Maganti Gopinath: మాగంటి గోపీనాథ్ కన్నుమూత

– నేడు ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస
– ఈ నెల 5న గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిక
– కేసీఆర్ సహా పలువురు నేతల సంతాపం
– జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మూడు సార్లు రికార్డు
– టీడీపీ ద్వారా రాజకీయరంగ ప్రవేశం
– అంతకుముందు నాలుగు సినిమాలు నిర్మాణం
Maganti Gopinath: విధాత, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) ఆదివారం ఉదయం 5.45 గంటలకు కన్నుమూశారు. ఈ నెల 5 న గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన మాగంటి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు.
5న ఇంట్లో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఏఐజీకి తరలించారు. కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు వైద్యులు తెలిపారు. సీపీఆర్ చేయడంతో తిరిగి గుండె కొట్టుకున్నది. నాడి, బీపీ సాధారణ స్థితికి రావడంతో… ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగించారు.
కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం కూడా ఏఐజీలో చేరారు. అప్పట్లో డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం. మాగంటి గోపీనాథ్ 1982లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయరంగప్రవేశం చేశారు. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.
2014లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించారు. అనంతరం 2023లో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా వరసగా మూడు సార్లు గెలుపొంది రికార్డు నెలకొల్పారు.
కుటుంబనేపథ్యం ఇదే..
1963 జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు జన్మించారు మాగంటి గోపినాధ్. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.
1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్ గా పనిచేశారు. 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశారు.