కులగణన నిర్వహణకు కేంద్రం ఏర్పాట్లు… 30 ప్రశ్నలు సిద్ధం

– 2027 మార్చి 1న దేశవ్యాప్తంగా ప్రక్రియ
– కొన్ని రాష్ట్రాల్లో 2026 అక్టోబర్ లోనే..
విధాత, ఢిల్లీ దేశవ్యాప్తంగా జనగణన, కులగణన నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కులాలు, ఉప కులాలను కూడా లెక్కించబోతున్నారు. 2027 మార్చి 1న ఈ ప్రక్రియ మొదలుపెట్టనట్టు కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపారు. దేశంలో 16 ఏండ్ల తర్వాత జనాభా లెక్కలు నిర్వహిస్తుండటం గమనార్హం. రిజిస్ట్రార్ జనరల్ అండ్ కమిషనర్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఈ ప్రక్రియ సాగబోతున్నది.
ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం 30 ప్రశ్నలను సిద్ధం చేసుకున్నది. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కులగణన నిర్వహించింది.
మిగిలిన రాష్ట్రాల్లోనూ కలగణన నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాగా కులగణన నిర్వహిస్తామని గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా తాజాగా అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, లద్దాఖ్‌లతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం 2026 అక్టోబర్ ప్రారంభంలోనే లెక్కింపు మొదలుపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
ఈ జనాభా గణన రెండు దశల్లో నిర్వహించనున్నారు. మహిళలు, పురుషుల లెక్కింపుతో పాటు కులం, ఉపకులాలను లెక్కించి జాబితా రూపొందించనున్నారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ‘రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా’ పర్యవేక్షణలో జనాభా లెక్కలు నిర్వహిస్తారు. చివరిసారిగా 2011లో కేంద్ర ప్రభుత్వం కులగణన నిర్వహించింది. అనంతరం 2021లో నిర్వహించాల్సి ఉన్నా కొవిడ్ కారణంగా వాయిదా పడింది.