Haragopal: సంకీర్ణ ప్రభుత్వాలతోనే.. ప్రజల హక్కులకు, ప్రజాస్వామ్యానికి రక్షణ

  • By: sr    news    Mar 21, 2025 5:13 PM IST
Haragopal: సంకీర్ణ ప్రభుత్వాలతోనే.. ప్రజల హక్కులకు, ప్రజాస్వామ్యానికి రక్షణ

Haragopal:

విధాత, వరంగల్ ప్రతినిధి: దేశంలోని విభిన్న జాతులు, కులాలు, మతాలు, బహుళ సంస్కృతి, సాంప్రదాయాలతో కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజల హక్కులకు, ప్రజాస్వామ్యానికి రక్షణ కేవలం సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటు ద్వారానే సాధ్యమని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ సెనేట్ హాల్ లో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “భారత సమాజంలో సంకీర్ణ ప్రభుత్వాలు మరియు ప్రజాస్వామ్యం” అనే అంశంపై జాతీయ సెమినార్ రాజానీతీ శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సంకినేని వెంకటయ్య అధ్యక్షతన జరిగింది.

ఈ జాతీయ సదస్సుకు ప్రొఫెసర్ జి. హరగోపాల్ కీలకోపన్యాసం చేసి మాట్లాడుతూ నిత్యం ప్రజలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరిస్తూ, ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పులు తెచ్చి సమాజాన్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తూ ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడమే రాజకీయ పార్టీల ప్రధాన కర్తవ్యంగా ఉండాలన్నారు. చైతన్యయూతమైన ప్రజలు లేకపోతే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందన్నారు. నేటి రాజకీయ పార్టీలు కార్పొరేట్ శక్తుల ధన ప్రలోభాలకు లోనై ఓటర్లను ప్రభావితం చేయటం ప్రజాస్వామ్య ఉనికికి ప్రమాదకరమన్నారు.

“ఒకే దేశం -ఓకే ఎన్నిక” భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన భారతీయ సమాజానికి నష్టకరమన్నారు. రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలు ఓటర్లను ఆకర్షించడానికి ఉపయోగపడుతున్నప్పటికి వాటి అమలులో మాత్రం చిత్తశుద్ధి లోపిస్తోదన్నారు. 1960 దశకం చివరి నుండి దేశంలో ప్రభుత్వాల ఏర్పాటులో ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరిగిందన్నారు. 1991 నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు, గ్లోబలైజేషన్ ప్రభావాలతో సమాజంలో మానవీయ సంబంధాలు కనుమరుగై, మార్కెట్ సంబంధాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేటితరం విద్యార్థులు సమాజ అభివృద్ధి బాధ్యతను, ప్రశ్నించేతత్వాన్ని, ప్రజాస్వామిక లక్షణాలను పెంపొందించుకోవాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గుల్బర్గా యూనివర్సిటీ యాక్టింగ్ వి.సి. ప్రొఫెసర్ జి.శ్రీరాములు మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉంటాయని, ప్రజల అవసరాల కనుగుణమైన పాలనా అందిస్తేనే ప్రాంతీయ ప్రభుత్వాలకు, సంకీర్ణ ప్రభుత్వాలకు మనుగడ ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ప్రొఫెసర్ వి.రామచంద్రం (కెయురిజిస్ట్రార్), గౌరవ అతిథులుగా ప్రొఫెసర్ టి.మనోహర్( కె యు ప్రిన్సిపాల్), ప్రొఫెసర్ జోష్ జార్జ్ (ముంబై యూనివర్సిటీ), డాక్టర్ జి.కృష్ణయ్య (బి.ఓ.ఎస్. రాజనీతి శాస్త్ర విభాగం)లు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర విభాగం అధ్యాపకులు డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ నాగరాజు, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ సంజీవ్ ,డాక్టర్ లలిత కుమారి, డాక్టర్ విజయ్, డాక్టర్ భాగ్యమ్మ పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.