Ponguleti | కేసీఆర్‌ది దొర సర్కార్‌.. ప్రజలకు అందుబాటులో మా సర్కార్‌

  • By: sr    news    Apr 27, 2025 11:09 PM IST
Ponguleti | కేసీఆర్‌ది దొర సర్కార్‌.. ప్రజలకు అందుబాటులో మా సర్కార్‌
  • మంచి పాలనపై విషం కక్కిన కేసీఆర్‌
  • బిల్లు పాసయ్యాక సోనియా కాళ్లు మొక్కావు
  • కాళేశ్వరం అవినీతిపై మాట్లాడలేదే?
  • కేసీఆర్‌కు మంత్రి పొంగులేటి కౌంటర్‌

హైద‌రాబాద్‌, ఏప్రిల్ 27 (విధాత‌): బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు దొర మాదిరి ప‌దేళ్లు ప‌రిపాల‌న చేయ‌గా, త‌మ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రజాస్వామ్య ప‌ద్ధ‌తిలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంద‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజ‌ల‌కు అందిస్తున్న మంచి పాల‌న చూసి ఈ రోజు ఎల్క‌తుర్తి స‌భ‌లో కేసీఆర్ విషం క‌క్కార‌న్నారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి నివాసం ముందు రాష్ట్ర మంత్రులు ఎల్క‌తుర్తి స‌భ‌లో కేసీఆర్ చేసిన విమ‌ర్శ‌ల‌పై ప్ర‌తి విమ‌ర్శ‌లు చేశారు. ఆయ‌న పాల‌న‌లో జ‌రిగిన లోపాలు, కాంగ్రెస్ ప్ర‌భుత్వ దిద్దుబాటు చ‌ర్య‌ల‌పై మంత్రులు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ విల‌నా… పార్ల‌మెంటులో బిల్లు పాస్ అయిన త‌రువాత కుటుంబంతో వెళ్లి సోనియా గాంధీ కాళ్లు మొక్కిన విష‌యం అప్ప‌డే మ‌ర్చిపోయావా అని ఆయ‌న గుర్తు చేశారు. ఆయ‌న ప్ర‌భుత్వ హ‌యాంలో వ‌రి వేస్తే ఉరి అని రైతుల‌కు బెదిరించి, త‌న 150 ఎక‌రాల ఫామ్ హౌస్ లో మాత్రం వ‌రి వేశార‌ని ఎద్దేవా చేశారు.

స‌ర్పంచుల‌కు బ‌కాయిలు ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న అంటున్నారు, మా ప్ర‌భుత్వంలో స‌ర్పంచులు లేనే లేర‌ని, వారు ఒక్క రూపాయి ప‌ని కూడా చేయ‌లేద‌న్నారు. కాంట్రాక్ట‌ర్ల‌కు రూ.80వేల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోయార‌న్నారు. మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని కేసీఆర్ క‌ల‌లు గంటున్నారు, ఆయ‌న ప‌డ‌గొడితే ప‌డిపోవడానికి ఇది బొమ్మ‌రిల్లు కాద‌ని అన్నారు. ఎల్క‌తుర్తి స‌భ‌కు ఆటంకాలు పెట్టాలని అనుకుంటే స‌భ‌కు ఈ జ‌నం కూడా వ‌చ్చేవారు కాద‌న్నారు. ధ‌ర‌ణి వెబ్ పోర్ట‌ల్ అక్ర‌మాలు, స‌న్న బియ్యం పంపిణీ, కాళేశ్వ‌రం అవినీతి పై ఎందుకు స‌భ‌లో ప్ర‌స్తావించ‌లేద‌న్నారు. తెలంగాణ వ‌స్తే ద‌ళితుడిని సీఎం చేస్తాన‌న్న ఆయ‌న‌, క‌నీసం ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి హోదాను అయినా కట్ట‌బెట్టాల‌ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతికకు కేసిఆర్ కు లేదని, భార్యాభర్తలు, అన్నదమ్ములు, హైకోర్టు జ‌డ్జీలు, మంత్రులు మొబైల్ ఫోన్ల‌ను ట్యాపింగ్ చేయించి, ఆ పని చేసిన పోలీసు అధికారిని విదేశాల్లో ఉంచి కేసీఆర్‌ డ్రామాలాడుతున్నార‌ని మంత్రి పొంగులేటి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఆయన బాధ ప్రజలకోసం కాదు : సీతక్క

అధికారం కోల్పోయిన త‌రువాత ఆయ‌న కుటుంబంలో చీలిక‌లు వ‌స్తున్నాయ‌ని బాధ‌ప‌డుతున్నారు త‌ప్ప‌, ఆయన ప్ర‌జ‌ల కోసం కాద‌ని పంచాయ‌త్ రాజ్ శాఖ మంత్రి సీత‌క్క విమ‌ర్శించారు. పార్టీ ర‌జ‌తోత్స‌వ వేళ కార్య‌క‌ర్త‌ల త్యాగాల‌ను స్మ‌రించుకుంటార‌ని, గొప్ప‌ద‌నాల గురించి చేప్పుకోకుండా, కాంగ్రెస్ ను విమ‌ర్శించ‌డానికి స‌భ పెట్టార‌ని ఆరోపించారు. ప్ర‌జ‌లు నిర‌స‌న తెలిపేందుకు అవ‌కాశం లేకుండా త‌న హ‌యాంలో ధ‌ర్నా చౌక్ ఎత్తి వేయించార‌ని, ఇప్పుడు అదే ధ‌ర్నాచౌక్ వ‌ద్ధ ఆయ‌న కుమార్తె ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ధ‌ర్నాలు చేస్తున్నార‌న్నారు.

తెలంగాణ సోనియా పుణ్యం: పొన్నం

కాంగ్రెస్ పార్టీ విల‌న్ అన్న వ్యాఖ్యలను కేసీఆర్ త‌క్ష‌ణ‌మే ఉప‌సంహ‌రించుకోవాలి, సోనియా గాంధీ లేక‌పోయి ఉంటే వంద మంది కేసీఆర్‌లు వ‌చ్చినా తెలంగాణ వ‌చ్చేది కాద‌ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. అగ్గిపెట్టె రాజకీయానికి ప్రాణాలర్పించిన తెలంగాణ వాళ్లకు కనీసం నివాళ్లు అర్పించారా? అని నిలదీశారు. సభకు జనం రాకపోవడం వల్లే… కేసీఆర్ ప్రాంగణానికి వచ్చి కూడా అర్ధగంట సేపు వేదిక పైకి రాలేదని పొన్నం విమ‌ర్శించారు. త‌న హ‌యాంలో రూ.8 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోయార‌ని, ఏ ఒక్క ప‌థ‌కం ఆప‌లేద‌ని ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసే ప‌నిలో ఉన్నారు, ధ‌నిక రాష్ట్రాన్ని అప్ప‌గిస్తే అప్పుల కుప్ప‌గా చేసి వెళ్లిపోయార‌ని విమ‌ర్శించారు. కంచ గ‌చ్చిబౌలి లో ప్రైవేటు వారికి అప్ప‌గించిన 400 ఎకరాల‌ను త‌న హ‌యాంలో వెన‌క్కి ఎందుకు తీసుకురాలేక‌పోయార‌ని జూపల్లి ప్ర‌శ్నించారు.