతిక రాజధానిగా భాసిల్లుతున్న కోల్‌కతా.. తీవ్ర పర్యావరణ మార్పులకు గురవుతున్నది. ఈ నగరంలో వరదలు నిత్యకృత్యమయ్యాయి. ఫలితంగా వర్షాకాలాల్లో నిత్యం రహదారులు వాగులను తలపిస్తున్నాయి. అదే సమయంలో వడగాలుల తీవ్రతతో రోజువారీ కార్యకలాపాలకు బయటకు వచ్చే లక్ష్లల మందిని ప్రమాదకరంగా ప్రభావితం చేస్తున్నాయి. 2040 నాటికి నీళ్లతో నిండిపోయిన పరిసరాలు, వడదెబ్బల ముప్పు, తీవ్రస్థాయి ప్రకృతి వైపరీత్యాలతో, వ్యాధులు పెల్లుబికి సాధారణ జీవితం కుప్పకూలుతుందని, ఫలితంగా ప్రజలు ఈ నగరాన్ని వదిలిపెట్టి పోవాల్సిన దుస్థితి నెలకొంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

బెంగళూరు

భారతదేశపు సిలికాన్‌ వ్యాలీగా పిలుచుకునే బెంగళూరు నగరం తాగునీటి వంటి వనరులకు ఇప్పటికే దూరమవుతున్నది. వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, ఇష్టారాజ్యంగా భూగర్భ జలాల తోడివేతతో తీవ్ర నీటి కొరత ఎదుర్కొనబోతున్నదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పటిక నగర సమీపంలోని అనేక చెరువులు అదృశ్యమయ్యాయి. వాటిలో కాంక్రీట్‌ నిర్మాణాలు వెలిశాయి. ఇప్పటికే నీటి కొరత నగర వాసులను వేధిస్తున్నది. ఈ కారణంగా 2040 నాటికి బెంగళూరు నుంచి దాదాపు సగం మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు వెళ్లిపోకుండా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు.

ఇంకా ఎన్నో నగరాలకు ఇదే ముప్పు

2018లో ఏ ఇంటిలోనూ నీటి పంపులు పనిచేయని కారణంగా ప్రపంచ పత్రికల పతాక శీర్షికలకెక్కింన కేప్‌ టౌన్‌, ఇప్పటికే దట్టమైన కాలుష్యపు పొగలు ఆవరించుకుని, సమీప గోబీ ఎడారి నుంచి వచ్చే గాలిదుమ్ములతో అతలాకుతలమవుతున్న బీజింగ్‌, న్యూ ఆర్లీన్స్‌, చైనా వాణిజ్య రాజధాని షాంఘై, తీవ్ర ప్రకృతి వైపరీత్యాలకు నెలవైన హూస్టన్‌, నిత్యం టైఫూన్‌లు, సముద్ర జలాల ముందుకొస్తున్న ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలా, ఈజిప్ట్‌లోని కైరో, మెక్సికో సిటీ, పాకిస్తాన్‌లోని కరాచీ, అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ ఎయిర్స్‌, ఇంగ్లండ్‌ రాజధాని లండన్‌, ఆస్ట్రేలియాలోని సిడ్నీ, అందమైన నగరం వెనిస్‌, తదితర నగరాలు సైతం తగిన చర్యలు తీసుకోని పక్షంలో జల సమాధి కావడం తథ్యమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.