Kishan Reddy Vs Rajasingh | కిషన్ రెడ్డి, రాజాసింగ్ వివాదంలో కీలక ట్విస్ట్
‘ఒక పార్టీ కార్యకర్తను ఇబ్బంది పెడితే ఏం లాభం? నేను ఎప్పుడూ పార్టీకి అనుకూలంగా నిలబడ్డాను. ఈ రోజు, నేను నా కోసం కాకుండా, పార్టీ ఐక్యత.. అదే ఉద్దేశంతో పనిచేస్తున్న లక్షల మంది కార్యకర్తల మనోబలాన్ని కాపాడుకోవడం కోసం మాట్లాడుతున్నా’ అని రాజాసింగ్ చెప్పారు.
Kishan Reddy Vs Rajasingh | బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల పార్టీ నాయకత్వంపై చేస్తున్న విమర్శల పట్ల కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి స్పందిస్తూ ‘రాజాసింగ్ సీనియర్ నాయకుడు. నేను కేవలం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తను. రాజా సింగ్ ఏమి చెబితే దాన్ని పాటిస్తాం’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై రాజాసింగ్ మరోసారి స్పందించారు. తన ఉద్దేశం ఎప్పుడూ సరళంగా, నిష్కల్మషంగా ఉందని.. పార్టీలోని ప్రతి ఒక్కరూ బాగుపడాలి, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలన్నదే తన ఉద్దేశమని రాజాసింగ్ అన్నారు. తానెప్పుడూ వ్యక్తిగత లబ్ధి లేదా పదవుల కోసం పని చేయలేదని.. తన కృషి ఎప్పుడూ పార్టీని బలోపేతం చేయడం.. దాని ఆదర్శాలను అంకితభావంతో అమలు చేయడానికేనని తెలిపారు. అయితే, తెలంగాణలోని అన్ని 119 నియోజకవర్గాలలో ఎలా విజయం సాధించాలనే దానికి బదులు.. తనను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారని రాజాసింగ్ ఆరోపించారు. పార్టీ నుంచి తనను విడదీసి, అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. తాను పార్టీకి అంకితమై, నిస్వార్థంగా సేవ చేశానని రాజాసింగ్ చెప్పుకొన్నారు.
నన్ను ఇబ్బంది పెడితే ఏం లాభం?
‘నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నా. ఇది పార్టీకి ఏమైనా ఉపయోగపడుతుందా? దయచేసి ఆలోచించండి’ అని కిషన్ రెడ్డిని రాజాసింగ్ కోరారు. ‘ఒక పార్టీ కార్యకర్తను ఇబ్బంది పెడితే ఏం లాభం? నేను ఎప్పుడూ పార్టీకి అనుకూలంగా నిలబడ్డాను. ఈ రోజు, నేను నా కోసం కాకుండా, పార్టీ ఐక్యత.. అదే ఉద్దేశంతో పనిచేస్తున్న లక్షల మంది కార్యకర్తల మనోబలాన్ని కాపాడుకోవడం కోసం మాట్లాడుతున్నా’ అని రాజాసింగ్ చెప్పారు. వ్యక్తిగతంగా వచ్చి కలుస్తానని, కొంత సమయం ఇవ్వాలని కిషన్‌రెడ్డిని అభ్యర్థించారు. తమ సమస్యలు విన్నవించుకోవడం ద్వారా పరస్పర నమ్మకాన్ని పునరుద్ధరించుకోవచ్చని అన్నారు. సమయం ఇస్తే చెప్పిన చోటుకు వచ్చి కలుస్తామని తెలిపారు. పార్టీ విభజనకు కాకుండా.. ఐక్యత కోసం తాము ఆలోచిస్తున్నామని చెప్పారు. మన నిజమైన లక్ష్యాన్ని మరచిపోకూడదని అన్నారు. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం అవసరమని, మనం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram